Menu

ధీరోదాత్త నాయకుడు,ధిక్కార స్వరం….ప్రొఫెసర్ సాయిబాబాపై మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటన‌

anadmin 6 months ago 0 360

ప్రజా ఉద్యమ నేత, మేధావి, కవి, రచయిత, వక్త, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కామ్రేడ్ జీ.ఎన్. సాయిబాబా అమరుడయ్యి మూడు నెలలు దాటింది. 2024,అక్టోబర్ 12వ తేదీన సాయిబాబా మరణించారు. ఆ వెంటనే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆ పార్టీ కేంద్రకమిటీ మాత్రం ఆలస్యంగా ఆయన మరణంపై ప్రకటన విడుదలయ్యింది. ఆ లేఖను సాయిబాబా మరణించిన మరుసటి రోజే అంటే 2024 అక్టోబర్ 13 వ తేదీనే రాసినప్పటికీ తీవ్ర నిర్బంధ పరిస్థితుల రీత్యా సకాలంలో పంపలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అని ఆ పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

అభయ్ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం…

అక్టోబర్ 12న మృతి చెందిన ప్రముఖ ప్రజాస్వామిక విప్లవ ప్రజా ఉద్యమ నాయకుడు, ఆదివాసీ శ్రేయోభిలాషి దిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్, డాక్టర్ గోకరకొండ నాగ సాయిబాబాకు సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తోంది. ఆయన వ్యక్తిగత జీవితంలోనే కాదు ఉద్యమ జీవితంలోనూ సహచరి అయిన వసంత కుమారికి, కూతురుకు, బంధువులకు, దేశ-విదేశీ మిత్రులకు, విశ్వవిద్యాయల సహోధ్యాయులకు, విద్యార్థులకు, స్టాఫ్ కు, ఆయన విడుదల కోసం అహర్నిశలు కృషి చేసిన న్యాయవాదులందరికీ, ఆయన విడుదల కోసం వుద్యమాలు నడిపిన కృషి చేసిన దేశ విదేశీ ప్రజాస్వామిక సంస్థలన్నింటికీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. ఆయన కన్న కలలను సాకారం చేయడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిందిగా వీరందరికీ, భారతదేశ పీడిత ప్రజలకు పిలుపునిస్తోంది. ఆయనను కుట్రపన్ని, కిడ్నాప్ చేసి, అక్రమ కేసులు పెట్టి మధ్య యుగాల శిక్షలను తలపించేలా పదేళ్ల పాటు అమానవీయంగా అత్యంత దుర్భరమైన చీకటి అండా సెల్ లో నిర్బంధించి, జైళ్ల మాన్యువల్ నిబంధనలూ, దేశ, అంతర్జాతీయ మానవహక్కుల నిబంధనలను ఉల్లంఘించి అంగవికలురకు అందించాల్సిన కనీస సౌకర్యాలనూ, వైద్య సదుపాయాలనూ, బెయిల్ వంటి న్యాయపర హక్కులనూ నిరాకరించి ఆయనను అకాల మరణానికి గురిచేసిన బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు హంతక ప్రభుత్వాన్నీ, దాని అభిన్న అంగమైన (అ)న్యాయ వ్యవస్థను తీవ్రంగా నిందిస్తోంది. ప్రొఫెసర్ సాయిబాబా మరణాన్ని ప్రభుత్వం చేసిన హత్యగా భావించి ఖండించాలనీ, ఇటువంటి హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలని విప్లవ, ప్రజాస్వామిక, ప్రగతిశీల పార్టీలకూ, సంఘాలకూ, శక్తులకూ పిలుపునిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవిభక్త తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం పట్టణంలో అత్యంత పీడిత సామాజిక సముదాయానికి చెందిన ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన జీ.ఎన్. సాయిబాబా పోలియో కారణంగా పరిణమించిన అంగవైకల్యాన్ని ధిక్కరించి ఉన్నత విద్యావంతులయ్యారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ (ఇంగ్లీషు) చదువుతూ ఆయన ప్రజాస్వామిక, విప్లవోద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. ఒకవైపు ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పాల్గొంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీ. పూర్తి చేసారు. డాక్టర్ సాయిబాబా అరెస్ట్ అయ్యే నాటికి దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంలాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉన్నాడు .

మన దేశంలో దళారీ పాలకవర్గాలు 1990వ దశకం ఆరంభంలో సామ్రాజ్యవాద ప్రాయోజిత ఎల్.పీ.జీ. విధానాలను నిర్విచక్షణగా అమలు చేయడం ఆరంభించిన అనతికాలంలోనే సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకూ, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో వివిధ ప్రజాస్వామిక విప్లవ ప్రజాసంఘాలు అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక (ఏఐపీఆర్ఎఫ్)ను స్థాపించాయి. కామ్రేడ్ సాయిబాబా ఈ సంస్థ సన్నాహాల నుండి మొదలుకొని ఇది పని చేసిన దశాబ్దం పైగా కాలం వరకూ ఈ సంస్థకు క్రియాశీల నాయకత్వం అందించారు.

ఇందులో భాగంగా 1996లో ఏఐపీఆర్ఎఫ్ జాతుల సమస్యపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్ లో డాక్టర్ సాయిబాబా క్రియాశీల పాత్ర నిర్వహించారు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ, ‘ముంబయి ప్రతిఘటన 2004’ కార్యక్రమంలో, తర్వాత అనతికాలంలోనే ఏర్పరచిన పీడీఎఫ్ ఐ లో కామ్రేడ్ సాయిబాబా క్రియాశీల నాయకత్వ పాత్ర నిర్వహించారు. ఆయన ఏఐపీఆర్ఎఫ్ తరఫున ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్స్ (ఐ.ఎల్.పీ.ఎస్.)లో ప్రాతినిధ్యం వహించారు. 2005లో విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్.డీ.ఎఫ్.) ఏర్పాటులో, 2008లో స్థాపించబడిన ‘విస్థాపన విరోధి జన్ వికాస్ ఆందోళన్’లో ప్రముఖ పాత్ర పోషించారు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆర్.డీ.ఎఫ్.కు సారథ్యం వహించారు. హిందుత్వ ఫాసిజం, జాతులు, దళిత, కార్మిక సమస్యలపై, రాజ్య నిర్బంధం తదితర సమస్యలపై జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. భారత ప్రజాస్వామిక విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించే దుష్ట లక్ష్యంతో భారత రాజ్యం చేపట్టిన ప్రజలపై యుద్ధం-ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా పోరాడిన, లాల్ గఢ్ ప్రజా ప్రతిఘటనకు మద్దతుగా సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించిన ప్రముఖుల్లో ఆయన ఒకరు. ఈ విధంగా దేశవ్యాప్త ప్రజాస్వామిక, విప్లవోద్యమాలలో ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఇలా ప్రజల పక్షం వహించినందుకు ఆయన దోపిడీ పాలక వర్గాలకు కంటిలో నలుసులా మారారు.

అందుకే కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2014 మే నెలలో ప్రొఫెసర్ సాయిబాబాను, మరి కొందరినీ సీపీఐ (మావోయిస్టు)తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. యుఏపీఏ (ఉపా) సహా పలు క్రూర చట్టాల కింద కేసులు పెట్టారు. దీర్ఘకాలం పాటు బెయిల్ ఇవ్వకపోవడమే కాకుండా 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను జైలులోనే హతమార్చాలని భారత పాలకవర్గాలు అన్ని రకాలుగా ప్రయత్నించాయి. వీరి బెయిల్ కోసం న్యాయవాదులు అహర్నిశలు చేసిన కృషీ, ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన విడుదల కోసం దేశవ్యాప్తంగా, ప్రొఫెసర్లు, విద్యార్థులు, మానహక్కుల సంస్థలు అనేక ఉద్యమాలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వాల నిరంకుశ వైఖరి కారణంగా ఆయనకు సుదీర్ఘ కఠిన కారాగారవాసం తప్పలేదు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ సాయిబాబాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ వాటి కనుసన్నలలో మెదిలే గుడ్డి న్యాయస్థానం దేశభద్రతకు పెను ప్రమాదకారిగా భావించాయి. చివరికి కేన్సర్ తో మృతి చెందిన తన తల్లి అంత్యక్రియలకు వెళ్లడానికి కూడా ఆయనను అనుమతించలేదు. కఠిన కారాగారవాసం పక్షవాతం సహా ఆయనను 21 రకాల వ్యాధులకు గురి చేసింది. దినదినమూ క్షీణిస్తున్న ఆరోగ్యమూ, జైలు అధికారుల, న్యాయ వ్యవస్థ నిరంకుశ వైఖరి ఆయనను కుంగదీయ లేదు. జైలు గోడల మధ్య కూడా ఆయన పోరాటా బావుటాను ఎత్తిపట్టాడు. అక్షరాలను ఆయుధాలుగా మలచుకొని కవిత్వం రాశారు. ఆరోగ్యం క్షీణించి ఆయన మరణానికి చేరువయ్యాక 2024 మార్చి 7న ఆయన నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది.
జైలు జీవితం ఆయనను భయపెట్టలేదు. అందుకే బయటకు రాగానే ఆయన అమానవీయ జైలు స్థితిగతుల గురించి బాహ్య ప్రపంచానికి ధైర్యంగా వెల్లడించారు. అంతేకాదు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం సాగే ఉద్యమాల నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ఒక టీచర్ గా, హక్కుల కార్యకర్తగా కొనసాగుతూనే ఉంటానని దృఢనిశ్చయంతో ప్రకటించారు.

కామ్రేడ్ సాయిబాబా జీవితం ఆదర్శవంతమైంది. ఆయన ఒక క్రియాశీల కార్యకర్త, ధీరోదాత్త నాయకుడు, ఆత్మీయ స్నేహితుడు, స్ఫూర్తిదాయక అధ్యాపకుడు. సృజనాత్మక రచయిత. నిరంతర అధ్యయనశీలి. ధిక్కార స్వరం. సాహసోపేతమైన, ప్రేరణదాయకమైన ఉద్యమ కార్యాచరణ ఆయనది. ఆయన లక్ష్య సాధనకు అంగవైకల్యం ఆటంకం కాలేదు. వీల్ చైర్ లో కూర్చొనే దేశం నలుమూలలకూ పరుగులు పెట్టారాయన. అది ఆదివాసీ గూడెం కావొచ్చు, దిల్లీ మహా నగరం కావొచ్చు ఎక్కడ అవసరమో అక్కడాయన తన ఉనికిని చాటుకున్నారు. తన గళాన్ని వినిపించారు.

కామ్రేడ్ సాయిబాబా అకాల మరణంతో దేశంలోనూ, అంతర్జాతీయంగానూ పీడిత ప్రజల, పీడిత సామాజిక సముదాయల, పీడిత జాతులు ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే ఒక గొప్ప నాయకుడిని ప్రజలు, ప్రజాసంఘాలు కోల్పోయాయి. ఆయన జీవితంలో 1990ల ఆరంభం నుంచి ప్రజాస్వామిక-విప్లవ ప్రజా ఉద్యమాల కోసం నిరంతరం పరిశ్రమించారు. ఆయన కుటుంబంతో పాటు ప్రజాసంఘాలు, దేశ విదేశీ మిత్రులు, విద్యార్థులు, సహోధ్యాయులు ఆయనకు బాసటగా నిలిచారు. ఆయన మహోన్నత ఆశయాలు, పీడిత ప్రజల పట్ల, వారి అపారమైన శక్తి పట్ల ఆయనకు గల అచంచల విశ్వాసమే తనను ఎన్ని నిర్బంధాలైన ఎదుర్కొనేలా చేసింది. పీడిత ప్రజల కోసం, సామాజిక మౌలిక మార్పు కోసం ఆయన తన మేధో-శారీరక శక్తినంతటినీ ధారపోసి చేసిన కృషి ప్రగతిశీల, ప్రజాస్వామ్య, విప్లవ శక్తులందరికీ, ఉద్యమాలన్నింటికీ ఆదర్శం. ఆయన జీవించింది 57 ఏండ్లే అయినా అదెంతో విలువైనది, అర్థవంతమైనది, ఆదర్శవంతమైంది. ఆయన అణగారిన ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, నిజమైన ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మార్గమధ్యంలో ఎన్ని అదిరింపులు, బెదిరింపులు, నిర్బంధాలెదురైనా ధైర్యాన్నీ, త్యాగనిరతిని కోల్పోని నిజమైన ప్రజా నాయకుడు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు దళారీ కార్పొరేట్ ఫ్యూడల్ మోదీ ప్రభుత్వం దేశంలో యావత్తు పీడిత వర్గాల, పీడిత సామాజిక సముదాయాలు, పీడిత జాతుల ప్రజలపై, వారి న్యాయపూరితమైన ప్రజాస్వామిక ఉద్యమాలపై తీవ్రమైన ఫాసిస్టు దాడిని కొనసాగిస్తున్న పరిస్థితిలో, ఆపరేషన్ ‘కగార్’ పేరుతో అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాలపై, ప్రత్యేకించి, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాల ప్రజలపై, వారి ప్రజాసంఘాలపై, వారికి నాయకత్వం వహించే మావోయిస్టు పార్టీపై పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగిస్తున్న స్థితిలో కామ్రేడ్ సాయిబాబా అమరత్వం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు. ఆయన సాహసం, దృఢసంకల్పం, ప్రజల పట్ల అంకితభావం, త్యాగనిరతి ఎల్లప్పుడూ ప్రజాస్వామిక ఉద్యమాలకు ప్రేరణనందిస్తాయి. కామ్రేడ్ సాయిబాబా ఆదర్శాల స్ఫూర్తితో ఆయన నడిచిన ఉజ్వలబాటలో సమైక్యం కావాల్సిందిగా, దృఢసంకల్పంతో ప్రజా పోరాటాలను విస్తృతం, తీవ్రతరం చేయాల్సిందిగా దేశంలోని యావత్తు నిజమైన విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక, ప్రగతిశీల, దేశభక్తయుత శక్తులకు, సంస్థలకు సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ పిలుపునిస్తోంది. నేడు దేశంలో హిందుత్వ ఫాసిజం ఉగ్రరూపం దాల్చుతూ ప్రశ్నించే గొంతులను నులిమెయ్యడమో, జైలులో బంధించడమో చేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది విప్లవకారులనూ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాదులనూ ఇలా జైలులోనే హత్య చేసే కుట్రలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఫాసిస్టు పాలక వర్గాల ఈ కుట్రలను అడ్డుకోవడానికి విశాల, సమరశీల ప్రజా పోరాటాన్ని నిర్మించాల్సిన బాధ్యత విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక, ప్రగతిశీల శక్తులందరిపై వుంది. ప్రొఫెసర్ సాయిబాబా ప్రేరణాదాయక ఆచరణ స్ఫూర్తితో ఈ కర్తవ్యాన్ని స్వీకరించాలని సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ పిలుపునిస్తోంది.

అభయ్,
అధికార ప్రతినిధి,
భాకపా (మావోయిస్టు

నోట్: నిర్బంధ పరిస్థితుల రీత్యా ఈ ప్రకటనను సకాలంలో పంపలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad