శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎటువంటి షర తులు విధించకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఉత్తర – పశ్చిమ సబ్ జోనల్ కమిటీ కార్యదర్శి రూపేశ్ స్పష్టం చేశారు. శాంతి చర్చల అంశంపై మరింత వివరణ ఇచ్చేందుకు బస్తర్‌లోని గుర్తు తెలియని ప్రదేశం నుంచి బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే
రాజ్యంగ బద్ధంగా ఆయుధాలు వదిలేసి వస్తే చర్చలకు తాము సిద్ధమని చత్తీస్‌గడ్ హోం మినిస్టర్ విజయ్‌శర్మ అంటున్నారు. మరీ ఆయుధాలు పట్టుకున్న వారిని చంపేయాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది. ఏ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బూటకపు ఎన్‌కౌంటర్లలో మా వాళ్లని చంపేస్తున్నారు. మేము ఎందుకు ఆయుధం పట్టుకున్నామో అందరికీ తెలుసు, అలా ఆయుధం పట్టుకున్న వారితో ఎలా వ్యవహరించాలనే రాజ్యంగంలో రాసి ఉంది కదా. మరీ దాన్ని ఎందుకు ప్రభుత్వం పాటించడం లేదు. వాళ్లకు తెలిసే తప్పులు చేస్తున్నారు. కామ్రేడ్ రేణుక, నాకు మధ్య ఇటీవల శాంతి చర్చల ప్రక్రియ మీద చర్చ జరిగింది, ఆ మరుసటి రోజే బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఆమె చనిపోయింది. దీనిపై భద్రతా దళాలు సంబరాలు చేసుకున్నాయి. దీన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి. కాబట్టి, షరతులు లేకుండా మమ్మల్ని చర్చలకు పిలవాలి, ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నాం. శాంతి చర్చలు జరగాలని ప్రభుత్వం అనుకుంటే చర్చలు జరుగుతాయి, వారు కాదనుకుంటే మేం ఏం చేయగలం. మా వరకు మేం శాంతి చర్చల ప్రతిపాదన తెచ్చాం. ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం.
సీజ్‌ఫైర్ కావాలి
శాంతి చర్చలపై ముందుగా అభయ్ నుంచి లేఖ వచ్చింది. తర్వాత నేను లేఖలు ఇచ్చాను. మా పార్టీకి సంబంధించిన వేర్వేరు కమిటీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. శాంతి చర్చల అంశంపై మా కమిటీలు అన్ని కూర్చుని విధి విధానాలపై మాట్లాడుకుని ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నాం. కానీ నిర్బంధం కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. ఆరంభంలో ఆరు నెలలు సీజ్ ఫైర్ అడిగాం. ఇప్పుడు నెల రోజులు చాలంటున్నాం. క్యాంపులు ఎత్తి వేయనక్కర్లేదని చెబుతున్నాం. శాంతి చర్చలకు ముందు సీజ్ ఫైర్ అమలు చేయడం ఎక్కడైనా ఉన్న ఆనవాయితీనే ఇజ్రాయిల్ – గాజా పోరాటంలోనూ ఇదే జరిగింది. మా తరఫున ఇప్పటికే అడవిలో అభివృద్ధి పనులు జరిగే చోట, రోడ్ ఓపెనింగ్ పార్టీలు వెళ్లే చోట బాంబులు పెట్టొద్దని నా వరకు నేను ఆదేశాలు ఇచ్చాను. వ్యూహత్మక ప్రాంతాల్లో రక్షణ చర్యలు తప్పవు.
లొంగిపోయే మావోయిస్టులకు మంచి ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం అంటోంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు. విప్లవంపై నమ్మకం సడలిన వాళ్లు, భయపడ్డవారు, స్వార్థపరులు లొంగిపోతారు. కానీ ప్రాణాలకు తెగించి విప్లవ పోరాటంలోకి వచ్చిన వాళ్లు లొంగిపోరు. కడదాక పోరాడుతారు. ఇటీవల ఎదురుకాల్పుల్లో చనిపోయిన ప్రతీ మావోయిస్టు దగ్గర ఆధునిక ఆయుధాలు కనిపిస్తున్నాయి. అవన్నీ మావి కాదు.
