కామ్రేడ్ సునీల్@రవి అమరత్వం చెంది చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. యువకులు ఉద్యమాల్లోకి ఎక్కడ వస్తున్నారండీ, అంతా కెరిరిజం అంటూ కొట్టుకెలుతున్నారంటూ వీల్ చైర్ మేథావి వర్గం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న వేళ రాష్ట్ర సరిహద్దును దాటి అడవిబాట పట్టిన అనేకమంది యువకుల్లో సునీల్ ఒకరు.
సునీల్ దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు. సునీల్ మావోయిస్టు రవిగా పరిణామం చెందకముందు మనందరిముందే అనేక సమావేశాల్లో కళ్ళముందర తిరిగిన యువకుడు. ‘వీర తెలంగాణ’ గడ్డపై పుట్టిన యువతరాన్ని తెలంగాణ ఉద్యమం పేరుతో ఆత్మహత్యలవైపు తీసుకెళ్తున్న సమయంలో నాయకత్వంపై భ్రమలు కోల్పోయిన అనేకమంది తెలంగాణ యువత అడవిబాట పట్టిన సమయంలో సునీల్ కూడా (2013లో) అదే బాట పట్టాడు. డిప్లమో చదివిన విద్యార్థిగా బంగారు భవిష్యత్తును వదులుకొని ఆదివాసీలకు అండగా,సమసమాజ నిర్మాణం వైపు అడుగులు వేశాడు.
పట్టుమని పదేళ్ళు కూడా లేని ఉద్యమ జీవితంలో సహచరుల ప్రేమాభిమానాలు పొందుతూ ఉద్యమ జీవితంలో అనేక అద్భుతాలు సాధించాడు. ప్రజలిచ్చిన జ్ఞానాన్ని తిరిగి ప్రజలకే అందించాలనే తపనతో ప్రజాయుధాన్ని బలోపేతం చేయడం కోసం ఒక పేలుడు పదార్ధాన్ని తయారు చేసి, దాన్ని పరిక్షిస్తున్న సమయంలో ఆ పేలుడు పదార్థం విస్పోటనం చెంది 2020, జూన్ 25న అమరత్వం చెందాడు.
అయితే విషాదకరమైన విషయం ఏంటంటే కామ్రేడ్ రవి చనిపోయిన విషయం సంవత్సరంన్నర తర్వాతే ఆ కుటుంబానికి తెలియడం. ఎక్కడో కొడుకు క్షేమంగా ఉన్నాడులే అని ఆ కుటుంబం అనుకుంటున్న సమయంలో ఆ కుటుంబానికి కొడుకు మరణవార్త తీరని క్షోభ. కనీసం కొడుకు చివరి చూపైన దక్కని ఆ తల్లిదండ్రుల కడుపుకోత ఎవరూ తీర్చనిది.
కామ్రేడ్ రవి ఒక గెరిల్లా యోధుడిగా చాలా మందికి ఓ ఆదర్శ నమూనా. అతను కంప్యూటర్ ఆపరేటర్ మొదలుకొని అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించే వరకూ చాలా నైపుణ్యంగా చేసేవాడని. “లాల్ చింగారి” (మావోయిస్టు హిందీ పత్రిక) కోసం తెలుగు భాషలోని అనేక వ్యాసాలను హిందీలోకి అనువాదం చేసేవాడని తోటి కామ్రేడ్స్ చెప్పే సమాచారం.
కామ్రేడ్ రవితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక గెరిల్లా యోధుడు అతని మరణాంతరం ఓ ఉత్తరాన్ని రాశాడు . ఆ ఉత్తరాన్ని చదివితే కామ్రేడ్ రవి తోటి సహచరులపై ఎంతటి ప్రభావాన్ని కలిగించాడో ఇట్టే తెలిసిపోతుంది. ఆ ఉత్తరాన్ని మీరూ చదవండి…
…
కామ్రేడ్ రవి…!
ఇంత తొందర ఏముచ్చింది కామ్రేడ్! ఇప్పుడు మనం కలిసి ఎన్నో యుద్ధాలు చేయాల్సి వుండె. ఎన్నెన్నో విజయ బావుటాలను ఎగరేయాల్సి వుండె. ఇప్పుడిప్పుడే నువ్వు జీవితంలో 30 వసంతాలను చూసేవేమో. నువ్వు మమ్మల్ని వదిలేసి ఇంత త్వరగా ప్రాణత్యాగం చేస్తావని అనుకోలేదు. నేను అమరుడనైతే నా జీవిత చరిత్ర రాస్తానని నువ్వు నాకు వాగ్దానం కూడా చేశావు. కానీ నీ గురించి నేను రాయాల్సి వస్తున్నది.
నేడు నేను ఈ వాక్యాన్ని రాస్తున్నప్పుడు నిజం చెప్తున్నాను కామ్రేడ్ నాకు ఇప్పుడు కూడా నువ్వు నవ్వుతూ వస్తావని ఉత్సాహంగా చేతులు కలుపుతూ “ఆప్ కైసీ హై కామ్రేడ్?(కామేడ్ రవి తెలుగు భాషీయుడు అందుకని మాట్లాడేపుడు తరచుగా స్త్రీలింగ-పులింగ తప్పులు దొర్లేవి) అంటావని అనిపిస్తోంది.
నేటికి దాదాపు మూడు నెలల క్రితం నీ అమరత్వపు కబురు నాకు తెలిసింది. అప్పటి నుండి నీ గురించి రాయాలని అనుకుంటున్నాను. కానీ కలం ఎత్తే ధైర్యం రాలేదు. నీ గురించి రాయాలని ఆలోచిస్తేనే శరీరంలో కంపనం మొదలవుతుంది. నా కళ్ళనుండి జాలువారే కన్నీళ్లపై నియంత్రణ కోల్పోతాను.
నువ్వు అమరుడైన సరిగ్గా రెండు నెలల తర్వాత ఓ గెరిల్లా క్యాంపులోని టెంట్లో మసక వెలుతురులో దాదాపు రాత్రి 12 గంటల సమయంలో నీ అమరత్వం గురించి నాకు ఒక కామ్రేడ్ చెప్పాడు. మొదట నమ్మలేకపోయాను. కానీ ఎప్పుడైతే వాస్తవాన్ని స్వీకరించానో కండ్ల నుండి కన్నీళ్లు రాలి పడుతాయనిపించింది. నేను నా కన్నీళ్లను నియం త్రించుకోగలిగాను కామ్రేడ్, కానీ ఒక సిగరెట్‌ను ముట్టించకుండా నన్ను నేను నిగ్రహించుకోలేక పోయాను. సిగరెట్ దమ్ము పీలుస్తున్నప్పుడు నువ్వు మరో టెంట్లో నుండి బయటకు వచ్చి ” కామ్రేడ్ మీరు సిగరెట్ తాగుతున్నప్పుడు బాగుంటారు, కానీ మీరు
సిగరెట్‌ను వదిలేయాలి” అని అంటావని అనిపించింది.
నీ మొదటి పరిచయం నాకు గుర్తుకొస్తోంది. అది ఝార్ఖండ్ లోని కోల్పాన్ అడవిలోని ఒక గెరిల్లా క్యాంపు. అక్కడికి మా టీం రాత్రి పొద్దుపోయాక చేరుకుంది. రాత్రి ఒక సీనియర్ కామ్రేడ్‌తో మాట్లాడి నేను నిద్రపోయాను. పొద్దున రోల్‌కాల్‌లో వందలాది కామ్రేడ్స్‌తో నేను చేతులు కలుపుతున్నప్పుడు, నువ్వు చేతులు కలిపిన పద్ధతి నాకు కొంచెం వేరుగా అనిపించింది. అది బహుశా 2015 అక్టోబర్ నెల. రోల్ కాల్ తర్వాత నేను నా సెక్షన్‌కు పోయినప్పుడు నిన్ను నేను అదే సెక్షన్‌లో చూసాను. నేను కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు కమాండర్ నా రక్షణ కోసం నిన్నే పంపించాడు.
అప్పుడు నీ గురించి స్వయంగా చెప్పుకున్నావు. మీ టీం ఛత్తీస్‌గఢ్ నుండి నడుచుకుంటూ ఝార్ఖండ్ వచ్చిందనీ, ఇప్పుడు నువ్వు ఈఆర్‌బీలోనే సీసీ స్టాఫ్‌లో పని చేస్తావని చెప్పావు. మొదటి సారే మనం దాదాపు రెండు నెలలు కలిసి వున్నాం. అక్కడ నేను నీ కార్యకలాపాలన్నింటినీ దగ్గరి నుండి చూశాను. నీ ముఖ్యమైన పని టెక్నికల్ (పార్టీ ప్రెస్)కు సంబంధించింది. కానీ నువ్వు గెరిల్లా యోధుడి వలె సెంట్రీ డ్యూటీ, కిచెన్ డ్యూటీ, కర్రలు తేవడం, పీటీ-డ్రిల్ చేయడం, సరుకులు తేవడానికి గ్రామాల్లోకి వెళ్లడం, పార్టీ క్లాసుల్లో పాల్గొనడం మొదలైనవన్నీ చాలా ఆసక్తిగా చేసేవాడివి. గెరిల్లా యుద్ధ అభివృద్ధి కొరకు మరింత నాణ్యమైన విస్ఫోటక పదార్థాన్ని తయారు చేయడంలో కూడా నీకు చాలా ఆసక్తి వుండేది.
2015 అక్టోబర్ నుండి మొదలైన నీ పరిచయం దాదాపు మూడేళ్ళు కొనసాగింది. ఈ కాలంలో మనం పదులసార్లు కలుసుకున్నాం. కలిసిన ప్రతి సారి నువ్వు అదే తీరులో కనిపించేవాడివి. తెలుగు భాషియుడివి అయినప్పటికీ నువ్వు ఛత్తీస్ ఘడ్ లో వున్న కాలంలో చాలా మనసు పెట్టి, కష్టపడి గోండీ (కోయ) భాష నేర్చుకున్నావు. ఝార్ఖండ్ కు వచ్చాక కొద్ది రోజుల్లోనే హిందీ కూడా నేర్చుకున్నావు. ప్రెస్ పనిని కూడా నువ్వు చాలా ఆధునీకరించావు. ప్రింటెడ్ పోస్టర్లను తీర్చిదిద్దడంసహా ప్రెస్ కు సంబంధించిన అనేక పనులను అభివృద్ధి చేయడంలో నీ కృషి ముఖ్యమైనది.
నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తరచుగా సైనిక యుద్ధాన్ని ఉన్నతీకరించడం గురించి మాట్లాడేవాడివి. నీకిప్పుడు ప్రెస్ పనిపై మనసు లగ్నం కావడం లేదు. సైనిక రంగంలో పని చేస్తానని నువ్వు పార్టీ ముందు ప్రతిపాదన కూడా పెట్టావు. పార్టీ నీ ప్రతిపాదనను అంగీకరించింది కూడా. కానీ సైనిక రంగంలోకి వెళ్లిన తర్వాత నేను నిన్ను కలువలేకపోయాను. సైనిక రంగంలో నీ అనుభవం
ఎలా వుందో కూడా నేను తెలుసుకోలేకపోయాను. నీ కబుర్లు మధ్య మధ్యలో తెలుస్తూనే వుండేవి. నిన్ను కలుస్తాననే ఆశ నాకెప్పుడు వుండేది. కానీ ఇంత త్వరగా నీ అమరత్వం కబురు వింటానని నేను ఎప్పుడూ అనుకోలేదు.
నువ్వు కోపంగా వుండడం నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఏ పనీ పాటా లేకుండా కూర్చొని వుండడం చూడలేదు. నువ్వు ఎప్పుడూ నీ ముఖ్యమైన పని చేస్తూనో, లేదంటే టాబ్‌లెట్‌లో ఏదైనా తెలుగు పుస్తకం చదువుకుంటూనో కనపడేవాడివి. నువ్వు
కామ్రేడ్స్ అందరితోనూ ప్రేమగా మాట్లాడేవాడివి. అందుకని నిన్నెవ్వరూ కలిసినా వాళ్లు నీ భక్తులయిపోయేవారు. నీలో నేర్చుకునే జిజ్ఞాస
మెండుగా వుండేది.
నా ప్రియమైన కామ్రేడా, నీ గురించి రాయాలంటే నాకు వందల పేజీలైనా సరిపోవు. అందుకని కామ్రేడ్ ఇక రాయడం ఆపివేస్తాను.
ఆఖరుగా, నువ్వు నడిచిన దారిలో జీవితాంతం నడుస్తూనే వుంటాననీ, నీ కలలనూ, నీ వంతు యుద్ధాన్ని ఇప్పుడు నా భుజాలకెత్తుకుంటానని నేను నీకు వాగ్దానం చేస్తున్నా.
అన్నట్టు కామ్రేడ్ నేను సిగరెట్లు తాగడం చాలా తగ్గించాను. బహుశా త్వరలోనే వదిలేయగలుగుతాను కూడా.
మా ప్రియమైన కామ్రేడ్ రవీ, నువ్వు వేలాది గెరిల్లా యోధుల గుండెల్లో నిరంతరం సజీవంగా వుంటావు.
నీ ప్రియమైన కామ్రేడ్.
(ఎస్.ఏ డేవిడ్ ఫేస్ బుక్ పోస్ట్)