చత్తీస్ గడ్ తో సహా తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల నిర్మూలన అనే పేరుతో ప్రభుత్వం మానవ హననానికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుండి చత్తీస్ గడ్ వరకు వ్యాపించి ఉన్న కర్రె గుట్టలపై వారం రోజులుగా సైనిక బలగాలు హెలీకాప్టర్ల ద్వారా బాంబింగ్ చేస్తున్నాయి. 20 వేలకు పైగా బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి. చుట్టు పక్కల గ్రామాల నుండి దాదాపు 200 మందికి పైగా ఆదివాసులను సైనిక బలగాలు తమ వద్ద బందీలుగా ఉంచుకున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు ప్రతి రోజూ పదుల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల చేతుల్లో మరణిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం ఏ వార్తలు దృవీకరించడం లేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, రవి చందర్, జంపన్నలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
నక్సలిజాన్ని సామాజిక కోణంలోనే తాము చూస్తున్నామని, దానిని శాంతిభద్రతల అంశంగా పరిగణించకూడదన్నది తమ ప్రభుత్వ విధానం అని రేవంత్ అన్నారు. ఈ అంశం పై,గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు
తీసుకుంటామని ,మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.