Menu

ఈ నెల 28 నుంచి అమరుల సంస్మరణ వారాన్ని పాటించండి – మావోయిస్టు పార్టీ పిలుపు

anadmin 2 weeks ago 0 325

*2025 జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ
వారాన్ని పోరాటోత్తేజంతో పాటించండి.

*పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని
కాపాడుకుందాం.

*విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గపోరాటంలో, గెరిల్లాయుద్ధంలో సమీకరిద్దాం.

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా,
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దోపిడీ వర్గాల ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరంన్నర కాలంగా కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధం మధ్య ఈసారి మనం జూలై 28 అమరుల సంస్కరణ వారాన్ని జరుపుకుంటున్నాం. కగార్ దాడిలో మనపార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు (బీఆర్) సహా నలుగురు కేంద్రకమిటీ సభ్యులను, 15 మంది రాష్ట్రకమిటీ సభ్యులను, ఇతరులను కోల్పోయి తీవ్రమైన నష్టాలు కొనసాగుతున్న సమయంలో ఈ సంస్మరణ‌ వారాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి, అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా సోషలిజాన్ని కమ్యూనిజాన్ని స్థాపించే లక్ష్యంతో సామ్రాజ్యవాదంతో, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలతో పోరాడుతూ నేలకొరిగిన కామ్రేడ్స్ స్మృతిలో (యాదిలో) జరుపుకునే జూలై 28 అమరుల సంస్మరణ‌ వారం సందర్భంగా వారి ఆశయాల సాధనకు పునరంకితమయ్యే విప్లవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.

భారత విప్లవ మహానాయకులు, మనపార్టీ సంస్థాపక నాయకులు, ఉపాధ్యాయులు అమరులు కామ్రేడ్ చారుమజుందార్, కామ్రేడ్ కన్హయ్ చటర్జీ రూపొందించిన దీర్ఘకాల ప్రజాయుద్ధ మార్గంలో సాగుతూ మనదేశంలో గత సంవత్సర కాలంలో దాదాపు 357 మంది అమరులయ్యారు. వీరిలో 136 మంది మహిళా కామ్రేడ్స్ వున్నారు. గ్రామీణ ప్రజలు 34 మంది వున్నారు.

అమరులలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో 14 మంది, తెలంగాణలో 23 మంది, దండకారణ్యంలో 281 మంది, ఆంధ్ర-ఒడిశా స్పెషల్ జోన్/ఏపీ లో 9 మంది, మహారాష్ట్ర- మధ్యప్రదేశ్-ఛత్తీస్ గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోన్ లో 8 మంది, ఒడిశాలో 20 మంది, పశ్చిమ కనుమల్లో ఒకరు, పంజాబ్ లో ఒకరు ఉన్నారు. అనారోగ్యాలనలుగురు, సరైన వైద్యం అందకపోవడంతో ముగ్గురు, దుర్ఘటనలో ఒకరు, బూటకపు ఎన్కౌంటర్లలో 80 మంది, చుట్టివేత దాడుల్లో 269 మంది అమరులయ్యారు. అమరులైన వారిలో స్థాయిల వారీగా చూసినపుడు, మనపార్టీ ప్రధాన కార్యదర్శి సహా నలుగురు కేంద్రకమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్రకమిటీ స్థాయి కామ్రేడ్స్ (కగార్ దాడుల్లో 15 మంది, అనారోగ్యంతో ఒకరు), 23 మంది జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్, 83 మంది ఏసీ/పీపీసీ స్థాయి కామ్రేడ్స్, 138 మంది పార్టీ సభ్యులు, 17 మంది పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు, 6 గురు ప్రజా నిర్మాణాల వారు, 34 మంది ప్రజలు ఉన్నారు. మొత్తం 357 మందిలో 36 మంది వివరాలు దొరకలేదు. అమరుల్లో ఎక్కువమంది కగార్ యుద్ధంలో అమరులయ్యారు. చుట్టివేత దాడిలో చిక్కుకున్న నిరాయుధ కామ్రేడ్స్ ను, గాయపడ్డ వారిని ప్రభుత్వ సాయుధ బలగాలు పట్టుకుని హత్య చేసాయి.
అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ సంవత్సరకాలంలో కొంతమంది కామ్రేడ్స్ అమరులయ్యారు. మనదేశంలో, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో అమరులైన కామ్రేడ్స్ కందరికీ మన కేంద్రకమిటీ వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తోంది. అమరుల కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తోంది.

ఈ సందర్భంగా అమరులందరి స్మృతిలో 2025 జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని వారి త్యాగాల స్పూర్తితో, విప్లవ సంకల్పంతో, పోరాటోత్తేజంతో జరుపుకోవాలనీ, పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను,ఐక్యసంఘటనను/ ప్రజానిర్మాణాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామనీ దేశవ్యాప్త విప్లవోద్యమ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గపోరాటంలో, గెరిల్లాయుద్ధంలో సమీకరిద్దామని యావత్తు పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. బలగాలకు, విప్లవ ప్రజానిర్మాణాలకు, యావత్తు ప్రజానీకానికి సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ పిలుపునిస్తోంది.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన (వికసిత్) దేశంగా అభివృద్ధి చేస్తామనే ప్రచార హోరును తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. ఈ సంవత్సరం భారతదేశం జపాన్ దేశాన్ని అధిగమించి నాలుగ‌వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందని ప్రచారం చేస్తున్నాయి. దేశ జనాభాలో 1 శాతం కోటీశ్వరుల వద్ద దేశ సంపదలో 40% సంపద కేంద్రీకృతమైంది. ఈ స్థితిలో ప్రస్తుతం 3.9 ట్రిలియన్ డాలర్ల (ఒక ట్రిలియన్ అంటే ఒక లక్ష కోట్లు) దేశ స్థూల దేశీయోత్పత్తిలో 1% సంపన్నుల వాటా 1.56 ట్రిలియన్ డాలర్లు అవుతుంది. మిగతా 99% దేశ ప్రజల చేతుల్లో 2.34 ట్రిలియన్ డాలర్ల సంపద వుంటుంది. దాన్ని 140 కోట్ల జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం 1670 డాలర్లు మాత్రమే అవుతుంది. ఒక డాలరు మారకపు విలువ ప్రస్తుతం 85 రూపాయలు అనుకుంటే దీనిప్రకారం. తలసరి ఆదాయం 1,41,950 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మరోవైపు దేశంలో 80 కోట్లమంది ప్రభుత్వ రేషన్ బియ్యంపై ఆధారపడి బతుకులీడ్చే దుస్థితి నెలకొంది. ఈ స్థితిలో దేశం నాలుగవ ఆర్థిక వ్యవస్థగా మారిన, రానున్న రోజుల్లో మూడవ ఆర్థిక వ్యవస్థగా మారినా, పెరిగిన సంపదను లెక్కించుకుని అభివృద్ధి చెందిన దేశమని దేశ పాలకవర్గాలు ప్రకటించినా పేదల బతుకుల్లో మార్పేమీ ఉండదు. మరోవైపు పెరుగుతున్న ధరలతో, కోల్పోతున్న ఉద్యోగాలతో, ఉద్యోగాలు లేక/నిరుద్యోగులతో మధ్యతరగతి ప్రజల బతుకులు చితికి పోతున్నాయి. అమెరికా నుండి అక్రమ వలసదార్ల పేరుతో భారతీయులను తరిమేయడంతో, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కారణంగా ఉద్యోగవకాశాలు తగ్గిపోవడంతో మధ్యతరగతి సహా దేశ ప్రజల్లో సామాజిక అశాంతి పెరగనుంది. ఈ సామాజిక అశాంతిని పక్కతోవ పట్టించేందుకు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో మతపరమైన విభజనను సృష్టించి మతమైనారిటీల మీద ప్రత్యేకించి ముస్లింల మీద అన్నిరంగాల్లో దాడులు చేస్తోంది. అందులో భాగంగా ముస్లిం మత సంస్థల వద్దనున్న భూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాల్లో పేదల, ముస్లింల ఇళ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడకుండా బీజేపీ కేంద్రప్రభుత్వం కుట్రపూరితంగా ప‌హల్గాం ఘటనను సృష్టించి, ఆ పేరుతో పాకిస్తాన్ పై దాడిచేసి ప్రజల్లో పాకిస్తాన్ వ్యతిరేక జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టింది. ఈ స్థితిలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టుల కుట్రలను, కుతంత్రాలను బహిర్గతం చేస్తూ ప్రజలను తమ దైనందిన, మౌలిక సమస్యలపై పోరాడేలా సన్నద్ధం చేయాలి. దేశంలో ఆర్థిక, సామాజిక అంతరాలు ఎన్నడూ లేనంతగా పెరుగుతున్న స్థితిలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టుల శక్తుల కుట్రలు, కుతంత్రాలు, ఫాసిస్టు అణచివేత చర్యలు ఎంతోకాలం ప్రజలను అణచివేయలేవు. ఈ అణచివేతకు గురవుతున్న పీడిత వర్గాలు, పీడిత సాంఘిక సముదాయాలు, పీడిత జాతులు వీటిని ప్రతిఘటించి తీరుతాయి. ఆ ప్రతిఘటనను సంఘటిత శక్తిగా మలచడం కోసం కృషి చేద్దాం.

