Menu

అంబానీ వంతారా ప్రాజెక్ట్‌పై వార్తలు రాసిన మీడియాకు బెదిరింపులు

anadmin 4 months ago 0 76

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ యాజమాన్యంలోని వంతారా – యానిమల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి దక్షిణాఫ్రికా వన్యప్రాణి రక్షణ సంస్థ Wildlife Animal Protection Forum of South Africa (WAPFSA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వార్తలు వచ్చిన కొద్ది రోజుల్లోనే మూడు ప్రధాన మీడియా సంస్థలు తమ వెబ్‌సైట్స్‌ నుండి ఆ కథనాలను తొలగించాయి.

దక్షిణాఫ్రికాకు చెందిన వైల్డ్‌లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫ్ సౌత్ ఆఫ్రికా (WAPFSA)లో 30 సంస్థలు ఉన్నాయి. WAPFSA చిరుతలు, పులులు, సింహాలు వంటి వన్యప్రాణులను దక్షిణాఫ్రికా నుండి వంతారాకు తరలించడంపై దర్యాప్తు చేయాలని దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖను మార్చి 6 న కోరింది.

అనంత్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్‌ గ్రూప్‌కు చెందిన వంతారా ప్రాజెక్ట్‌ను మార్చి 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. “ఇండియాతో పాటు వేరు వేరు దేశాలలో అనారోగ్యంతో ఉండి అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం, వాటికి చికిత్స అందించి పునరావాసం కల్పించడం” తమ ఉద్దేశ్యంగా వంతారా ప్రకటించుకంఉది. 3000 ఎకరాల స్థలంలో, జంతువుల కోసం 650 ఎకరాల ప్రత్యేక సెటప్‌ ఏర్పాటు చేశారు. దీనిని గ్రీన్స్ జులాజికల్, రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC) అని పిలుస్తారు.

తాజాగా ప్రధాని వంతారాను సందర్శించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యావరణ మంత్రి డియోన్ జార్జ్‌కు WAPFSA రాసిన లేఖలో, అంతరించిపోతున్న జీవజాతుల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను వంతారా పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. Convention on International Trade in Endangered Species (CITES) అనేది అంతరించిపోతున్న జంతువులు, మొక్కల విషయంలో ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించే ఒప్పందం.

WAPFSA దక్షిణాఫ్రికా పర్యావరణ మంత్రి డియోన్ జార్జ్‌కు రాసిన లేఖలో లేవనెత్తిన ముఖ్య అంశాలను మార్చి 9 – 11 మధ్య అనేక భారతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. వీటిలో డెక్కన్ హెరాల్డ్, ది టెలిగ్రాఫ్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, ది ట్రిబ్యూన్, స్క్రోల్, ది వైర్, నార్త్ ఈస్ట్ నౌ, వార్త భారతి, డౌన్ టు ఎర్త్ ఉన్నాయి.

అయితే, ఆ తరువాత కొద్ది రోజులకే డెక్కన్ హెరాల్డ్, ది టెలిగ్రాఫ్, ది ట్రిబ్యూన్ మీడియా సంస్థలు తమ కథనాలను తొలగించాయి. ఆ కథనాల లింక్‌పై క్లిక్‌ చేస్తే ‘ERROR 404’ అని, లేదంటే ‘పేజీ అందుబాటులో లేదు’ అనే మెసేజ్‌ కనిపిస్తోంది.

2023లో జరిగిన CITES స్టాండింగ్ కమిటీ (SC77) సమావేశం నిర్ణయాలను వంతారా ఉల్లంఘించడం చర్చనీయాంశంగా మారింది. జూలై 28, 2023న, Greens Zoological, Rescue, and Rehabilitation Centre (GZRRC) ప్రతినిధులు CITES సెక్రటేరియట్‌ను సందర్శించారు. ఇటీవలి కాలంలో భారతదేశం బయట అనేక రకాల జంతువులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాంటి వాటిని ఇండియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇలా జంతువుల తరలించడానికి గల చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి.

“వంతారా సౌతాఫ్రికా నుంచి జంతువులను తీసుకెళ్లడం, కాపాడడమో, పరిరక్షించడమో కానే కాదు” అనే శీర్షికతో WAPFSA నివేదికను రూపొందించింది. పరిరక్షణ పేరుతో దక్షిణాఫ్రికా నుండి భారీ సంఖ్యలో చిరుతలు, పులులు, సింహాలు ఎగుమతి కావడం వ్యాపార ప్రయోజనాల కోసమే కావచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ విషయంలో అత్యవసర దర్యాప్తు అవసరం అని అభిప్రాయపడింది.

వంతారాను “వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం”గా అభివర్ణించారు. 2,000పైబడిన జాతులను, 1.5 లక్షలకు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న జంతువులు అక్కడ ఉన్నాయి. కాగా వంతారాను “జంతుప్రదర్శనశాల”గా WAPFSA పేర్కొంది. దక్షిణాఫ్రికా నుండి దిగుమతి చేసుకుంటున్న వన్యప్రాణుల జాతులను నిర్వహించడానికి ఇది సరిపోదని వాదించింది. వాటిలో అంతరించిపోతున్న అరుదైన జంతువులు ఉన్నాయని పేర్కొంది.

వంతారా ఉన్న ప్రాంతం పట్ల కూడా WAPFSA నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. “భారతదేశంలోని అనేక ప్రాంతాల కంటే గుజరాత్ వేడిగా ఉన్నందున వంతారా అనుకూలతపై సందేహాలు లేవనెత్తింది. దిగుమతి చేసుకున్న అనేక జాతులకు ఈ ప్రాంతం అననుకూలమైంది” అని పేర్కొంది. నమీబియా, దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎగుమతి చేయబడిన చిరుతల గురించి కూడా ఈ నివేదిక హైలైట్ చేసింది. వాటిలో చాలా వరకు చనిపోయాయని పేర్కొంది.

స్పిక్స్ మకావ్స్ వంటి అరుదైన పక్షులు ఉన్న ఏకైక దేశమైన బ్రెజిల్. అంతరించిపోతున్న జాతులను వంతారాకు పంపాలనే జర్మనీ నిర్ణయాన్ని బ్రెజిల్‌ వ్యతిరేకించిందని నివేదిక పేర్కొంది.

అయితే… టెలిగ్రాఫ్, డెక్కన్ హెరాల్డ్ వెబ్‌సైట్‌లలో కథనాలు అందుబాటులో లేకపోవడం గమనించిన ఆల్ట్ న్యూస్, రెండు సంస్థలను సంప్రదించింది. ది టెలిగ్రాఫ్‌లో సీనియర్ సంపాదకీయ హోదాలో ఉన్న ఒకరు ఈ విషయం గురించి మాట్లాడడానికి నిరాకరించారు. డెక్కన్ హెరాల్డ్ ప్రతినిధి కూడా .

ఇక, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వ్యవహారం కూడా అంతే. మరోమాటలో చెప్పాలంటే అంతకంటే ఆసక్తికరమని చెప్పాలి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ మొదట, “దక్షిణాఫ్రికా నుండి అంబానీకి చెందిన వంతారాకు అడవి జంతువుల ఎగుమతిపై ఆ దేశానికి చెందిన ఓ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది” అనే శీర్షికతో ఒక వార్తను ప్రచురించింది. అయితే, ఇప్పుడు ఈ కథనానికి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేస్తే, వారు “వంతారా: ఎ మోడల్ ఫర్ యానిమల్” అనే శీర్షికతో ఉన్న మరో స్టోరీ కనిపిస్తోంది. ఇందులో మరో వింత ఏంటంటే.. పాత కథనానికి చెందిన URL మాత్రం మారకపోవడం గమనార్హం.

