Menu

కర్రెగుట్టలు…నిజాలు… అబద్దాలు….

anadmin 3 months ago 0 486

దేశంలో మావోయిస్టులను తుదముట్టిస్తానని కగార్ ఆపరేషన్ చేపట్టిన మోడీ, అమిత్ షాలు అందుకు 2026 మార్చ్ ను తుదిగడువుగా పెట్టుకున్నారు. అందుకోసం మధ్య భారతంలో లక్షలాది సైన్యాన్ని దించారు. తొమ్మిది మంది ఆదివాసులకు ఒక సైనికుడి చొప్పున అర్దసైనికబలగాలున్నాయక్కడ. ఇదే తుదిపోరుగా చెప్తున్న అమిత్ షా ఒక్కో తలకు వెలకట్టి ప్రతి నెల పోలీసు బలగాలకు టార్గెట్లు నిర్ణయించాడనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు చత్తీస్ గడ్ లోని బస్తర్, భీజాపూర్, దంతెవాడ జిల్లాలతో సహా ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా ఎన్ కౌంటర్ల పేరుతో ప్రతీ రోజు కొందరిని చంపి మావోయిస్టులుగా చూపిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో కర్రెగుట్టలపై పోలీసు బలగాలు చేపట్టిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కర్రెగుట్టల్లో అనేకమంది మావోయిస్టులున్నారని మీడియాకు లీకులిచ్చిన పోలీసులు, మావోయిస్టుల పేరుతో అబద్దపు ప్రకటనలు కూడా రిలీజ్ చేసి కర్రెగుట్టలపైకి యుద్దానికి వెళ్ళారు. చత్తీస్ గడ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టలపైకి మూడు వైపుల నుండి దాదాపు 20వేల మంది సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్, సీ60 పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి దాదాపు 20 రోజులుగా కూంబింగ్ చేస్తున్నారు. మొదట హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా గుట్టలపైనుండి జల్లెడపట్టారు. మందుపాతరలు పేల్చారు. దగ్గరికి ఎవ్వరినీ రానీయకుండా మీడియాను కూడా మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. అక్కడొచ్చే శబ్ధాలను బట్టి అక్కడేదో జరుగుతుందని అనుకోవడం తప్ప నిజాలు మాత్రం ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు.

మీడియా కూడా పోలీసు అధికారులు ఇచ్చే లీకుల మీద ఆధారపడి వార్తలు వండింది. కర్రగుట్టలపై హిడ్మా ఉన్నాడని, అతని బెటాలియన్ కూడా అక్కడే షెల్టర్ తీసుకుందని ప్రచారం చేశారు. హిడ్మాను టార్గెట్ చేసుకునే కర్రెగుట్టల మీద సంకల్ప్ అనే ఆపరేషన్ చేపట్టారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండురోజులకే అక్కడ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్, కేంద్రకమిటీ సభ్యులు చంద్రన్న, తెలంగాణ రాష్ట్రకమిటీ సభ్యులందరూ ఉన్నారనే లీకులు వచ్చాయి. అక్కడితో ఆగలేదు. ఎన్ కౌంటర్లు జరిగాయని అందులో 38 మంది మావోయిస్టులు చనిపోయారని ఒకసారి, 22 మంది చనీపోయారని వార్తలు ప్రచారం చేశారు. చంద్రన్న, బండ ప్రకాశ్ లు చనిపోయారని కూడా మీడియా ప్రచారం చేసింది. మీడియాకు ఈ లీకులను అందించింది పోలీసు అధికారులే. ఈ మొత్తం వ్యవహారంలో అధికారిక ప్రకటనలు తక్కువ లీకులే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో నిజమెంత ? అబద్దమెంత ? కొన్ని సంఘటనల్లో బైటికి వచ్చిన అసలు విషయాలను చూద్దాం…

