Menu

ఆ JNU విద్యార్థి మిస్ అయ్యి ఎనిమిదేళ్ళు… కేసు మూసేసిన కోర్టు… ఆ తల్లి ప్రశ్నలకు జవాబెవరు చెప్తారు

anadmin 3 weeks ago 0 118

(maktoobmedia.com లో వచ్చిన ఈ ఆర్టికల్ ను తెలుగు అనువాదం చేసింది పద్మ కొండిపర్తి)

జెఎన్‌యు విద్యార్థి నజీబ్ అహ్మద్ కనిపించకుండా పోయి ఎనిమిది సంవత్సరాలు పైగా గడిచిపోయింది. పరిష్కరించని కేసులో సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును జూన్ 30నాడు ఢిల్లీ కోర్టు ఆమోదించింది.
2018లో నజీబ్ తల్లి ఫాతిమా తన కొడుకు కనిపించడం లేదని వేసిన నిరసన పిటిషన్ మీద విచారణ నడుస్తోంది.
ఢిల్లీలోని జెఎన్‌యు హాస్టల్ ముందు హిందూత్వ మిలిటెంట్ గ్రూపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఎబివిపి సభ్యులు దాడి చేసినప్పటి నుంచి నజీబ్ కనిపించడం లేదు.
నజీబ్ అప్పుడు ఎమ్.ఎస్.సి బయోటెక్నాలజీలో మొదటి సంవత్సరం విద్యార్థి; వయస్సు 27 సం.
మొదట్లో ఈ కేసును ఢిల్లీ పోలీసు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆ తరువాత సిబిఐలాంటి దేశంలోని ఉన్నత స్థాయి ఏజెన్సీలు పరిశోధన చేశాయి.
అయినప్పటికీ, ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయినాక కూడా, నజీబ్ ఎక్కడ ఉన్నాడో ఏ ఏజెన్సీ తెలుసుకోలేకపోయింది.
ఈ ఏజెన్సీలు నా ఆశని, న్యాయపాలన అనే భావాన్ని వమ్ము చేసాయి. నజీబ్ ఇంకా సజీవంగా ఉన్నాడని, మన మధ్యనే ఉన్నాడని నా నమ్మకం” అని ఫాతిమా నఫీసా అన్నారు.
తన కళ్ళతో తన కొడుకును చూస్తాను అనే నమ్మకాన్ని ఆమె ఇంకా పోగొట్టుకోలేదు.
“ఇల్లు పాతదైపోవడంతో మళ్ళీ కట్టాం. నజీబ్ వస్తే గుర్తు పట్టలేడేమోనని నా భర్త ఇంటి ముందు నేమ్ ప్లేట్ పెడతానని అంటున్నాడు. కానీ తను పుట్టిన స్థలాన్నే గుర్తు పట్టలేడా? పరిగెత్తుకుంటూ వస్తాడు” అని క్షణకాలపు చిరునవ్వుతో అన్నది.
“మా జీవితంలో జరిగే ఏ సంతోషకరమైన ఘటనా నజీబ్ లేకుండా అసంపూర్ణమే. బతకాలి కాబట్టి బతుకుతున్నాం. కానీ మా కొడుకు లేకుండా బతుకుతున్నాం.”
“అనవసరమైన కేసులు బనాయించో లేదా జైళ్ళలో పెట్టో రాజ్యం ముస్లిం యువతను మాయం చేస్తోంది. ఏ నేరమూ చేయకుండానే వందలాది మంది ముస్లిం యువతను జైళ్లలో పెట్టారు. వారికి మరో చేర్పు నజీబ్. ఈ దేశంలో ముస్లింల జీవితాలకి ఏ మాత్రం విలువలేదు.
“నా నమ్మకం నన్ను నడిపిస్తోంది; లేకుంటే నేను ఈ దుష్టుల దగ్గర ఓడిపోయి ఉండేదాన్ని. నేను ఇంకా పోరాడడానికి కారణం నా విశ్వాసమే. ఆ విశ్వాసం నుంచే శక్తిని పొందుతాను. అల్లా(దేవుడి కి)కి ఒక ప్రణాళిక ఉంటుంది. అది అన్ని ప్రణాళికల కంటే మంచిగా ఉంటుంది.”
కేసును మూసివేయాలనే సిబిఐ రిపోర్టును ఆమోదిస్తూ కోర్టు, ఏదైనా సాక్ష్యం దొరికితే కేసును మళ్ళీ చేయవచ్చు” అని అన్నది.
“హాస్టల్ ఎన్నికలలాంటి ఉద్రిక్త వాతావరణంలో అందులోనూ జెఎన్‌యులాంటి ప్రదేశంలో అలాంటి తగువులు జరగడం గురించి విన్నాం. కానీ ఈ యువ విద్యార్థులు మరో విద్యార్థి అదృశ్యమయేంత స్థితికి కారణం అవుతారనే, అందులోనూ తగినంత సాక్ష్యం నమోదు కాని పరిస్థితుల్లో నిర్ణయానికి రావడం కష్టం ” అని రౌస్ అవెన్యూ కోర్టు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జ్యోతి మహేశ్వరి అన్నారు.
“2016 నుంచి కనబడని కొడుకు కోసం ఆవేదనతో వెతుకుతున్న తల్లి బాధని గుర్తిస్తున్నాం. కానీ ఈ కేసులో పరిశోధన చేసిన సిబిఐని తప్పు పట్టలేం. ప్రతి నేర పరిశోధనకు సత్యాన్ని కనుగొనడం అనేది పునాదిగా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని కేసులలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పరిశోధనను తార్కిక ముగింపుకు తీసుకురాలేం” అని కూడా కోర్టు అన్నది.
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ లోని ఒక డాక్టర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయలేకపోయామని సిబిఐ ఇటీవల మెజిస్ట్రేట్‌కు తెలియచేసింది.
హింసాత్మక ఘటనలో గాయపడిన నజీబ్‌ను ఈ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు అని చెప్తున్నారు. కానీ అతన్ని ఈ ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు ఎలాంటి కాయితమూ లేదని సిబిఐ చెప్పింది.
