కర్ణాటకలోని దేవనహళ్లిలోని రైతులు దాదాపు 1200 రోజులుగా సాగిస్తున్న పోరాటం విజయం సాధించింది. ఏరోస్పేస్ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తమ వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు మూడు సంవత్సరాలకి పైగా ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
దేవనహళ్లి తాలూకాలోని 1,777 ఎకరాల ప్రతిపాదిత సేకరణను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది, మూడు సంవత్సరాలుగా ఈ చర్యను వ్యతిరేకిస్తున్న స్థానిక రైతుల నిరంతర నిరసనలకు ప్రతిస్పందనగా. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం భవిష్యత్తులో భూసేకరణ రైతుల సమ్మతితో మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు.
తమ వ్యవసాయ భూమిని సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ 1200 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి ఇది ఒక పెద్ద విజయం. దేవనహళ్లి తాలూకాలోని చెన్నరాయపట్నం, సమీప గ్రామాలలో భూసేకరణ ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
“నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయబడింది. పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వాలనుకునే వారి నుండి వారి సమ్మతితో మాత్రమే భూములను తీసుకుంటాము” అని ముఖ్యమంత్రి జూలై 15 మంగళవారం విధాన సౌధలో అధికారులు, రైతు ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత అన్నారు.
మంత్రులు ఎంబీ పాటిల్, కెహెచ్ మునియప్ప, హెచ్‌కె పాటిల్, కృష్ణ బైరే గౌడ, ప్రియాంక్ ఖర్గే, బైరతి సురేష్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్, న్యాయ సలహాదారు పొన్నన్న, అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి, రైతు ప్రతినిధులు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో కర్ణాటకలో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన అత్యంత తీవ్రమైన నిరసనలలో ఇది ఒకటి. ఈ భూమి సారవంతమైనది, స్థానిక వ్యవసాయానికి కేంద్రబిందువు. చాలా మంది రైతులు తమ జీవనోపాధి కోసం దానిపై ఆధారపడి ఉన్నారు.
మరో వైపు, “ప్రతి పౌరుడి ఆదాయం పెరగాలంటే, అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు సాగాలి” అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు, కొత్త పరిశ్రమలను స్థాపించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి భూమి అవసరమని అన్నారాయన. ఇటువంటి పారిశ్రామిక వెంచర్లకు భూమిని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు సిద్దరామయ్య. భూసేకరణ ఆగిపోతే, పరిశ్రమలు వేరే చోటికి మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ”కొంతమంది రైతులు స్వచ్ఛందంగా తమ భూమిని వదులుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. వారి కోసం, ప్రభుత్వం సమ్మతి ప్రాతిపదికన భూమిని సేకరిస్తుంది, మెరుగైన పరిహారం, ప్రతిఫలంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను అందిస్తుంది.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఒకవైపు భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూనే మరోవైపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడిన మాటల పట్ల రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి నాయకత్వం వహించిన చన్నరాయపట్నం భూసేకరణ నిరోధక కమిటీ నాయకులు, చన్నరాయపట్నం హోబ్లీలోని 13 గ్రామాల నివాసితుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. సిద్దరామయ్య చెప్తున్నట్టు “నిజమైన” రైతులెవరూ తమ భూములను అమ్మడానికి ముందుకు రాలేదని కమిటీ కన్వీనర్ కరల్లి శ్రీనివాస్ అన్నారు.
“1195 రోజుల పోరాటం నిజమైన రైతులు చేశారు. తమ పొలాల్లో శ్రమించి, చెమటలు కార్చే వారే అనేక కష్జ్టనష్టాలకోర్చి పోరాడారు. కానీ భూమిని అమ్ముతామంటున్నవారు, మధ్యవర్తులు బెంగళూరులో ఉండేవాళ్ళే” అని ఆయన అన్నారు.
ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేవనహళ్లి రైతుల విజయమనే చెప్పాలి. అయితే ఈ విజయం నిలబెట్టుకోవాలంటే రైతులు మరిన్ని పోరాటాలకు సిద్దం కావాల్సి రావచ్చు.