ఈ నెల 7వ తేదీన, కర్రె గుట్టల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్యన జరిగిన జరిగిన ఎన్ కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంద‌దని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 8వ తేదీన మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ముగ్గురు జవాన్లు మరణించారని మరో ఏ ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయని మరో వార్త వచ్చింది. 22 మంది మావోయిస్టులు చనిపోయినట్టు, ఇది తమ పోలీసులు సాధించిన ఘన విజయమని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సయ్ ప్రకటించారు కూడా. అయితే ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్ది సేపటికే ఆ రాష్ట్ర హోం శాఖా మంత్రి విజయ్ శర్మ ఆ వార్తలను ఖండించారు. అలాంటి సంఘటనే జరగలేదని, ఎవ్వరూ చనిపోలేదని ప్రకటించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేశారు. నిజానికి ఆదివాస్దీ అయిన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కన్నా బ్రాహ్మణ్ అయిన విజయ్ శర్మ పవర్ ఫుల్ అని బీజేపీ నాయకులే చెప్తుంఆరు. పైగా బీజేపీ అధినాయకత్వం చత్తీస్ గడ్ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలైనా, పార్టీకి సంబంధించిన విషయాలైనా విజయ్ శర్మ మీదనే ఆధారపడుతుందన్నది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో అమిత్ షా ఏం చెప్పదల్చుకున్నాడో అదే విజయ్ శర్మ చెప్పాడన్నది మనం అర్దం చేసుకోవాలి? మరి నిజంగానే ఎన్ కౌంటర్ జరగలేదా? 22 మంది చనిపోయారన్నది అబద్దమేనా ?

ప్రముఖ గాంధేయ వాది హిమాంశు కుమార్ ఇదే విషయంపై తన ఫేస్ బుక్ లో ఇంగ్లూష్ లో ఓ పోస్ట్ పెట్టారు. పద్మ కొండి పర్తి అనే కార్యకర్త ఆ పోస్ట్ ను తెలుగు అనువాదం చేశారు. ఒక్క సారి ఆ పోస్ట్ ను చూద్దాం…

”ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట అడవిలో బుధవారం 22 మంది నక్సలైట్లు మృతి చెందారని ఆజ్ తక్ చానెల్‌తో సహా అనేక వార్తా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి.
కానీ పోలీసులు ఏ నక్సలైట్ ఫోటోను గానీ, పేరును గానీ, వారిపై ప్రకటించిన రివార్డు గురించి గానీ మీడియాకు చెప్పకపోవడం ఇదే మొదటిసారి.
అందుకు విరుద్ధంగా, ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి ఎటువంటి సైనిక చర్య జరగడం లేదని, 22 సంఖ్యను ప్రసారం చేయవద్దని ఒక వీడియోను విడుదల చేసాడు.
స్థానిక జర్నలిస్టుల ప్రకారం, జర్నలిస్టులను ఘటనా స్థలం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఈరోజు నేను ఒక స్థానిక జర్నలిస్టుతో మాట్లాడాను, బీజాపూర్ ఆసుపత్రిలో 12 మృతదేహాలను మాత్రమే ఉంచగలరని, కానీ 22 మృతదేహాలను అక్కడే ఉంచారని, ఇది వేసవి కాలం కాబట్టి మృతదేహాలు చెడిపోతాయనే భయం ఉంది అని ఆయన అన్నారు.
చనిపోయిన వ్యక్తులు నిర్దోషులైన ఆదివాసులు కాదు కదా అని స్థానిక సామాజిక కార్యకర్తలు అనుమానిస్తున్నారు
ఇది సాగుకు ముందు జరుపుకునే బీజ పాండుం అనే విత్తనాల పండగ సమయం.
ఈ సందర్భంగా ఆదివాసులు రాత్రిపూట అడవిలో బస చేసి తమ సాంప్రదాయ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
గతంలో, రెండు ఘటనలలో, పాండుం జరుపుకుంటున్న ఆదివాసులను సి‌ఆర్‌పి‌ఎఫ్ బలగాలు చంపేసాయి. సర్కెగూడలో 9 మంది చిన్న పిల్లలు సహా 17 మంది ఆదివాసులు మరణించారు; ఎడ్స్‌మెట్టాలో నలుగురు చిన్న పిల్లలు సహా 9 మంది ఆదివాసులు మరణించారు.
ఈ పరిస్థితులన్నింటిలోనూ, హత్యకు గురైన నక్సలైట్ల గురించి పోలీసులు మొదటిసారిగా మీడియాకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదనే సందేహం తలెత్తుతోంది.”

హిమాంశు కుమార్ స్థానిక జర్నలిస్టుతో మాట్లాడితే, బీజాపూర్ ఆసుపత్రిలో 12 మృతదేహాలను మాత్రమే ఉంచగలరని, కానీ 22 మృతదేహాలను అక్కడే ఉంచారని ఆయన చెప్పారని హిమాంశు కుమార్ అన్నారు.
పైగా వాళ్ళంతా ఆదివాసులేనేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా హెలీ కాప్టర్ నుండి డెడ్ బాడీలను కిందికి దించిన ఇమేజ్ లను చూపించారు. ఇక్కడ చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి మాట్లాడింది నిజమా లేక హోం మంత్రి మాట్లాడింది నిజమా అనేది ఎప్పటికైనా అధికారికంగా తేలుతుందా ? స్థానిక జర్నలిస్టులు చెప్తున్న దాని ప్రకారమైతే 22 మంది మరణించింది నిజం వాళ్ళందరూ ఆదివాసులే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది కూడా నిజం.

(ఈ అంశానికి సంబందించి బస్తర్ టాకీస్ యూ ట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియో కింద చూడండి)

ఇక రెండో విషయం. కర్రెగుట్టల్లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ముగ్గురు జవాన్లు చనిపోయారన్న విషయం. ఒక వైపు కాల్పుల విరమణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మావోయిస్టు పార్టీ తనకు తాను ఏక పక్షంగా ఆరునెలల కాల్పుల విరమణ ప్రకటించింది. శాంతి చర్చలకు తాము సిద్దమని మావోయిస్టు పార్టీ ప్రకటించిన నాటి నుంచి నా దృష్టికి వచ్చినంతవరకు ఆ పార్టీ వైపు నుండి ఎటువంటి కాల్పులు జరగలేదు. పైగా కర్రెగుట్టల మీద పోలీసులు ఆపరేషన్ చేపట్టిన‌ నాటి నుండి వాళ్ళకు మావోయిస్టులు తారసపడింది కూడా లేదు. అసలు ఆ గుట్టల మీద మావోయిస్టులు ఉన్నారా లేరా అనేది కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ ప్రకటించినట్టు మావోయిస్టులు మందుపాతర పేల్చి ముగ్గురు పోలీసులను చంపారన్న దాంట్లో నిజముందా ? లేక తెలంగాణలో కూడా నిర్బందం అమలు చేయడం కోసం పోలీసులు ఆడుతున్న నాటకమా ? నాటకమైతే ఆ ముగ్గురు పోలీసులను చంపిందెవరు?

ఈ విషయం పై కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం చూస్తే మనకు నిజమేంటో అర్దమవుతుంది. తెలంగాణ వైపు నుండి గ్రే హౌండ్స్ దళాలు, చత్తీస్ గడ్ వైపు నుండి సీఆర్పీ ఎఫ్ దళాలు కూంబింగ్ చేస్తున్నారు. తెలంగాణ వైపు నుండి వెళ్ళిన గ్రే హౌండ్స్ దళాలు చూసుకోకుండా చత్తీస్ గడ్ లోకి ప్రవేశించాయి. ఆ విషయంపై చత్తీస్ గడ్ వైపు నుండి వచ్చిన సీఆర్పీ ఎఫ్ దళాలకు సమాచారం లేదు. అందువల్ల గ్రే హౌండ్స్ దళాలను మావోయిశ్తులుగా భావించిన సీఆర్పీఎఫ్ దళాలు వీరిపై కాల్పులు జరపగా ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరొకతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పొరపాటును గ్రహించినప్పటికీ అప్పటికే ప్రాణాలు పోయాయి కాబట్టి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మావోయిస్టుల మందుపాతర అనే అక్థను పోలీసు అధికారులు మీడియాకు వినిపించారన్నది అర్దమవుతోంది. మరణించిన ఆ ముగ్గురికి మందుపాతర వల్ల గాయాలైనట్టుగా లేదని, బుల్లెట్ల గాయాలవల్లనే చనిపోయినట్టు ఉందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా బైటపడినట్టు సమాచారం. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది.

(ఈ అంశానికి సంబంధించి బిగ్ టీవీ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోను కింద చూడండి)

ఇక చంద్రన్న, బండి ప్రకాశ్ లు చనిపోయారని మూడు రోజుల క్రితం మరో ప్రచారం చేశారు పోలీసులు. దాన్ని కూడా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఇప్పటి వరకు అందులోని నిజానిజాలని అధికారులు బైటపెట్టలేదు. గతం లోకూడా హరిభూషణ్ చనిపోయాడంటూ, దామోదర్ చనిపోయాడంటూ, ఇతర నాయకులు చనిపోయారంటూ అనేక ప్రచారాలు చేశారు పోలీసులు. అవి నిజం కాదని ఆలస్యంగానైనా బహిర్గతమయ్యింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలే చేసి విప్లవ అభిమానులను, ప్రజలను గందరగోళ పర్చడానికి ఎత్తుగడలు సాగుతున్నాయి.

ఇప్పుడు కర్రెగుట్ట చుట్టూ పాలకులు అల్లుతున్న కథలు, చేస్తున్న అబద్దపు ప్రచారాలు యుద్దంలో ముందు మరణించేది సత్యం అన్నది మరొక్కసారి నిరూపిస్తున్నది.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad