Menu

ఆ జీవో పులుల కోసమా ? మానవ పులుల కోసమా?

anadmin 1 month ago 0 294

జీ. వో. నెం. 49 తో ఆదివాసులను నిర్వాసితులను చేయడానికి ప్రభుత్వం యత్నిస్తున్నదని మావోయిస్టు పార్టీ మండిపడింది. పులులను రక్షించే పేరుతో అదాని, అంబాని తదితర‌ కార్పోరేట్ సంస్థల ప్రయోజనం కోసమే ఈ జీవో తెచ్చారని ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఆరోపించారు.

జగన్ ప్రకటన పూర్తి పాఠం…

ఆదివాసి ప్రజల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళి చేయించాలని తెచ్చిన జీ. వో. నెం. 49 తేదీ. 05.05.2025ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్న‌ది. ఈ జీవో ఉద్దేశ్యం జంతుపులుల కోసం కాదు అనేది వాస్తవం. ఇది మానవ పులులైన మోడీ, అమిత్ షా మానసపుత్రులైన అదాని, అంబాని, కార్పోరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలి.
వేల సంవత్సరాలుగా అడవిని, అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసి, వారి జీవనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలలో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయి. కొమరంభీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదు.

భారతదేశంలోని మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్టలు మెదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుండి వెల్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చిత్ర హింసలకు గురిచేస్తూ చంపుతున్నారు. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ U, వాంకిడి, జైనూర్, కెరమేరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్ న‌గర్, నార్నూర్, సిర్పూర్ (T), చింతల మానపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్య రాజ్యసమితి నిపుణులు, మానవహక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ఈ ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. అడవిలోని సంపదకు, మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసులే అని భారత రాజ్యాంగం చెప్తున్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తున్నది.

ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసిన పాలకులు ఆదివాసులను కనీసం పట్టించుకోలేదు. వీరి బ్రతుకులను రోడ్డుపాలు చేసినారు.

అధికారిక లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల ఎకరాలలో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదు.
ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి భూమాతలో కూడా నమోదు చేయాలి.
వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలి. ఆదివాసి సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయ సమ్మతమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్లను తప్పక వెంటనే పరిష్కరించాలి.

ములుగు జిల్లాలోని ఆదివాసి ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో, కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడానికి రాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
ఆదివాసి బిడ్డ, మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజక వర్గంలో ఈ విదంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడడంలేదు అనేది అందరు మాట్లాడుకుంటున్నారు.
భారత రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ గురించి, 1996 లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి, 2006 లో కాంగ్రేస్ పార్టీ తెచ్చిన FRA గాని, 1/70 చట్టం గురించి సీతక్క మరచిపోయిందా? రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి, భారత రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రేస్ నాయకులకు అర్ధం కావడం లేదా? తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి భాద్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది.
ప్రజలారా… ప్రజాస్వామికవాదులారా… బుద్ధిజీవులారా… కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను కాపాడుకోవడం ప్రజలందరి భాద్యత. వాళ్ళు అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు. దీనికోసం మనమందరం ఆదివాసుల హక్కుల అమలుకోసం వాళ్లకు అండగా ఉందాం.

విప్లవాభివందనాలతో…
జగన్
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్రకమిటీ
సీపీఐ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad