తమిళనాడు కోర్టు మావోయిస్టు నాయకుడు రూపేష్ కు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం కేరళలోని వియ్యూర్ కేంద్ర జైలులో ఉన్న రూపేష్ ను భారీ భద్రత మధ్య విచారణకు కోర్టుకు తీసుకువచ్చారు.
2015లో నకిలీ చిరునామా ఉపయోగించి సిమ్ కార్డు కొనుగోలు చేసిన కేసులో కేరళ మావోయిస్టు నాయకుడు రూపేష్ (64) అలియాస్ ప్రవీణ్ కు శుక్రవారం శివగంగా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.
పోలీసులు రూపేష్ పై 15 కి పైగా కేసులు బనాయించారు. అందులో తమిళనాడు శివగంగా జిల్లాలో కేసు కూడా ఒకటి. ఈ కేసులో కోయంబత్తూరు పోలీసులు 2015లో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.రూపేష్ శివ గంగా జిల్లాలోని ఇలయంగురి సమీపంలోని ఇదయన్ వలసైకి చెందిన ఒక రైతు రేషన్ కార్డును ఉపయోగించి కన్యాకుమారిలోని ఒక అవుట్ లెట్ నుండి ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారని, ఆ సిమ్ కార్డును మావోయిస్టు కార్యకలాపాలకు ఉపయోగించారని పోలీసులు ఆరోపించారు.
ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఒరివోలి రూపేష్ కు జీవిత ఖైదుతో పాటు 31,000 రూపాయల జరిమానా విధించారు. ఆ తర్వాత రూపేష్ ను తిరిగి వియ్యూర్ కేంద్ర జైలుకు తరలించారు.