అమరుల ఆదర్శాలను ఎత్తిపట్టడం నేడు మన అందరి కర్తవ్యం. ప్రజా ప్రయోజనాల కోసం ప్రాణాన్ని త్యాగం చేసే సంసిద్ధతను కలిగి ఉండాలి. శత్రువు ప్రకటిస్తున్న లొంగుబాటు- పునరావాస పథకాలను తిరస్కరించాలి. శత్రువు చేస్తున్న మోసకారి మానసిక యుద్ధ ప్రభావానికి లోనుకాకూడదు. అమరుల ఆదర్శాలను దేశవ్యాప్తంగా పట్టణాల్లో, మైదానాల్లో, అటవీ ప్రాంతాల్లో ప్రజలందరిలో, విప్లవ శిబిరంలో విస్తృత ప్రచారం చేసి నూతన తరాన్ని, నవతరాన్ని విప్లవోద్యమంలో సమీకరించాలి. మనిషిని మనిషి దోచుకోవడానికి అవకాశాలు లేని సోషలిస్టు- కమ్యూనిస్టు సమాజ స్థాపన అమరుల ఆశయం. ఆ మహోన్నత ఆశయ సాధన కోసం భారతదేశంలో దోపిడీ వ్యవస్థను నిర్మూలించడం కోసం వర్గపోరాటంలో ప్రజాయుద్ధంలో భాగస్వాములు కావాల్సిందిగా కార్మికులకు, రైతులకు, మధ్యతరగతికి, జాతీయ పెట్టుబడిదార్లకు, మహిళలకు, దళితులకు, ఆదివాసులకు, మతమైనారిటీలకు, పీడిత జాతులకు పిలుపునిస్తున్నాం.

  • అమరుల ఆశయాలను కొనసాగిద్దాం! అమరుల మహోన్నత త్యాగాలను సమున్నతంగా ఎత్తిపడదాం
  • లొంగుబాటును, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దాం! పీడిత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు. దృఢంగా పోరాడుదాం!
  • విప్లవ ప్రతిఘాతక ‘కగార్’ యుద్ధాన్ని విఫలం చేద్దాం!
  • మావోయిస్టు గెరిల్లా యుద్ధ నియమాలను సృజనాత్మకంగా అన్వయిద్దాం! అనవసర నష్టాలు నివారిద్దాం! మారిన పరిస్థితికి తగ్గట్టుగా గెరిల్లాయుద్ధాన్ని కొనసాగిద్దాం!
  • సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాన్ని తీవ్రతరం విస్తృతం చేద్దాం. ప్రజాపునాదిని పెంపొందించుకుందాం!
  • బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించడానికి విశాల లౌకిక ప్రజాస్వామిక శక్తులను
    సమీకరించి పోరాడుదాం!
  • ఉక్రెయిన్ లో సామ్రాజ్యవాడ ప్రచ్ఛన్న యుద్ధాన్ని, పాలస్తీనా ప్రజలపై అమెరికా దన్నుతో || ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న జాతి నిర్మూలనా యుద్ధాన్ని తక్షణం ఆపాలని నినదిద్దాం! ప్రపంచవ్యాప్తంగా పీడిత జాతులకు, ప్రజలకు స్వాతంత్ర్యం. ప్రజాస్వామ్యం కావాలని నినదించే శక్తులను ఐక్యం చేసి పోరాడుదాం!
  • మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వర్ధిల్లాలి!. * ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలికి * భారత నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి! * భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వర్ధిల్లాలి!

కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad