భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) ప్రధానకార్యదర్శి నంబాళ్ళ కేశవరావు ఎలియాస్ బసవరాజుతో సహా మావోయిస్టులు, ఆదివాసుల హత్యలకు నిరసనగా బాంగ్లాదేశ్ లో ఈ నెల 18న ప్రదర్శన, సభ జరిగింది. ఢాకాలోని శిశు కళ్యాణ్ పరిషత్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ లో జరుగుతున్న కగార్ ఆపరేషన్ తో పాటు, పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న హత్యాకాండను వక్తలు ఖండించారు.
విప్లవ విద్యార్థి-యువజన ఉద్యమం తాత్కాలిక అధ్యక్షుడు , భారతదేశంలో మావోయిస్టులు, ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండ నిరసన కమిటీ కన్వీనర్, బంగ్లాదేశ్ మావోయిస్ట్ కవి హసన్ ఫక్రీ అధ్యక్షత వహించి, నిర్వహించిన ఈ సమావేశంలో ఖానన్ పత్రిక సంపాదకుడు బాదల్ షా ఆలం ప్రసంగించారు; నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ యాక్టింగ్ కోఆర్డినేటర్ రజత్ హుడా; మౌలానా అబ్దుల్ హమీద్ ఖాన్ భాషాని పరిషత్ ప్రధాన కార్యదర్శి హరున్-ఉర్-రషీద్; సోషలిస్ట్ ఇంటలెక్చువల్స్ అసోసియేషన్ సభ్య కార్యదర్శి అఫ్జలుల్ బషర్; డెమోక్రటిక్ కల్చరల్ యూనిటీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు రఘు అభిజిత్ రాయ్; అమరవీరుల విప్లవా , పేట్రియాట్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యుడు సయ్యద్ అబుల్ కలాం; నేషనల్ డెమోక్రటిక్ పీపుల్స్ ప్లాట్‌ఫామ్ అధ్యక్షుడు మసూద్ ఖాన్; న్యూ డెమోక్రటిక్ పీపుల్స్ ఫోరం అధ్యక్షుడు జాఫర్ హుస్సేన్; ఢాకా మెట్రోపాలిటన్‌లోని రివల్యూషనరీ స్టూడెంట్-యూత్ మూవ్‌మెంట్ కన్వీనర్ నయీం ఉద్దీన్ తదితరులు ప్రసంగించారు.
భారతదేశంలో హిందూత్వ-ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం “ఆపరేషన్ కాగర్” అనే క్రూరమైన సైనిక ఆపరేషన్ నిర్వహిస్తోందని, దీని ద్వారా మావోయిస్టు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ఆదివాసీలను చంపేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. భారత ప్రబుత్వం జనవరి 2024 నుండి, ఈ సైనిక ఆపరేషన్ ద్వారా 400 మందికి పైగా మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు, సాధారణ ఆదివాసీలను చంపిందని, 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని ప్రకటించిన భారత హోంమంత్రి అమిత్ షా ఈ మారణహోమం కొనసాగిస్తున్నారని వక్తలు ఆరోపించారు.
మావోయిస్టుల నాయకత్వంలో, ఆదివాసీల నీరు, భూమి, అడవులను (జల్-జంగిల్-జమీన్) రక్షించడానికి ఒక ప్రజా ఉద్యమం ఉద్భవించిందని వక్తలు పేర్కొన్నారు. ఈ చట్టబద్ధమైన ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆదివాసీలను వారి భూముల నుండి తరిమికొట్టడానికి ప్రభుత్వం సామ్రాజ్యవాద మద్దతుగల బహుళజాతి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను తీర్చడానికి వరుస సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోందని వక్తలు అన్నారు.
మే 21న, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్‌తో పాటు 28 మందిని అరెస్టు చేసి, దారుణంగా చంపారని, అప్పటి నుండి, మరింత మంది కీలక మావోయిస్టు నాయకులు అదే విధంగా చంపబడ్డారు. ఇంకా హత్యాకాండ కొనసాగుతున్నదని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న “ఆపరేషన్ కాగర్”ను వెంటనే ఆపివేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు,మేధావులు ఐక్యంగా ఈ హిందూత్వ ఫాసిజాన్ని ప్రతిఘటించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది.
నిరసన సమావేశం సాంస్కృతిక కార్యక్రమాలతో సాగింది ఆ తరువాత ఎర్ర జెండాతో, అమరుల ఫ్లెక్సీలతో బాంగ్లా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో సాగుతున్న పోరాటంలో అమరులైన కామ్రేడ్స్ కు జోహార్లర్పించారు.
