దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పిడిఎం) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. క్రాంతి కుమార్ (67)
17-6-2025 అర్ధరాత్రి 1-20 నిమిషాలకు తీవ్ర అనారోగ్యం తోటి మంగళగిరి మండలం డోలాస్ నగర్ లో అసువులుబాశారు.
67 ఏళ్ల క్రితం సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన కామ్రేడ్ ఎన్ క్రాంతి కుమార్ (మెషక్) చెప్పులు కార్మికుడిగా, చర్మ కారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సంఘ నిర్మాణం చేసి ఉద్యమాలు చేశారు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, ముస్లిం లపై హిందుత్వ దాడులకు వ్యతిరేకంగా , భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, జాతి విముక్తి పోరాటాలకు, ప్రజా ఉద్యమాలపై రాజ్యనిర్బంగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ఉద్యమాల్ని నిర్వహించిన అఖిలభారత ప్రజా ప్రతిఘటనవేదిక (ఏ ఐ పి ఆర్ ఎఫ్) కృష్ణాజిల్లా కార్యదర్శిగా, 2000 సంవత్సరం నుండి 2004 వరకు పనిచేశారు, 2005లో కామ్రేడ్స్ భగత్ సింగ్ , రాజగురు, సుఖదేవులు, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి స్ఫూర్తితో ఏర్పడ్డ పిడిఎంలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు, 2024 నుండి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
గత కొన్ని సంవత్సరాల నుండి ఆనా రోగ్యం పాలై తాను విజయవాడలో తయారు చేస్తున్న కుటీర చెప్పుల ఉత్పత్తి కేంద్రాన్ని నిలుపుదల చేసి, కొంతకాలం ఖాళీగా ఉండి, తిరిగి మరల సంఘ నిర్మాణంలో, చెప్పుల తయారీలో పాల్గొనడంతో అనారోగ్య సమస్య తీవ్రతరమై వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, డయాలసిస్ కి శరీరం సహకరించక అనేక ఇబ్బందులు పడి అమరులయ్యాడు.
కష్టకాలంలో అధ్యక్షత బాధ్యతను చిరునవ్వుతో స్వీకరించి ‘నా శక్తి మేరకు సంఘ నిర్మాణం అభివృద్ధి కోసం కృషి చేస్తాన’ని, తాను చెప్పిన దానికి కట్టుబడి సంస్థ కోసం నిలబడ్డాడు, ఆయన ఇంటిపై ఎన్ఐఏ దాడులు చేసినా, అనేకసార్లు విచారణ పేరుతో ఆయనను ఇబ్బందులకు గురి చేసినా తన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని నిబద్ధతగా నిలబడ్డ కామ్రేడ్ క్రాంతి కుమార్. ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రజా ఉద్యమాల అభివృద్ధికి తన వంతు కృషి చేశాడు. అమరులు కామ్రేడ్ పున్నారావు, వెంకన్న తదితరులతో కలిసి ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేశారు. రాజకీయంగా ఎలాంటి శషభిషలు లేకుండా, కచ్చితంగా పోరాట మార్గాన్ని ఎత్తిపట్టిన కామ్రేడ్ ఎన్. క్రాంతి కుమార్ కు పిడియం రాష్ట్ర కమిటీ నివాళులర్పిస్తోంది.
దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం ( పిడిఎం)
ఆంధ్రప్రదేశ్