ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించాలని అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం
జూలై 18, శుక్రవారం ఉదయం 9 గంటలకు సంస్మరణ, సుభాష్ నగర్ స్థూపం దగ్గర, సికింద్రాబాదు
మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా సదస్సు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదు
భరించనలవి కాని దు:ఖం. కనురెప్పల తడి ఆరిపోయే దు:ఖం. ఇది ఎందరిది? ఈ కన్నీటి ముసురు ఎప్పుడు మొదలైంది? విప్లవం ఇంత బాధామయ ఎంపిక అని తెలిసి తెలిసీ వాళ్లు ప్రజల్లోకి వెళ్లిపోయారు. సమాజాన్ని మానవీయంగా తీర్చిదిద్దడానికి తమ ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధమై పోరాటంలో భాగమయ్యారు. ఆ ఎడబాటుతో, కడుపు కోతతో, రేయింబవళ్ల నిరీక్షణతో మాకు విప్లవమంటే ఏమిటో తెలియజేస్తూ వాళ్లు అట్లా జనంలో కలిసిపోయారు. విప్లవమంటే యుద్ధమే కాదు, శాంతి కూడా అని చెబుతూ మాంసపు ముద్దలై మా చేతుల్లోకి తిరిగి వచ్చారు. చితాభస్మమై తిరిగి లేచి పోరాట చరిత్రలో భాగమయ్యారు. చితి మంటలను, బూడిద కుప్పలను, ఎర్రెర్రని స్థూపాలను చూసి భయపడే రాజ్య పాలనతో మా కన్నీరే ఆనవాలుగా మా గుండెల్లో నిలిచిపోయారు.
ఏడాది పొడవునా మిగుల్చుకున్న ఈ దు:ఖాన్ని కలిసి పంచుకొనే రోజు కూడా ఒకటి ఉందనే భరోసా మాకుంది. అదే జూలై 18. మా రక్త సంబంధీకుల తలపోతతో గుండె బరువును దించుకొనే రోజు. వాళ్ల త్యాగాన్ని కీర్తిస్తూ వాళ్ల కర్తవ్య దీక్షకు వినమ్రంగా తల వంచి నిలబడే రోజు. వాళ్ల ఆశయాల కోసం ఏదైనా చేయమని ఆదేశించే రోజు. వాళ్లను తలచుకోవడమంటే వాళ్ల ఆశయాల గురించి మాట్లాడుకోవడమని వాళ్ల అమరత్వంతో మా అనుభవంలోకి వచ్చింది.
సామూహిక సంస్మరణలో ప్రతి ఒక్కరి స్మృతిని సామూహికంగా పదిలపరుచుకుంటూ వస్తున్నాం. గత ఏడాది ఈ రోజున ఎందరినో స్మరించుకున్నాం. ఆ తర్వాత సంవత్సరం పొడవునా వందల శవాల గుట్టలు. పేరు తెలిసిన తల్లులూ బిడ్డలూ ఉన్నారు. ఊరేదో, పేరేదో తెలియని మనుషులు ఉన్నారు. విప్లవంలో పని చేసుకుంటున్నవాళ్లను పాలకులు వెంటాడి హత్య చేశారు. పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్లనూ, ఏటి ఒడ్డున చేపలు పట్టుకుంటున్నవాళ్లనూ, ఇండ్లలో పనిపాటల్లో ఉన్న వాళ్లనూ మూకుమ్మడిగా కాల్చిపారేశారు. ఇదేమిటని అడిగే వాళ్లను నిర్బంధించారు. ప్రజలపై యుద్ధం ఆపాలని అన్న వాళ్లను అర్బన్ మావోయిస్టులని బెదిరించారు. దేశాన్నంతా యుద్ధ క్షేత్రంగా మార్చేశారు.
ఈ దుర్మార్గ యుద్ధంలో నేలరాలిపోయిన వాళ్ల తల్లిదండ్రులదీ, తోడబుట్టినవాళ్లదీ, జీవితం పంచుకున్న వాళ్లందరి శోకం మా వంటిదే. దు:ఖం సార్వజనీనమైనది. వ్యక్తులు ఎవరైనా, ఏ ప్రాంతం వాళ్లయినా మానవ సంబంధాల విధ్వంసంలోని విషాదమంతా ఒక్కటే. దేశాన్నంతా కన్నీరు ముంచెత్తడానికి కారణం ఇప్పుడు అటు నుంచి కగార్ యుద్ధం. ఇటు నుంచి శాంతి చర్చలు జరగాలనే కోలాహలం. ఆ పక్క అందరినీ చంపేస్తామనే క్రూరమైన ప్రకటనలు. ఈ పక్క ప్రజల ప్రాణాల రక్షణ కోసం సాయుధ శాంతి స్వప్నాలు. మానవ ప్రాణానికి ఎవరు ఎలాంటి విలువ ఇస్తారో ఇప్పుడు కదా తేటతెల్లమవుతున్నది. విప్లవం ఎంత సున్నితమైనదో, మానవీయమైనదో మళ్లీ మళ్లీ తెలియజేస్తున్న చిత్తడి రుతువు కదా ఇది. విప్లవకారుల రక్తబంధువులుగా రాజ్యమంటే హింస అనీ, యుద్ధమనీ మరింతగా మేం తెలుసుకుంటున్న కాలం కూడా ఇదే.
యుద్ధం క్రూరమైనది. మానవ వ్యతిరేకమనది. సంపద కోసం, అధికారం కోసం సాగుతున్న యుద్ధం భూమండలాన్ని శవాల దిబ్బగా మార్చేయాలనుకుంటోంది. మన పక్కనే బస్తర్ కావచ్చు. మధ్య భారతదేశమే కావచ్చు. మణిపూర్ కావచ్చు. బైట గాజా అయినా, ఉక్రెయిన్ అయినా ప్రపంచమంతటా ఇదే రుజువు అవుతున్నది. యుద్ధం వద్దు, అంతర్యుద్ధం వద్దు అనే నినాదం ప్రపంచమంతా వినిపిస్తున్నది. శాంతి అత్యవసరంగా ముందుకు వచ్చింది. ద్వేషానికి ప్రేమ, యుద్ధానికి శాంతి పరిష్కారం. రక్తపాతం సృష్టించే యుద్ధం లోకం నోరు మూయిస్తుంది. అబద్ధాలను ఆయుధాలుగా వాడి అందరినీ గెలుచుకోవాలని చూస్తుంది.
మౌనంగా ఉండొద్దు.. బిగ్గరగా అరవమని మా రక్త సంబంధీకులైన విప్లవకారులు చెప్పి వెళ్లారు. వాళ్ల విప్లవాచరణలాగే అమరత్వమూ అదే సందేశం ఇస్తోంది. మూడు నెలల నుంచి ప్రాణ త్యాగం చేస్తున్న విప్లవకారులందరూ యుద్ధంలో ఒరిగిపోతూ శాంతిని ఎలుగెత్తి చాటుతున్నారు. వాళ్లను స్మరించుకోవడమంటే శాంతి కోసం ఉద్యమించడమే. విప్లవకారుల, ప్రజల ప్రాణాలు కాపాడుకోవమే. మనుషులను చంపేసి భూమి, నేల, చెట్లు, అటవీ గర్భంలోని వనరులు, ప్రజల రక్తమాంసాలతో తయారైన సకల సంపదలు దోచుకోవడానికే ఈ యుద్ధం. దీన్ని అడ్డుకొనే ప్రయత్నమే శాంతి చర్చలు. శాంతి అంటే శ్మశాన శాంతి కాదు. మౌనంగా పక్కకు తొలగిపోవడం కాదు. పోరాటం నుంచి నిష్క్రమించడం కాదు. శాంతి అంటే మానవ ప్రాణానికి రక్షణ. శాంతి అంటే మనుషులు చైతన్యవంతంగా గొంతెత్తి మాట్లాడటం. అట్లా మాట్లాడగల వాతావరణం ఉండటం. ఈ సమాజం ఎంత హింసాత్మకంగా ఉన్నదో విప్పి చూపడం. హింసను నివారించగల అర్థవంతమైన పరిష్కారాలు వెతకడం. సారాంశంలో ఈ దుర్మార్గ యుద్ధం నుంచి వెనక్కి తగ్గేలా కాల్పుల విరమణకు సిద్ధం కావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకరావడమే. ప్రజలను బలి తీసుకుంటున్న యుద్ధాన్ని నిలువరించేందుకు శాంతి ఒక నిత్య జీవితావసరం. యుద్ధానికి శాంతి మాత్రమే ఏకైక ప్రత్యర్థి.
మానవ ఆకాంక్షల్లో శాంతి ఎంత అద్భుతమైనదో మూడు నెలలుగా చూస్తున్నాం. విప్లవంలో ఉన్న మా రక్త సంబంధీకులను వేల సైనిక బలగాలు చుట్టుముట్టి హత్య చేయడాన్ని ఖండిస్తూ శాంతి ప్రజా ఉద్యమ రూపాన్ని తీసుకుంది. కాల్పుల విరమణ ప్రకటించాలని సమాజమంతా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది. మనుషులు స్వేచ్ఛను కోరుకున్నట్లే, విముక్తిని ఆకాంక్షించినట్లే, నూతన సమాజానికి పోరాడినట్లే శాంతి కోసం పరితపిస్తారు.
కానీ పాలకులకు శాంతి అంటే పడదు. హింస మీద బతికే రాజ్యానికి హంతక భాష మాత్రమే వచ్చు. విప్లవకారులందరినీ చంపేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. హత్యలు చేసి శాంతి స్థాపిస్తా అంటున్నది. ఏక పక్ష కాల్పులు తప్ప కాల్పుల విరమణ ఒప్పందం లేనేలేదని తెగించి అంటోంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి. బీజేపీకంటే తాను భిన్నమని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. మరి విప్లవకారులతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమవుతుందా? అమరుల రక్త బంధువులుగా ఈ హత్యాకాండను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకరావాలని అందరినీ కోరుతున్నాం.
విప్లవకారుల తల్లులకు, జీవన సహచరులకు, అన్నదమ్ములకు దు:ఖాన్ని తప్పించడానికి సమాజం ముందుకు రావాలి. మేధావులు జోక్యం చేసుకోవాలి. ఈ దుర్మార్గమైన ఆపరేషన్ కగార్ ఆపాలని వీధుల్లోకి రావాలి. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగం పట్ల తన నిబద్ధతను చాటుకోవాలి. మానవీయతకు, నాగరికతకు గీటురాయి అయిన శాంతి చర్చలకు సిద్ధం కావాలి. అంతకంటే ముందు కాల్పుల విరమణను ప్రకటించాలి.
ఈ జూలై 18ని ఇప్పటి దాకా అమరులైన వారిని స్మరించుకోవడంతో సరిపెట్టుకోదల్చుకోలేదు. కాల్పుల విరమణ పోరాట దినంగా నిర్వహించుకోదలిచాం. తెలంగాణలో మానవత్వానికి, రాజ్యాంగానికి చోటు ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ పడేదాకా ఉద్యమించాల్సిందే అని ప్రకటించదల్చుకున్నాం. అమరుల రక్త సంబంధీకులతో గొంతు కలపమని అందరినీ కోరుతున్నాం.
కార్యక్రమం
జూలై 18 శుకవ్రారం మధ్యాన్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు
అమరవీరుల స్థూపావిష్కరణ
మొదటి సెషన్ అధ్యక్షత: అంజమ్మ
అంశం: చట్టాలు-మృతదేహాల హక్కులు
వక్తలు: బేలాభాటియా, డి. సురేష్
అంశం: కగార్ అంటే ప్రజలపై యుద్ధం
వక్త: సాదినేని వెంకటేశ్వర్లు
రెండో సెషన్ అధ్యక్షత: లక్ష్మణరావు
అంశం: స్త్రీ విముక్తిలో, వర్గ విముక్తిలో విప్లవ మహిళా ఉద్యమం
వక్త: బి అనూరాధ
అంశం: విప్లవోద్యమంలో ఈ తరం విద్యార్థులు
వక్త: ఎస్‌ఎ డేవిడ్
అంశం: కాల్పుల విరమణ అవసరం
వక్త: ఎన్ వేణుగోపాల్
అంశం: మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించగలరా?
వక్త: పాణి
గత ఏడాది జూలై18 నుండి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుండి అమరులైన వారి వివరాలు:
- నల్లమూరి అశోక్@ విజయేందర్ 25/07/2024
- మాచర్ల ఏసోబు@ జగన్ 03/09/2024
- ప్రో. సాయిబాబా 12/10/2024
- ఏగోలపు మల్లన్న 01/12/2024
- పృధ్విరాజ్ మోహన్ రావు 12/12/2014
- చలపతి 21/01/2025
- సారన్న 25/03/2025
- గుమ్మడవెల్లి రేణుక 31/03/2025
- పండన్న 08/05/2025
- డా. రవి 15/05/225
- నంబాల కేశవరావు 21/05/225
- సజ్జా నాగేశ్వరరావు 21/05/225
- రాకేష్ 21/05/225
- విజయలక్ష్మి@ భూమిక 21/05/225
- లలిత@ సంగీత 21/05/225
- తెంటు సింహాచలం@ సుధాకర్ 05/06/2025
- అడెల్లు భాస్కర్ 06/06/2025
- గణేష్ 17/06/2025
- అరుణ 17/06/2025.
అమరుల బంధు మితృల సంఘం



