మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ళ కేశవరావుతో పాటు బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించిన మరో విప్లవ యోధుడు సజ్జా నాగేశ్వరరావు. ఈ కామ్రేడ్ మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న, ఏసన్న,నవీన్ చత్తీస్ గడ్ నారాయణపూర్ ఎన్ కౌంటర్‌లో మృతి చెందారు. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన సజ్జా నాగేశ్వరరావు గత ముప్పైఆరు సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. చేనేత కుటుంబానికి చెందిన బాల గంగాధరరావు, సుబ్బరావమ్మ దంపతులకు రెండవ కుమారుడు సజ్జా నాగేశ్వరరావు. జాండ్రపేట హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి గుంటూరులో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. 80 దశకంలో రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యమం కి జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్టై జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్‌పై విడుదలైన నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
గుంటూరు జిల్లా ఉద్యమంలో ఏసన్నగా కీలక పాత్ర పోషించిన నాగేశ్వరరావు క్రమశిక్షణ కలిగిన ప్రజా యుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలిటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విస్తరించిన విప్లవోద్యమ అవసరాలలో భాగంగా ప్రస్తుత మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
1950లో చీరాల ప్రాంతంలో ప్రారంభమైన విప్లవోద్యమంలో కస్తూరి కుటుంబరావు నాయకత్వంలో ప్రజా యుద్ధంలో పాల్గొని అమరులైన చేనేత కుటుంబానికి చెందిన యువకులు సజ్జా సూర్య బాలానందం, బండారు వెంకటేశ్వర్లు అమరత్వం తర్వాత విప్లవ ఉద్యమంలో జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారు. నారాయణపూర్ ఎదురు కాల్పులలో సజ్జా నాగేశ్వరరావు మరణించడంతో చీరాల ప్రాంతంలో విషాదం అలుముకుంది.
(దిశ వెబ్ సైట్ సౌజన్యంతో…)