పాత కథనంలో వంతారాలో జంతువుల పట్ల WAFSPA ఆందోళన వ్యక్తం చేసిన వార్త ఉంటే, కొత్త కథనంలో మాత్రం వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల రక్షణ ఆపరేషన్ అని క్తీరించడం కనిపిస్తుంది. అధునాతన రోగ నిర్ధారణలతో ఆసియాలో మొట్టమొదటి వన్యప్రాణుల ఆసుపత్రి, క్వారంటైన్ సౌకర్యాలు, ప్రత్యేక రెస్క్యూ కేంద్రాలలో ప్రపంచ ప్రమాణాలు ఇక్కడ ఉన్నాయని కథనంలో రాసుకొచ్చారు.

ఆల్ట్ న్యూస్ గౌహతికి చెందిన మీడియా సంస్థ నార్త్ ఈస్ట్ నౌను కూడా సంప్రదించింది. ఇది కథనాన్ని తొలగించలేదు. దక్షిణాఫ్రికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ వంతారాపై దర్యాప్తుకు డిమాండ్‌ చేసిన కథనాన్ని ప్రచురించిన తర్వాత నార్త్‌ ఈస్ట్‌ నౌ సంస్థకు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని ఎడిటర్ మహేష్ డేకా చెప్పారు. ఈమెయిల్ కాకుండా, ఒక PR సంస్థ కూడా ఆ సంస్థను సంప్రదించిందని, కథనాన్ని తొలగించాలని, లేదా తాము సూచించే వేరే వెర్షన్‌కు ప్రచురించడానికి డబ్బు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. జనవరిలో కూడా, ఈశాన్య ప్రాంతం నుండి గుజరాత్‌కు ఏనుగులను రవాణా చేస్తున్నట్లు NE Now రాసినప్పుడు, ఢిల్లీ, ముంబై నుండి అనేక సంస్థలు ఆర్థిక ఆఫర్లతో వారిని సంప్రదించాయి.

కర్ణాటకకు చెందిన మీడియా సంస్థ వార్త భారతికి కూడా ఇలాంటి సమాచారం అందింది. ఆ సంస్థ ఎడిటర్ ఒకరు తాము రాసిన వంతారా కథనం గురించి రిలయన్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుండి కాల్ వచ్చిందని ఆల్ట్ న్యూస్‌తో అన్నారు.

మరోవైపు, WAPFSA అధికారిక వెబ్‌సైట్‌లో దక్షిణాఫ్రికా మంత్రి డియోన్ జార్జ్‌కు రాసిన లేఖ ఉన్న వెబ్‌పేజీ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. WAPFSA అధికారిక వెబ్‌సైట్‌లో వంతారా అనే పేజీ ఆర్కైవ్ భారతదేశానికి అడవి జంతువుల ఎగుమతులకు సంబంధించిన ఆందోళనలను రికార్డ్‌ చేస్తుంది. మంత్రి జార్జ్‌కు పంపిన లేఖ ఈ ఆర్కైవ్స్‌లో ఉంది. – https://wapfsa.org/vantara/

ఈ విషయంపై మరింత స్పష్టత కోసం మేము WAPFSA, Vantara రెండింటినీ సంప్రదించాము.

UKకి చెందిన ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, తమపై వచ్చిన ఫిర్యాదులన్నీ “స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశించినవే”, “వన్యప్రాణుల బదిలీపై ప్రపంచంలోని అత్యున్నత అధికార సంస్థ CITES పూర్తిగా దర్యాప్తు చేసి, క్లోజ్‌ చేసిన పాత విషయాలను మళ్లీ తెరమీదకు తెచ్చే ప్రయత్నం ఇది” అంటూ వంతారా పేర్కొన్నట్లు పేర్కొంది. తమపై వచ్చిన ఆరోపణలు “పూర్తిగా తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనవి” అని వంతారా తోసిపుచ్చింది.

– Shinjinee Majumder & Pratik sinha

Source : Alt News

అనువాదం – క్రాంతి టేకుల

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad