భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన పూర్తి పాఠం…
01-07-2025
‘పాకిస్తాన్ తో నైనా శాంతి చర్చలు జరుపుతాము కానీ ఆదివాసీలతో, వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపము’ అనే మోదీ-షా ప్రభుత్వ వైఖరిని ఖండించండి
తెలంగాణ లో కాల్పుల విరమణను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి.
గత నెల ఇరవై తొమ్మిదవ తేదీనాడు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన అమిత్ షా కిసాన్ సమ్మేళన్ లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆయుధాలు చేపట్టిన వారితో చర్చలు జరపదనీ, కాబట్టి మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదనీ, 2026 మార్చ్ 31 కల్లా దేశం నుండి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని మళ్ళీ ఒకసారి ప్రకటించాడు. మావోయిస్టులు ఇప్పటిదాకా నలభై వేల మంది ఆదివాసీలను హతమార్చారని అబద్దపు ప్రకటన కూడా చేశాడు. దానితో పాటు శాంతి చర్చలు జరపాలని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని వారిని నిందించాడు కూడా.
బిజేపి ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి ముఖ్యమంత్రి మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాక అసలు ఛత్తీస్ గఢ్ ఎన్నికలకు ముందు బిజేపి తమ మానిఫెస్టోలోనే మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించి ఉన్నది. దాన్ని కూడా ఎన్నికలలో గెలవడం కోసం తాము చేసిన ‘జుమ్ల’ అని ఇప్పుడు అమిత్ షా కొట్టి పారేయవచ్చు. అది ఆయనకు అలవాటే.
ఏదేమైనా ఆనాటి నుండి అంతకు ముందు కూడా మా పార్టీ, మా పార్టీ నాయకత్వంలోని ఉద్యమ బలాబలాలతో నిమిత్తం లేకుండా ప్రజల ప్రయోజనం కోసం మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే అని ప్రకటిస్తూ వస్తున్నాం. అధికార పార్టీలే అందుకు సిద్ధంగా లేవు. మరింత నిర్దిష్టంగా తెలంగాణలో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ మార్చ్ నెలలో చర్చల కోసం పిలుపిచ్చిన తరువాత అందుకు స్పందనగా మార్చ్ 28 న మేము అందుకు సిద్ధమంటూ అందుకోసం భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేసి, కొత్త క్యాంపుల నిర్మాణం ఆపి చర్చల కోసం తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని మేము ప్రకటించాం. ఆ తరువాత మేము ఏక పక్షంగా నెలరోజుల పాటు కాల్పుల విరమణను పాటిస్తామని కూడా మా తరఫున ప్రకటించాం. దానికి మేము నిజాయితీగా కట్టుబడి ఉన్నాం. అయినా మోదీ-షా ల భద్రతా బలగాలు మా పార్టీని, తమ జల్- జంగల్-జమీన్-ఇజ్జత్ ల కోసం ఆదివాసులు కొనసాగిస్తున్న ప్రతిఘటనా ఉద్యమాలను తుదముట్టించే ఉద్దేశ్యంతో చుట్టివేసి తుదముట్టించే దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టల తో సహా ఎన్నో దాడులు జరిపి మేము కాల్పుల విరమణను ప్రకటించిన తరువాత కూడా ఎనభై ఐదుగురికి పైగా మా పార్టీ, పిఎల్జీఏ కార్యకర్తలను, సైనికులను, నాయకులను ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం మట్టుపెట్టింది. మా పార్టీ ప్రధాన కార్యదర్శి కా. నంబాళ్ళ కేశవరావు (బసవరాజు) తో సహా ఎంతో మంది నాయకులను చుట్టుముట్టి చంపి వేసింది. మరి కొందరిని అనారోగ్యంతో చికిత్స పొందుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపింది. ఎంతో మంది సాధారణ ఆదివాసీ గ్రామస్తులను సైతం పట్టుకొని కాల్చి చంపి మావోయిస్టులని ప్రకటించింది. ఈ మధ్యనే బడి పిల్లల హాస్టల్ లో వంట వండి వడ్డించే ఒక సాధారణ ఆదివాసీని కూడా హతమార్చిన ఉదంతం బయటపడింది. మానవ తలలపై వెలలు ప్రకటించడం వల్ల కోట్లాది రూపాయల రివార్డు కోసం కూడా భద్రతా బలగాలు ఇంత విచ్చలవిడిగా హత్యాకాండకు పాల్పడుతున్నాయి.
చనిపోయిన వారి శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు సరిగా అప్పగించడం లేదు. ఎన్నో అడ్డంకులను కల్పిస్తూ శవాలను భద్రపరచకుండా కుళ్లిపోయేలా చేస్తున్నారు. కనీస మానవ విలువలను కూడా పాటించడం లేదు. ఈ క్రమంలో ఎన్నో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను కూడా భారత ప్రభుత్వం, భద్రతా బలగాలు ఉల్లంఘిస్తున్నాయి. మా పార్టీ ప్రధాన కార్యదర్శియైన కా. బసవరాజు తో పాటు, కా. నాగేశ్వర రావు తదితర ఎనిమిది మంది కామ్రేడ్ల శవాలను కూడా బంధువులకు అప్పగించలేదు. ఆఖరికి కా. బసవరాజు కుటుంబీకులు తమ ఇంటివద్ద జరుపుకుంటున్న సాంప్రదాయబద్ధమైన కర్మకాండను కూడా అడ్డుకొని ఆంక్షలు విధించారు.
అయినా మేము ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆదివాసీల జాతి హననాన్ని ఆపడానికి, వారి నేలను, అడవులను రక్షించడానికి ఇప్పటికీ చర్చల ప్రతిపాదన నుండి వెనక్కు తగ్గలేదు.
ఆయుధాలు ధరించిన వారితో మా ప్రభుత్వం చర్చలు జరపదు అని అమిత్ షా ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా సత్యం కాదు. వాజ్ పేయి ప్రభుత్వ కాలం నుండి, ఇంకా అంతకు ముందు నుండి కూడా ఈశాన్య రాష్ట్రాలలో ఆయుధాలు ధరించిన మిలిటెంట్ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగించింది. ఇప్పటికీ నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. వారితో చర్చలు జరపడానికి లేని ఇబ్బంది మావోయిస్టుల వద్ద ఎందుకు? అంతే కాదు, పహల్ గాం లో ‘టెర్రరిస్టులు’ జరిపిన దాడి వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం ఉందంటూ అక్కడ దాడులు జరిపిన ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యంతో కూడా శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ పాటించినప్పుడు మా పార్టీ తో చర్చలు జరపడానికి మాత్రం సిద్ధం కావడం లేదు. అంతేకాదు. మోదీ చాలా తరచుగా ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం; రష్యా-ఉక్రెయిన్ ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాము. కానీ బహుశా తన ప్రకటనలు తనకు, తన ప్రభుత్వానికి మాత్రం వర్తించవని అనుకుంటాడు.
కా. బసవరాజును హతమార్చిన రోజే గడ్చిరోలీ లో లక్ష ఇరవై వేల చెట్లను నరకడానికి అనుమతినివ్వడం ఈ ‘తుదముట్టించే’ ఎజెండా వెనుక ఉన్న నిజమైన ఎజెండాను బయటపెడుతున్నది. ఇది మా పార్టీని అంతమొందించే ఎజెండా మాత్రమే కాదు. ఆదివాసీల భూములను కాజేసే ఎజెండా. వేల సంవత్సరాలుగా వారి ఆవాసమైన అడవుల నుండి వారిని బేదఖలు చేసే ఎజెండా.
అందుకే ఆదివాసీల ఈ ప్రయోజనాలను కాపాడటానికే మేము ఇప్పటికీ చర్చలకు సిద్ధం.
దేశంలోని ఎంతో మంది మేధావులు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నాయి, అందుకోసం డిమాండ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే జస్టిస్ చంద్ర కుమార్, ప్రొ. హరగోపాల్ ల నాయకత్వంలో శాంతి చర్చల కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కలిసి కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాలని కోరారు. ఆ తరువాత ఢిల్లీ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వంతో కాల్పుల విరమణను ప్రకటింపజేసి, శాంతి చర్చలకై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని కోరారు.
తెలగాణలో బిజేపి మినహా అన్ని పార్టీలు ముక్త కంఠంతో కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. పంజాబ్, తమిళనాడు, కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాలలో కూడా ఇదే విషయంపై ఎన్నో ప్రదర్శనలు కూడా జరిగాయి.
శాంతి చర్చలు జరపమని కోరేవారిని కూడా అమిత్ షా ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేస్తున్నాడు. శాంతిని కోరడం కూడా నేరమన్నట్టు, సమస్య పరిష్కారం కోసం చర్చలు జరపమనడమే అపరాధమన్నట్టు మోదీ, అమిత్ షా ప్రకటనలు ఉంటున్నాయి.
అమిత్ షా ప్రకటనను ఖండిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ‘పాకిస్తాన్ తో చర్చలు జరపగా లేనిది మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపమనడంలో తప్పేముంది’ అని తమ వైఖరికి దృఢంగా కట్టుబడి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. అయితే తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ‘కాల్పుల విరమణ’ను ప్రకటించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కాల్పుల విరమణ కోసం కోరడం నైతికంగా బలం సమకూర్చదు. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించాలని మేం కోరుతున్నాం. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్న సందర్భంలో తమ పార్టీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించేలా చొరవ చేయాలని కోరుతున్నాం.
ఆదివాసీల మారణహోమాన్ని ఆపడానికి, వారు తమ స్వంత నేల నుండే విస్తాపితులు కాకుండా కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణను ప్రకటించాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేయడానికి ఉద్యమాలను నిర్మించాలని, నిరసనలను కొనసాగించాలని మేము అన్ని వామపక్ష పార్టీలను, ఇతర పార్టీలను; ప్రజాస్వామ్య, పౌర, మానవ హక్కుల సంస్థలను, వ్యక్తులను; అన్ని ప్రజా సంఘాలను కూడా కోరుతున్నాము.
అభయ్
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)


