భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) 20వ స్థాపన వార్షికోత్సవాన్ని 21 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా సమరోత్సహాంతో జరుపండి!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టిన అనాగరిక కౄరమైన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా రాజకీయ, సైనిక పోరాటాలలో విరోచితంగా తలపడి ఓడిద్దాం!!
పార్టీ,పిఎల్జీఏ, విప్లవ ప్రజానీకం ఐక్యమై ప్రజా యుద్ధానికి బలమైన ప్రజా పునాదిని వేద్దాం. పార్టీని, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం !!!
ప్రియమైన ప్రజలారా!
మన పార్టీ సిపిఐ(మావోయిస్టు) ఏర్పడి 2024 సెప్టెంబర్ 21 నాటికి 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో శతృవు తలపెడుతున్న కౄర దాడులలో అనేక కష్టాలను, నష్టాలను తెలంగాణలో మన పార్టీ ఎదుర్కొంటున్నప్పటికీ పీడిత ప్రజల విముక్తి కోసం కష్టాలకోర్చి పని చేస్తుంది. అనేక త్యాగాలు చేస్తుంది. కొన్ని విజయాలను కూడా సాధించింది. ఈ సందర్భంగా మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం ప్రజా యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్న ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం కమాండర్లు, యోధులకు, పార్టీ శ్రేణులకు, ఆర్పీసీలకు, జైళ్ళలో మొక్కవోని దీక్షతో ఎర్ర పతాకను ఎత్తిపడుతున్న సహచరులకు అదేవిధంగా ఆయా రంగాలలో పోరాడుతున్న లక్షలాది మంది విప్లవ ప్రజానికానికి, నూతన సమాజాన్ని కోరుకుంటున్న ప్రజాస్వామికవాదులకు, ప్రగతిశీల శక్తులకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) 20వ స్థాపన వార్షికోత్సవాన్ని 21 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 20 వరకు తెలంగాణలో సమరోత్సహాంతో గ్రామాల్లో, పట్టణాల్లో, వీది, వీదిన జరుపుకోవాలని పిలుపునిస్తున్నాము. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) జన్మదిన వేడుకలను ప్రజా మీటింగ్ లు, పాటలు, నృత్యాలు, నాటికలతో సంబరాలు జరపుకుందాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టిన అనాగరిక కౄరమైన ఆపరేషన్ కగార్ తో విరోచితంగా తలపడి ఓడిద్దాం. పార్టీ,పిఎల్జీఏ, విప్లవ ప్రజానికం ఐక్యమై ప్రజా యుద్ధానికి బలమైన ప్రజా పునాదిని వేద్దాం. పార్టీని, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.
మన పార్టీ తెలంగాణలో రాజకీయ ఉద్యమాలు నిర్మించడంలో గణనీయమైన అనుభవాన్ని సంపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక సామ్రాజ్యవాద అనుకూలంగా అమలు చేస్తున్న ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేక ఉద్యమాలు చేపట్టింది. రాష్ట్రంలో రాజ్య హింసకు వ్యతిరేకంగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమించింది. నిర్వాసితులను చేయడంతో పాటు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కార్పోరేట్ల అనుకూల భారీ ప్రాజెక్టులకు, మైనింగ్ కు, ఓపెన్ కాస్టులకు, అభయారణ్యాలకు వ్యతిరేకంగా, సింగరేణి ప్రవేటీకరణకు, హరితహారం పేరుతో ప్రభుత్వం ఆదివాసుల పోడు భూములను కబ్జా పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమాలకు, ఇథనాల్ ప్యాక్టరీకి వ్యతిరేకంగా, ఆదివాసీల స్వయప్రతిపత్తి కొసం జరిగిన ఉద్యమాలకు, అసంఘటిత కార్మికుల సమస్యల ఉద్యమాలకు నాయకత్వం వహించింది. ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది.
దేశంలో ప్రమాదకారిగా మారిన బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేక ఉద్యమాలు నిర్మించింది. రైతు కూలీ, కార్మిక, నిరుద్యోగ సమస్యలపై పోరాడింది. రెండు దశాబ్దాల కాలంలో ఆర్ధిక, రాజకీయ ఉద్యమాలను మిలిటెంట్ గా నడిపించింది. పాలకుల దోపిడి విధానాలకు ప్రజా ఉద్యమాలు అడ్డంకిగా మారడంతో మావోయిస్టుల ముద్ర వేసి అణిచివేతకు పూనుకున్నారు. ఈ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవ ప్రతిఘాతుక గ్రీన్ హంట్, సమాధాన్, ప్రహార్, పేర్లతో అనాగరిక కౄరమైన నరహంతక వ్యూహాత్మక ఆపరేషన్ లను కొనసాగించారు.
2047 వరకు బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యాన్ని నిర్మించే లక్ష్మంతో 2022 అక్టోబర్ లో సూరజ్ కుండ్ వ్యూహాత్మక యోజనను రూపొందించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఆపరేషన్ కగార్ పేరుతో అమానవీయమైన సైనిక అభియాన్ కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ లో ఈ యేడు దేశ వ్యాప్తంగా 150 మందికి పైగా పార్టీ శ్రేణులు, గెరిల్లా యోధులు, ప్రజలు ప్రాణాలర్పించారు. దేశ వ్యాప్తంగా ఈ రెండు దశాబ్దాల కాలంలో వేలాది మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. ఇందులో కేంద్ర కమిటీ నుండి గ్రామ స్థాయి పార్టీ సభ్యులు, సాధారణ ప్రజల వరకు వున్నారు. తెలంగాణలో ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ మూడు పర్యాయాలు, బీఆర్ఎస్ రెండు సార్లు అధికారాలను చేపట్టారు. కాంగ్రేస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల పరిపాలనలో అనేక మంది విప్లవకారులను హత్య చేశారు. 2023 డిసెంబర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధికారాన్ని చేపట్టిన తొమ్మిది నెలలు గడువక ముందే 10 మంది ప్రియతమ నాయకులను పొట్టన పెట్టుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం అడవుల్లో కా. సాగర్,కా. మనీరామ్, కా. లక్ష్మణ్ లను, రఘునాధపాలెం వద్ద కామ్రేడ్స్ లచ్చన్న, తులసీ, రాము, దుర్గేష్, కోసీ, కా.గంగాల్, దామెరతోగు వద్ద విజెందర్ లను కాంగ్రెస్ ప్రభుత్వం హత్య చేసింది. వీరితో పాటు తెలంగాణ విప్లవోద్యమాన్ని పునర్ నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషించిన కా.వర్గేష్, కా.మంగు, కా.రాజు, కా.బుద్రులకు మహారాష్ట్ర సీ60 పోలీసులు అన్నంలో విషమిచ్చి ప్రాణాలతో పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారు. ఈ వేరు, వేరు ఘటనలు పార్టీకీ తీరని నష్టాన్ని కలిగించాయి. కాని అమరులు నడిచిన బాట మరింత ఎరుపెక్కింది. వారు నడిచిన దీర్ఘకాలిక ప్రజా యుద్ధం బాటలో అమర వీరుల ఆదర్శాలు, కమ్మూనిస్టు విలువలు మనందరికి స్ఫూర్తినిచ్చాయి. మనల్ని మరింత దృఢత్వాన్ని పెంచాయి. ఈ సందర్భంగా మహోన్నత ఆశయాలను మనముందు వుంచిన అమరులకు వినమ్రంగా తలవంచి జోహార్లు అర్పిస్తున్నాము. వారు కన్న కలలను నిజం చేయడానికి మనమంత చివర వరకు పోరాడుదామని ప్రతిన పూనుదాం.
సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలు ఈ సమాజ అభివృద్ధికి బలమైన అవరోధంగా మారాయి. నేడు దోపిడి పాలక వర్గాలు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకపోయాయి. ఈ పరిస్థితి మరింత వేగంగా, మారుతుంది. సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి కౄరంగా వ్యవహరిస్తారు. అందుకే లాభాల కోసం ఆదివాసీ ప్రాంతాలలో ప్రాకృతిక వనరులను కొల్లగొట్టడానికి ప్రజలపై యుద్ధాన్ని ప్రకటించారు. సామ్రాజ్యవాదుల దన్నుతో దేశ పాలకులు నిర్ణయాత్మక యుద్ధానికి దిగారు. అయినప్పటికీ సామ్రాజ్యవాదం చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. సామ్రాజ్యవాదులపై ఆధారపడి బ్రతుకుతున్న దోపిడి పాలకుల స్థితి కూడా సంక్షోభంలో వుంది. ప్రపంచ కార్మిక వర్గం నాయకత్వంలో భారత దేశంలో కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి అర్ధ వలస-అర్ధ భూస్వామ్య వ్యవస్థను కూల్పి వేయడం మావోయిస్టు పార్టీ తక్షణ లక్ష్యం.
మావోయిస్లు పార్టీని నిర్మూలించే విప్లవ ప్రతిఘాతుక పథకాన్ని ఓడించడానికి ప్రజలంతా ఐక్య ఉద్యమాలు చేపట్టండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడండి. పౌర ప్రజాస్వామిక హక్కులను రక్షించండి. సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్మ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యం కండి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా విస్తృతంగా లౌకిక, ప్రజాస్వామిక శక్తులన్ని ఐక్యం కండి.
జగన్,
అధికార ప్రతినిధి,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు),
తెలంగాణ రాష్ట్ర కమిటీ