గాజాపై ఇజ్రాయిల్ ఏకపక్ష దుర్మార్గమైన దాడి చేస్తూ చిన్నారులను,వృద్దులను, సాధారణ పౌరులను మూకుమ్మడిగా హత్యలు చేస్తూ మారణ హోమం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ సైనికులు పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కు గురవుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ క్రమంలోనే గాజాలో యుద్ధానికి తిరిగి వెళ్లడానికి నిరాకరించినందుకు ముగ్గురు సైనికులను తొలగించి జైలులో పెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది.
కాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ నివేదిక ప్రకారం, 931వ బెటాలియన్ కు చెందిన నలుగురు సైనికులు “లోతైన అంతర్గత మానసిక సంక్షోభం” అని పేర్కొంటూ గాజాలోకి తిరిగి ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో అధికారులు వారిని పోరాట విధుల నుండి తొలగించి, వారు విధేయత చూపుతున్నారని ఆరోపించి జైల్లో పెట్టారు.
వారిలో ముగ్గురిని పోరాట విధుల నుండి తొలగించి 12 రోజులపాటు సైనిక జైలులో ఉంచినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. నాల్గవ వ్యక్తికి శిక్ష విధించబడింది.
“తమ క్రమశిక్షణా విధానం అనుసరించి వారికి సైనిక జైలులో జైలు శిక్ష విధించబడింది” అని సైన్యం తెలిపింది, ఈ విషయాన్ని ” ఆదేశాలకు అనుగుణంగా” నిర్వహించామని సైన్యం తెలిపింది.
ముఖ్యంగా పోరాట సమయంలో అవిధేయతను తీవ్రంగా పరిగణిస్తామని ఇజ్రాయిలీ ఆర్మీ నొక్కి చెప్పింది.
పలు వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్ 7 నుండి 270 రోజులకు పైగా సేవలందించిన మిలటరీ రిజర్వ్ ఫోర్స్ చెందిన ఈ సైనికులు పాలస్తీనియన్ల సామూహిక హత్యలను, కొనసాగుతున్న దాడిని బహిరంగంగా ఖండించారు. బందీల విడుదలకు సంబంధించి తమ దేశం చర్చలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వారు ఆరోపించారు.
ఇజ్రాయెల్ సైనిక డేటా ప్రకారం, గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 895 మంది ఇజ్రాయిల్ సైనికులు మరణించారు. 6,134 మంది గాయపడ్డారు, అయితే ఆర్మీ చెప్తున్న మరణాల సంఖ్య వాస్తవం కాదని, మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తోందనే విమర్శలను సైన్యం దేశంలో ఎదుర్కొంటోంది.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ చేసిన మారణహోమంలో పాల్గొన్న తర్వాత సైనికులకు పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) లక్షణాలు ఎక్కువయ్యాయని ఆ లక్షణాలున్న సైనికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నివేదించారు.