(ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్ తన ఫేస్ బుక్ వాల్ పై చేసిన పోస్టు…తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)
నేనూ సోనీ సోరిని చెన్నైలో ఒక సెమినార్ లో కలిసినప్పుడు లక్కే అనే అమ్మాయి గాథను వినిపించింది.
దంతెవాడ జిల్లా, రామ్‌పూర్ గ్రామం నుంచి లక్కేను చంపేసి తీసుకువచ్చారు. ఆమె శవాన్ని దంతెవాడ పోలీసు స్టేషన్‌లో పెట్టారు.
“ఈ అమ్మాయిని ఇంటినుంచి లాక్కెళ్లి అడవిలో అనేకమంది పోలీసులు అత్యాచారం చేసారు. . అడవిలోంచి ఆమె అరుపులు వినిపిస్తున్నాయి. మమ్మల్ని తుపాకులతో బెదిరించి దూరంగా నిలబెట్టారు. ఆ అమ్మాయి అమ్మా కాపాడు, నాన్నా కాపాడు అని అరుస్తోంది. కొన్ని గంటల తరవాత ఆమె అరుపులు ఆగిపోయాయి” అని ఆ గ్రామంలోని మహిళలు సోనీ సోరీకి చెప్పారు.
” కాల్పుల శబ్దం వినపడిందా?” అని సోనీ అడిగితే, “కాల్పులు జరగలేదు” అన్నారు. ఆ అమ్మాయి అత్యాచారమూ, క్రూరత్వాల వల్ల చనిపోయింది.
సోనీ సోరి దంతెవాడ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అని అడిగింది. “ఆమె ఒక నక్సలైట్ కమాండర్, ఎన్‌కౌంటర్ లో చనిపోయింది” అని చెప్పారు. మృతదేహం మీద ఉన్న పాలిథిన్ షీట్ తీసి తూటా ఎక్కడ తగిలిందో చూపించమని అడిగితే పోలీసు ఏవో సాకులు చెప్పడం మొదలుపెట్టాడు.
ఇలాంటి గాథ ఇది ఒక్కటే కాదు. బస్తర్ లో ప్రభుత్వం ఆదివాసులపై జరుపుతున్న వేలాది గాథల్లో ఇది ఒకటి.