జతీయ స్థాయిలో ఏర్పడ్డ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ (శాంతి సమన్వయ కమిటీ)
పత్రికా ప్రకటన
16 మే, 2026
కర్రెగుట్టలో జరిపిన నక్సల్-వ్యతిరేక ఆపరేషన్ ను కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ (శాంతి సమన్వయ కమిటీ) ఖండిస్తోంది; పెద్ద ఎత్తున జరిపిన హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది
2025 మే 14న సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ డీజీపి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిపిన 21 రోజుల మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. అయితే, కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ (CCP) (శాంతి సమన్వయ కమిటీ) ఈ ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మీడియాకు చూపిన ఆధారాలు చాలా తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. మరణించినవారి మృతదేహాలు కనీసం ఐదు రోజులు ఆలస్యంగా, కుళ్ళిపోయిన దుస్థితిలో ఉన్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారిని చట్టబద్ధంగా అరెస్టు చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదని అర్థం అవుతోంది. చంపిన ప్రతి ఒక్కరి పేరు మీద ప్రోత్సాహకంగా భారీగా నగదు బహుమతులు అదే హత్యలు చేసిన బలగాలకే ఇవ్వబడ్డాయట! అంతేగాక, ఈ సంయుక్త ఆపరేషన్‌ను ఏ అధికారులు నడిపించారన్న అంశంలో పారదర్శకత పూర్తిగా లోపించడం మరింత ఆందోళనకరమైన విషయం.
ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ సంకల్ప్” అనే పేరు పెట్టారు, కానీ ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ ఆపరేషన్ సంకల్ప్ అనేదే లేదని ఖండించారు. కానీ అదే సమయంలో కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది హత్యకు గురికావడంతో ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా శీర్షికలలో నిలబడలేకపోయింది, భారత సైన్యం చేపట్టిన చర్యలే పతాక శీర్షిక అయ్యాయి. అయినప్పటికీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ “యుద్ధం లాంటి పరిస్థితి” మూడు వారాలపాటు కొనసాగింది. 24,000కిపైగా సెక్యూరిటీ బలగాలు ఇందులో పాల్గొన్నట్లు సమాచారం, వీరిలో కొందరిని వైమానిక దళ హెలికాప్టర్ల ద్వారా తరలించారు. ఇది “2026 మార్చి 31లోగా దేశాన్ని మావోయిస్టుల నుండి విముక్తం చేయాలి” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగం.
2024 నుండి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు తీవ్రమయ్యాయి. ఎంతమందిని చంపామా అనేదే ఏకైక గీటు రాయి అయ్యింది. ఒక వైపు మావోయిస్టు కేడర్ ‘సరెండర్, పునరావాసాల’తో పాటు మరోవైపు ఈ ఆపరేషన్లు కొనసాగాయి. ఎందరో శాంతి కోసం ఇస్తున్న పిలుపుల మధ్యనే ఈ ఆపరేషన్లు జరిగాయి. వాస్తవానికి, CPI (మావోయిస్టు) (ఆత్మ రక్షణ కోసం తప్ప) మిగతా దాడులు ఆపుతామని ఏక పక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి, శాంతి చర్చలకు సిద్ధమని తెలిపిన సమయంలోనే కర్రెగుట్టల్లో ఈ ఆపరేషన్ ను చేపట్టారు. మావోయిస్టుల మొదటి పత్రికా ప్రకటన మార్చ్ 28న వెలువడితే, 21 ఏప్రిల్ నుండి ఈ ఆపరేషన్ ను మొదలు పెట్టారు.
ఈ ఆపరేషన్ కు సంబంధించి ప్రభుత్వం నుండి వెలువడిన అధికారిక ప్రకటనలు పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా ఉన్నాయి. మే 10 ఉదయం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు సింగ్ దేవ్ 22 మంది మావోయిస్టులు హతమయ్యారని చెప్పారు. అదే సాయంత్రం, డిప్యూటీ సీఎం కూడా అయిన హోం మంత్రి విజయ్ శర్మ ఆపరేషన్ సంకల్ప్ అనేదే లేదని, 22 మంది చనిపోయారనేది కూడా అవాస్తవమని ప్రకటించాడు. ఇద్దరు ప్రధాన ప్రభుత్వాధినేతలు చేసిన ఈ ప్రకటనలలోని వైరుధ్యం ప్రభుత్వంలో కనీస సమన్వయం లేదని బహిర్గత పరిచింది. మరొకవైపు మొత్తం ఈ ఆపరేషన్ సాధికారతనే ప్రశ్నించేదిగా ఉంది. ఏదేమైనా పారామిలిటరీ బలగాలు ఏ జవాబుదారీతనం లేకుండా హత్యాకాండ కొనసాగిస్తున్నదని అర్థం అవుతోంది.
గత రెండు సంవత్సరాలుగా అరెస్టుల కంటే చంపడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారనేది చాలా ఆందోళనకరమైన విషయం. అంతే కాక, ఆ గ్రామాల్లో నివసించే సాధారణ ఆదివాసీలను లేదా మావోయిస్టులతో సంబంధం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని చంపుతున్నట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది.
ఈ ఆపరేషన్‌పై మాజీ సీఎం భూపేష్ బఘేల్ కూడా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ ప్రకటనల్లో ఒకదానికి మరోదానితో పొంతన లేకపోవడం, కొన్ని సోషల్ మీడియా పోస్టులను తొలగించడం, అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనలు, పారదర్శకత లోపించడం వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో సెక్యూరిటీ బలగాలను అభినందిస్తూ పెట్టిన ట్వీట్ కొద్ది గంటల్లోనే తొలగించారు. అదే సమయంలో హోం మంత్రి విజయ్ శర్మ “ఇది ఆపరేషన్ సంకల్ప్ కాదు” అని ప్రకటన చేశారు. ఇది విషయాలను మరింత సంక్లిష్టం చేసింది.
మృతుల వివరాలను, వారి సంబంధాలను, పోస్టుమార్టం నివేదికలు తదితర సమాచారాన్ని వెంటనే ప్రజల ముందుకు తేవాలని ప్రభుత్వాన్ని బఘేల్ డిమాండ్ చేశారు.
ఈ మూడు వారాలపాటు, ఆ ప్రాంతం అంతటా అడవిపై ఆధారపడి జీవనోపాధి కొనసాగించే అక్కడి ప్రజల జీవితాలను ఏ మాత్రం లెక్క చేయకుండా నిరంతరంగా బాంబులు వేసారు. అది వారి జీవితాలను పూర్తిగా కకావికలం చేసి భయభ్రాంతులకు గురి చేసింది. హెలికాప్టర్లు దిగడం, అడవులపై భారీ బాంబుల వర్షం కురిపించడం, భారత జెండాను ఎగరవేయడం వంటి దృశ్యాలను లోకల్ మీడియాకు అనధికారికంగా విడుదల చేసారు. అమిత్ షా ప్రకటించిన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ పద్ధతులను వినియోగిస్తున్నారంటే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం, దీన్ని అంతర్యుద్ధంగా ప్రకటించి, యుద్ధ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
మృతదేహాలను గుర్తించేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు వచ్చినప్పుడు, మీడియా కూడా అక్కడికి చేరింది. మృతదేహాలకు పురుగులు పడి కుళ్ళిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నాయని మీడియా బయటపెట్టింది. మృతదేహాలను సురక్షితంగా ఉంచడానికి ఏ ప్రయత్నమూ పోలీసులు చేయలేదు. పోలీసులు విడుదల చేసిన ఫొటోలను, వివరాలను చూస్తే, మృతుల్లో కొందరు కేవలం 16 ఏళ్ల వయసులోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇదే సమయంలో, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో గ్రేహౌండ్స్ జరిపిన మరో ఆపరేషన్‌లో ముగ్గురు గ్రేహౌండ్ సిబ్బంది మరణించగా, దాని గురించి ఎవ్వరూ నోరు విప్పడం లేదు. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో మృతుల సంఖ్య 31 అని అధికారికంగా ప్రకటించారు. అయితే వారిలో చాలామంది వివిధ సాయుధ బలగాల కాల్పులలో చిక్కుకు పోయిన సాధారణ పౌరులే కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆపరేషన్ లో చనిపోయిన భద్రతా బలగాల సంఖ్యను కూడా చివరి వరకు నిగూఢంగా ఉంచారు. మే 11 నాడు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో 18 మంది గాయపడ్డారని ప్రకటించారు. ఎటువంటి గాయాలు అని అడిగినప్పుడు ‘భద్రతా కారణాలు’ అనే సాకు చెప్పి జవాబు దాటవేశారు.
ఇన్ని రోజులు శాంతి చర్చలు శాంతి చర్చలు అని జపిస్తున్న ప్రభుత్వం, ఒక వైపు మావోయిస్టులు అందుకు తమ అంగీకారం తెలిపినప్పటికీ, ఇటువంటి భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించడం ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని వెల్లడిస్తోంది. దీని వల్ల అపనమ్మకాలు, శాంతి ప్రయత్నాలు అసంభవంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఏ స్థాయిలో నిర్వహించారో దాని బట్టి చూస్తే – ఆ ఆపరేషన్ విజయవంతమైందని అట్టహాసంగా ప్రకటించడం, విజయదర్పాన్ని ప్రదర్శిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విషయాలలో ప్రశ్నలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం వాటిని దాటవేయడానికి చేసిన ప్రయత్నంగానే కనబడుతోంది.
తుదకు, ఎవరి మృతదేహాన్నైనా సరే గౌరవంగా సమాధి చేయవలసి ఉండగా, జెనీవా ఒప్పందం, రెడ్ క్రాస్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన విధానం — మధ్య భారతదేశంలో మోహరించిన పారామిలిటరీ బలగాలు ఎంత అమానవీయంగా వ్యవహరించాయో సూచిస్తుంది. ఆదివాసీల పట్ల, ఇతర మూలవాసీల పట్ల మరణానంతరం కూడా అమానవీయంగా వ్యవహరించడాన్ని చూపిస్తుంది. ఇది దేశంలోని ప్రతి ప్రజాస్వామిక స్వరం ఆగ్రహించాల్సిన విషయం.
మా డిమాండ్లు:
- పదవీవిరమణ చేసిన సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల నాయకత్వంలో ప్రజాస్వామ్యవాదులు / మానవ హక్కుల కార్యకర్తల బృందం ద్వారా స్వతంత్ర విచారణ.
- మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల పేరిట కొనసాగుతున్న యుద్ధాన్ని అంతర్యుద్ధంగా ప్రకటించి, ఐక్యరాజ్య సమితి, తదితర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల పర్యవేక్షణకు లోబడి పని చేయడం.
- మృతదేహాలపట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు.
- ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే ముగించి, కాల్పుల విరమణను ప్రకటించడం.
- విప్లవోద్యమానికి సంబంధించిన అంశాలను నిజాయితీగా పరిష్కరించే ఉద్దేశంతో సిపిఐ (మావోయిస్ట్)తో శాంతి చర్చలు ప్రారంభించడం.
కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ (శాంతి కోసం సమన్వయ కమిటీ) తరఫున,
కవిత శ్రీవాత్సవ, (పియూసిఎల్ అఖిల భారత అధ్యక్షులు)
93515 62965
క్రాంతి చైతన్య (కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ కో-కన్వీనర్)
99122 20044
డా. ఎంఎఫ్. గోపీనాథ్ (భారత్ బచావో ఆందోళన్, ఉపాధ్యక్షులు)
79935 84903