Menu

ఈ దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య‌ మీకు పట్టదా ?

anadmin 10 months ago 0 94

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం , హత్య ఘటన దేశం మొత్తాన్ని కదిలిస్తోంది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ప్రజలు కూడా రోడ్లమీదికి వస్తున్నారు. ఆ దుర్మార్గులు చేసిన ఈ దారుణంపై రోడ్లమీదికి రావడం ఖచ్చితంగా మన బాధ్యత.

అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఆమె జననాంగంపై గాయాలు చేసి దారుణంగా చంపేసినట్లు పేర్కొంటున్నారు. ఆమె ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని.. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతు నులిమి చంపడంతో.. ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. బాధితురాలి ఉదరభాగం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి.. కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి.. ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమిపట్టినట్లు పేర్కొంటున్నారు. అసహజ లైంగిక చర్య.. పాశవిక దాడి కారణంగా జననాంగం, అంతర్గత అవయవాల వద్ద లోతైన గాయం అయినట్లు పేర్కొంటున్నారు. దుర్మార్గుల‌ దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో బాధితురాలి.. ముఖమంతా గోటి గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించినట్లు పేర్కొంటున్నారు. ఈ దుర్మార్గమైన ఘటన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది మెడికల్ కాలేజ్ పై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పని బీజేపీ, సీపీఎం పార్టీలు చేశాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ఆధారాలను నాశనం చేసేందుకే ఈ దాడి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నది బీజేపీ. ఈ విషయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో కూడా బీజేపీ క్యాడర్ అగ్రభాగాన ఉంటున్నారు. ఇది మంచి విషయమే. అయితే డాక్టర్ పై అత్యాచారం , హత్య విషయంలో వైద్యులు, ప్రజలు పడుతున్న ఆందోళనకు, చేస్తున్న ఉద్యమానికి, బీజేపీ చేస్తున్న రాజకీయానికి చాలా తేడా ఉన్నది. అయితే ఇదే సమయంలో ఓ దళిత బాలికపై జరిగిన అత్యాచారం , హత్య సంఘటన విషయంలో బీజేపీయే కాదు దేశ ప్రజలు కూడా మౌనం పాటించడం ఆశ్చర్యంగా ఉంది.డాక్టర్ కోసం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ఘటనపై నోరు మెదపక పోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

బీజేపీ, జనతాదళ్ యూ అధికారంలో ఉన్న బీహార్ లో ఓ దళిత బాలకను సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. కలకత్తాలో డాక్టర్ పై ఈ నెల 9వ తేదీన అత్యాచారం హత్య జరిగితే, రెండు రోజుల తర్వాత అంటే ఈ నెల పదకొండవ‌ తేదీన బీహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో 14 ఏళ్ళ దళిత బాలికపై హత్యాచారం జరిగింది. ఆ గ్రామంలోని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన 45 ఏళ్ళ సంజయ్ రాయ్ అనే వ్యక్తి, అతని అనుచరులు ఈ దారుణానికి ఒడిగట్టారు. చాలా కాలంగా ఆ బాలికపై కన్నేసిన సంజయ్ రాయ్ ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయాలని రోజు కూలీలైన బాలిక తల్లితండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. బలమైన కులం, డబ్బు, పవర్ ఉన్న అతనికి భయపడి బాలికను పేరెంట్స్ స్కూల్ కూడా మానిపించారు. ఈ నెల 11 రాత్రి ఆ దుర్మార్గుడు తన అనుచరులతో కలిసి బాలిక ఇంటికి వచ్చి ఆయుధాలతో అందరిని భయభ్రాంతులకు గురి చేసి బాలికను ఎత్తుకెళ్ళాడు. సోమవారం ఉదయం ఆ ఊరి చెరువు వద్ద ఆ బాలిక శవం కనిపించింది. ఆమెపై సాముహుక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు తేలింది. పోలీసులు సంజయ్ రాయ్ మరో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత కింద గ్యాంగ్‌రేప్ (సెక్షన్ 70), హత్య (సెక్షన్ 103)తో పాటు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని సెక్షన్‌ల కింద అభియోగాలు మోపారు. అయితే నిందితులను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. దీనిపై ఆర్జేడీ, బీఎస్పీ తప్ప మరే రాజకీయ పార్టీ స్పందించలేదు. కలకత్తా ఘటనపై దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ ఓ దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని, హత్య ను పట్టించుకున్న పాపానపోవడం లేదు. అసలు అలాంటి సంఘటన జరిగినట్టు ఎరగనట్టే ప్రవర్తిస్తోంది. కలకత్తా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ కూడా దళిత బాలిక విషయంలో మౌనంగా ఉన్నాడు. డాక్టర్ కోసం రోడ్లెక్కిన ఈ దేశ మధ్యతరగతికి ఈ దళిత బాలిక కనిపించలేదు. కలకత్తాలో అత్యాచారానికి , హత్యకు గురైన డాక్టర్ కు, బీహార్ లో అత్యాచారానికి, హత్యకు గురైన దళిత బాలికకు ఉన్న తేడా ఏంటి? రాజకీయ పార్టీలకు అన్నింటికన్నా తమ రాజకీయాలే ముఖ్యం, ఆయా పార్టీలకు బాకాలూదడమే మీడియా పని అయిపోయింది. మరి మనకెందుకు ఈ వివక్ష?

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad