భారత ప్రభుత్వం, మావోయిస్టు పార్టీలు కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలని దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో గతంలోనే కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు తాము సిద్దమని మావోయిస్టు పార్టీ నాయకులు అభయ్, రూపేష్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా తాము ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జగన్ ప్రకటన పూర్తి పాఠం…
7/5/2025
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టికొని “మా నుండి 6 నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటిస్తున్నాము.”
ప్రియమైన కామ్రేడ్స్ మరియు ప్రజలారా!
గత కొంత కాలంగా మా పార్టీకి ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరుపాలనే డిమాండ్ ను మొదట తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. దానిలో భాగంగా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు, వ్యక్తులు, ప్రముఖులు, పార్టీలు ఇదే డిమాండ్ ను చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చర్చల విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీపీఐ కగార్ ఆపరేషన్ ను రద్దు చేసి శాంతి చర్చలు జరుపాలని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఆ కార్యక్రమాలలో మిగతా వామపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. BRS పార్టీ కూడా తమ రజితోత్సవ సభలో శాంతి చర్చలు జరుపాలని తీర్మానం చేసింది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కూడా శాంతి చర్చలు జరుపాలనే డిమాండ్ ను చేసారు. మాజీ ముఖ్యమంత్రి BRS నాయకులు చంద్రశేఖరావు కూడా ఇదే డిమాండ్ ను ప్రస్తావించారు. BRS నాయకురాలు కవిత కూడా ఇదే డిమాండ్ ను చేసారు. ఇది హర్షించదగిన విషయం.
రాష్ట్రంలో ఇంకా అనేక మంది మేధావులు, ప్రముఖులు ఇదే విషయం మీద ప్రచారం చేస్తున్నారు. అన్ని వామపక్ష పార్టీలు ఇదే డిమాండ్ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలోమరియు దేశంలోనూ ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలకు సానుకూలతను కలిగించేందుకు మా నుండి కాల్పుల విరమణను ప్రకటించుచున్నాము.
జగన్
అధికార ప్రతినిధి
తెలంగాణ
సీపీఐ (మావోయిస్ట్)