డీఆర్‌జీతో నష్టాలు
ప్రభుత్వం నెలకొల్పిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్‌తోనే మాకు ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు. కానీ డీఆర్‌జీలో పని చేసే వాళ్లు ముందుగా మా దగ్గరే శిక్షణ తీసుకుని వెళ్లారనే విషయం మరువకూడదు. పార్టీ నియమ నిబంధనలు పాటించని వాళ్లు, నైతిక ప్రవర్తన సరిగా లేని వాళ్లు, పార్టీలో తోటి మహిళా కామ్రేడ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లపై పార్టీ చర్యలు తీసుకుంది. ఇలాంటి వాళ్లే వెళ్లి ప్రభుత్వం నెలకొల్పిన డీఆర్‌జీలో చేరుతున్నారు.
మార్క్సిజానికి అంతం లేదు
పార్టీకి వరుసగా నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం. ప్రజల్లో మాకు మద్దతు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తీవ్రస్థాయిలో ప్రభుత్వం నుంచి నిర్బంధం ఉన్నప్పుడు సామాన్య ప్రజానీకం కొంత వెనుకడుగు వేయడం సహజమైన ప్రక్రియ. ఇంత∙నిర్భంధంలోనూ మాకు అన్నం పెడుతున్నారు. మా కామ్రేడ్లు చనిపోతే కన్నీరు పెడుతున్నారనే విషయం గమనించాలి. ఇంత నిర్బంధంలోనూ దళాలు, కమిటీలు ఏర్పాటు చేయండి అని మాకు విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్టు 2026 మార్చి నాటికి నక్సలైట్లు దేశంలో అంతం కారు. మార్క్సిజం మరో రూపంలో తన పోరాటం కొనసాగిస్తుంది. తప్పనిసరి పరిస్తితుల్లోనే ఆయుధాలు పట్టుకోవాల్సి వస్తుంది.
శాంతి చర్చలకు హిడ్మా సిద్ధమా ?
నేను కలిసిన వివిధ కమిటీల కామ్రేడ్లు శాంతి చర్చలకు సుముఖంగానే ఉన్నారు. దీనిపై హిడ్మా అభిప్రాయం ఏంటనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను తనని కలవలేదు. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే. శాంతి చర్చల ప్రస్థావన వచ్చిన తర్వాత మా దగ్గర ఐదుగురిని చంపారు. ఇవే పరిస్థితులు కొనసాగితే మా నుంచి ప్రతిస్పందన తప్పదు.
అడవుల్లోకి వచ్చి చూడండి
మావోయిస్టులకు వ్యతిరేకంగా టీవీ స్టూడియోల్లో కూర్చుని మాట్లాడేవారికి ఒకే విజప్తి చేస్తున్నాం. మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక రెండు రోజులు అడవుల్లోకి రండి, ఇక్కడి గుట్టలు ఎక్కండి పరిస్థితులు చూడండి, అప్పుడు మేం ఏం చేశామో తెలుస్తుంది.
ఆ దాడిలో పొరపాటు జరిగింది
సుక్మా జిల్లా జీరామ్‌ఘాటీ దగ్గర 2013లో చేసిన దాడిలో మహేంద్రకర్మను లక్ష్యంగా చేసుకున్నాం. అయితే పొరపాటున కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్‌తో పాటు ఇతరులు కూడా ఆ దాడిలో మరణించారు. మావోయిస్టు వ్యతిరేక విధానాలు అవలంభించడంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకే బాట.
(బస్తర్ టాకీస్, సాక్షి సౌజన్యంతో)