మెడికో-లీగల్ కేసు రిపోర్టు తీసుకోకుండానే నజీబ్ హాస్టలుకి తిరిగి వచ్చాడు అని సిబిఐ చెబుతోంది.
“నజీబ్ అహ్మద్‌కు ఆసుపత్రిలో ఎలాంటి పరీక్ష జరగలేదు కాబట్టి సిబిఐకి డాక్టర్‌ను ప్రశ్నించే సందర్భం రాలేదని, అలా చేయడం వృథా శ్రమ” అని కోర్టు గమనించింది.
అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కేసులో ఏ సాక్ష్యమూ దొరకకపోవడంతో ఏజెన్సీ తన పరిశోధనను 2018 లో ఆపివేసింది.
“2016 అక్టోబర్ 14 రాత్రి నజీబ్‌ను కొట్టారనే, బెదిరించారనే విషయాన్ని సాక్షుల వాఙ్మూలాలు సమర్థిస్తున్నప్పటికీ ఆ ఘటనలకూ ఆ తరువాత 15 వ తారీఖు నాడు అతను అదృశ్యం అవడానికీ ఎలాంటి ప్రత్యక్ష, పరిస్థితిసంబంధ సాక్ష్యం రికార్డు కాలేదు” అని ఎసిఎమ్‌జె మహేశ్వరి తన ఆర్డర్‌లో చెప్పారు.
“వాస్తవాలను, పరిస్థితులను పరిశీలించిన తరువాత, దర్యాప్తు చేయగలిగిన అన్ని అంశాలను సిబిఐ పూర్తిగా పరిశీలించిందని స్పష్టమైంది. సమగ్ర దర్యాప్తు చేపట్టి, అన్ని వికల్పాలను వినియోగించుకుంది” అని ఎసిజెఎం మహేశ్వరి అన్నారు.
నజీబ్ హాస్టల్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు, అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ గదిలోనే ఉన్నాయి. అందువల్ల నజీబ్ అహ్మద్ ఎక్కడున్నాడనేది తెలుసుకోవడానికి గానీ, ఆయన గురించి ఎలాంటి ఆధారాలు లభించేలా ఎలాంటి సమాచారాన్నీ లేదా ఆధారాలను నజీబ్ అహ్మద్ వదిలిపెట్టలేదు” అని ఆమె అన్నారు.
ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసే ముందు ఆ విద్యార్థి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు.
తొమ్మిది మంది అనుమానితుల పాత్రపై సీబీఐ సరైన దర్యాప్తు చేయలేదని నజీబ్ తల్లి ఆరోపించింది. ఈ నిందితుల కాల్ వివరాల రికార్డులను పరిశీలించామని, వాటికీ నజీబ్ అదృశ్యానికి ఎలాంటి సంబంధం కనిపించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది.
ఈ నిందితుల పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలంటూ సిబఐ గతంలో ఒక దరఖాస్తును కూడా సమర్పించింది. ఎందుకంటే సంబంధిత వ్యక్తి సమ్మతి ఇవ్వడానికి నిరాకరించడం వల్ల ఈ దరఖాస్తును ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లోని సెక్షన్ 365 (ఒక వ్యక్తిని రహస్యంగా, అన్యాయంగా నిర్బంధించే ఉద్దేశ్యంతో బలవంతంగా ఎత్తుకొనిపోవడం లేదా అపహరించడం) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, నజీబ్ గురించి ఏదైనా సమాచారం అందించినందుకు 50,000 రూపాయల బహుమతిని ప్రకటించారు.
తొమ్మిది మందిని అనుమానితులుగా గుర్తించామని, సమీపంలోని మెట్రో స్టేషన్లలోని సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
2016 డిసెంబర్ 19, 20 తేదీలలో 500 మందికి పైగా పోలీసులు జెఎన్‌యు క్యాంపస్‌ను శోధించారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఢిల్లీ- ఆగ్రా, ఢిల్లీ- బులందర్షా, ఘజియాబాద్, మొరాదాబాద్, రాంపూర్ లతో సహా వివిధ మార్గాల్లో నాలుగు బృందాలను పంపినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
2016 చివరలో, నఫీస్ తన కొడుకును తీసుకురావాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేయాలనుకున్నది. ఆరు నెలల తర్వాత 2017 మే 16న ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఒక సంవత్సరం తరువాత2018 మే 11నాడు సిబిఐ ఢిల్లీ హైకోర్టుకు నజీబ్‌పైన ఎటువంటి నేరం జరిగిందనే ఆధారాలు తమకు లభించలేదని తెలిపింది.
జెఎన్‌యు అధికారులు, సిబ్బంది, స్నేహితులు, సహోద్యోగులతో సహా 26 మందిని ప్రశ్నించినట్లు సీబీఐ పేర్కొంది.
నజీబ్ బలవంతపు అదృశ్యం తరువాత, జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ కార్యాలయం వెలుపల, అలాగే దేశవ్యాప్తంగా వీధులు, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో భారీ నిరసనలు మొదలయ్యాయి. ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమైనందుకు వివిధ విద్యార్థి విభాగాలు వైస్ ఛాన్సలర్‌ను నిందించాయి.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad