Menu

బస్తర్ లో ఘనంగా అమరుల సంస్మరణ వారోత్సవాలు… పాలక హింసను ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్న ఆదివాసులు

anadmin 3 days ago 0 627

కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే మార్చ్ నెలాకరుకల్లా మన దేశాన్ని మావోయిస్టు ముక్త్ భారత్ గా మారుస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. మధ్య భారతంలో ఆదివాసుల నేల కింద ఖనిజాలను ఈ దేశ బడా పెట్టుబడిదారులైన అంబానీ, అదానీల, సామ్రాజ్యవాదుల‌ పరం చేయడానికి చేయకూడని పనులన్నీ చేస్తున్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. పచ్చని అడివిని నాశనం చేసి, మైనింగ్ చేసుకోవడానికి అక్కడి భూమిని తమ మిత్రులైన కార్పోరేట్లకు ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం తహతహలాడుతున్నది. అందుకోసం అక్కడి ఆదివాసులను తరిమివేయాలి. పోకపోతే, ఎదురు తిరిగితే చంపేయాలి. ఆదివాసులకు అండగా నిలబడ్డ మావోయిస్టులను హత్యలు చేసి లేకుండా చేయాలి. అందుకే మావోయిస్టు రహిత భారత్ అంటున్నారు మోషాలు. దాని కోసం కగార్ ఆపరేషన్ మొదలు పెట్టి ఈ సంవత్సరం కాలంలో వేయి మందిని, పసిపిల్లలు, వృద్దులు సహా ఆదివాసులను మావోయిస్టులను హత్యలు చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా తన నాయకుల‌ను, కార్యకర్తలను, సానుభూతిపరులను కోల్పోయింది. ఏడుగురు ఆదివాసులకు ఒక సైనికుడి చొప్పున లక్షల మంది సైనికులను బస్తర్ లో దించి, ఒకవైపు ఆకాశమార్గాన బాంబింగ్ చేస్తూ, మరో వైపు ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకొని ఏకపక్షంగా పాలక సైన్యం మావోయిస్టులను కాల్చి చంపుతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవ రావు ఎలియాస్ బసవరాజ్ సహా కేంద్ర కమిటీ, రాష్ట్రకమిటీ, డివిజన్ కమిటీల స్థాయి నాయకులతో సహా అనేక మంది కార్యకర్తలను, విప్లవాభిమానులను హత్య చేసింది ఈ ప్రభుత్వం.

మరో వైపు ఈ హింసను, వందలాది మంది హత్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ జస్టిస్ చంద్ర కుమార్ అద్వర్యంలోని శాంతి చర్చల‌ కమిటీ ప్రభుత్వమూ, మావోయిస్టు పార్టీ మధ్య శాంతి చర్చల ప్రతిపాదన తెచ్చింది. ఆ కమిటీ ప్రతిపాదనను మావోయిస్టు పార్టీ ఒప్పుకొని తాము చర్చలకు రావడానికి సిద్దమని ప్రకటించింది. ఒక సారి కాదు ఆ పార్టీ ఇదే విషయాన్ని నాలుసార్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా, ప్రధానంగా తెలంగాణలో శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్ తో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు. అయినా మోషాల ప్రభుత్వం చర్చలకు ససేమిరా అంటూనే లొంగిపోండి లేదా చచ్చి పోండి అంటూ దుర్మార్గమైన వైఖరితో ఉంది.

ఈ నేపథ్యంలో ఇక బస్తర్ ఇక మావోయిస్టు ముక్త్ బస్తర్ అయ్యిందని, మావోయిస్టు పార్టీ పని అయిపోయిందని, నాయకులందరూ చనిపోయారని, అనేక మంది లొంగిపోయారని, ఇక మిగిలిన కొద్ది మంది చనిపోవడమో , లొంగిపోవడమో తప్ప మార్గం లేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి తెలిసో తెలియకో కొందరు వంత పాడుతున్నారు. ఇక బస్తర్ లో మావోయిస్టులు లేరని, ఆదివాసులు నోరు మూసుకొని తమ భూములను కార్పోరేట్లకు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని కొందరు ప్రజా ద్రోహులు పోంగిపోతున్నారు.

శతృ దేశం పై జరుగుతున్న దాడి మాదిరిగానే బస్తర్ పై దాడి జరుగుతున్నది నిజమే. రోజుకు పదుల సంఖ్యలో మావోయిస్టులు, ఆదివాసులు సైన్యం చేతుల్లో మరణిస్తున్నది నిజమే. అయినా అక్కడ ఉద్యమం ఆగలేదు. నష్టం జరుగుతున్న మాట నిజమే కావచ్చు. కొంత వెనకడుగుపడినమాట కూడా నిజమే కావచ్చు. అయితే అంత నిర్భందం మధ్య, మానవహననం మధ్య ఆదివాసులు ముందుకే నడుస్తున్నారు. తమతో పాటు నిన్నటిదాకా నడిచి, తమ కోసం మరణించిన అమరుల సాక్షిగా వాళ్ళు ఎర్రజెండాని వదల కుండా గుండెలకు హద్దుకుంటున్నారు.

ప్రతి ఏడు జూలై 28 నుండి ఆగ‌స్టు 4 వ తేదీ వరకు జరిగే అమర వీరుల వారోత్సవాలను ఈ సారి కూడా బస్తర్ లో ఆదివాసులు దిగ్విజయంగా జరుపుకున్నారు. బస్తర్ లోని పచ్చటి అడవిలో… నంబళ్ళ కేశవరావు సహా 28 మంది మరణించిన‌ గుండెకోట్ అమరవీరుల, వీరవనితల‌తో సహా వేలాది మంది అమరులకు గుర్తుగా స్తూపం నిర్మించారు. అనేక మంది ప్రజలు , చేతనా నాట్యమంచ్ కార్యకర్తలు అమరులను స్మరిస్తూ, పోరాటాన్ని కొనసాగిస్తామని నినదిస్తూ, బ్యానర్లు పట్టుకొని పాటలు పాడుతూ ఊరేగింపు తీశారు. అనంతరం జరిగిన సభలో కళాకారులు తమ ఆటపాటల‌తో ప్రజలను ఉత్తేజితులను చేశారు. ఎంతటి నిర్బంధం ఉన్నా, ఎంతమందిని హత్యలు చేసినా పాలకులు ఎంత దుర్మార్గాలకు పాల్పడినా తాము వాటన్నింటినీ ఎదిరిస్తూ అమరులు చూపిన పోరుబాటలో ముందుకే నడుస్తామని, ప్రకటించారు.

ఇది పాలకులకు మింగుడుపడని దృశ్యమే. వారికే కాదు ఉద్యమం అంతమైందని చంకలు గుద్దుకుంటూ, ఉద్యమం మీద తామూ రెండు రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నవారికి కూడా షాక్ కు గురి చేసే విషయమే.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad