Menu

నా పేరు మహమూద్ ఖలీల్, నేనొక రాజకీయ ఖైదీని

anadmin 4 months ago 0 59

(జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన ఈ లేఖను తెలుగులోకి అనువాదం చేసి‍ంది వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్)

పాలస్తీనా అనుకూల విద్యార్థి ఉద్యమకారులపై దాడులలో భాగంగానే తనను నిర్బంధించారని లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరం నుంచి ఫోన్ ద్వారా వివరించారు మహమూద్ ఖలీల్

నా పేరు మహమూద్ ఖలీల్. నేనొక రాజకీయ ఖైదీని. లూసియానా లోని అమెరికా ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసిఇ) విభాగపు నిర్బంధ శిబిరం నుంచి నేను మీకీ లేఖ రాస్తున్నాను. ఎటువంటి చట్ట పరిరక్షణలు, హక్కులు లేని అనేకానేక మంది మీద జరుగుతున్న నిశ్శబ్ద అన్యాయాలకు సాక్షిగా నేనిక్కడ ప్రతి రోజూ చల్లని వేకువల్లో మేల్కొంటున్నాను. సుదీర్ఘమైన పగళ్లు గడుపుతున్నాను.

అసలు హక్కులు ఉండే హక్కు ఎవరికి ఉంది? ఇక్కడ కిక్కిరిసిన చీకటికొట్లలోకి తోయబడిన మానవులకు కచ్చితంగా ఆ హక్కు లేదు. నేనిక్కడ కలిసిన ఒక సెనెగల్ యువకుడికి ఆ హక్కు లేదు. ఏడాదిగా తన స్వేచ్ఛను కోల్పోయి, తన చట్టబద్ధమైన స్థితి ఏమిటో తెలియక, ఎక్కడో సముద్రాలకవతల తన కుటుంబం ఆందోళన పడుతుండగా ఆ యువకుడు ఏడాదిగా తన స్వేచ్ఛను కోల్పోయి బతుకుతున్నాడు. నేను కలిసిన మరొక 21 సంవత్సరాల యువ నిర్బంధితుడికి కూడా ఆ హక్కు లేదు. ఆ యువకుడు తన తొమ్మిదో ఏట ఈ దేశంలో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఎటువంటి విచారణా లేకుండా దేశం నుంచి తరిమేయబడుతున్నాడు.

న్యాయం అనేదేమైనా ఉంటే అది దేశాల ఇమ్మిగ్రేషన్ కార్యాలయాల సరిహద్దుల అవతలే నిలిచిపోతుంది.

మార్చ్ 8న డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ (డి ఎచ్ ఎస్) అధికారులు నన్ను నిర్బంధించారు. నన్ను ఏ వారంట్ మీద నిర్బంధిస్తున్నారో చూపమంటే చూపడానికి నిరాకరించారు. నేనూ నా భార్యా రాత్రి భోజనం చేసి వస్తుండగా వాళ్లు అడ్డుకున్నారు. ఆ రాత్రి ఏమి జరిగిందో ఫుటేజి ఇప్పటికే అందరూ చూసి ఉంటారు. అసలు ఏమి జరుగుతున్నదో నేను గుర్తించే లోపే, ఆ అధికారులు నా చేతులకు సంకెళ్లు వేసి, నన్ను ఒక గుర్తు తెలియని కారు లోకి తోశారు. ఆ క్షణాన నా మనసులో మెదిలిన ఏకైక ఆలోచన నా భార్య నూర్ క్షేమం గురించి మాత్రమే. తనను కూడా నిర్బంధంలోకి తీసుకుంటున్నారా నాకు తెలియదు. నన్ను వదిలి వెళ్లకపోతే తనను కూడా అరెస్టు చేస్తామని ఆ అధికారులు ఆమెను బెదిరించడం విన్నాను. ఆ తర్వాత కొన్ని గంటల వరకూ డి ఎచ్ ఎస్ అధికారులు నాకు ఏమీ చెప్పలేదు. నన్ను ఎందుకు అరెస్టు చేశారో తెలియదు. నన్ను వెంటనే మా దేశానికి పంపించేస్తున్నారా తెలియదు. నేను 26 ఫెడరల్ ప్లాజా కార్యాలయంలో చల్లటి కటిక నేల మీదనే పడుకోవలసి వచ్చింది. మర్నాడు వేకువ జామున అధికారులు నన్ను న్యూజెర్సీ లోని ఎలిజబెత్ లో మరొక చోటికి తరలించారు. అక్కడ కూడా నేను నేల మీదనే పడుకోవలసి వచ్చింది. ఎంత అడిగినప్పటికీ వారు నాకొక దుప్పటి కూడా ఇవ్వలేదు.

నా అరెస్టు నేను నా భావ ప్రకటనా స్వేచ్ఛను వాడుకున్నందుకు ప్రత్యక్ష పర్యవసానం అయి ఉంటుంది. ఎందుకంటే నేను స్వతంత్ర పాలస్తీనా కోసం, గాజాలో జన హననం ఆగిపోవడం కోసం నా గళమెత్తాను. గాజాలో ఏ మారణహోమం ఆగిపోవాలని నేను కోరానో అది సోమవారం నాడు మరింత పెద్ద ఎత్తున జరిగింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు భగ్నమైపోయింది గనుక ఇక గాజాలో తల్లిదండ్రులు పీలికలుగా మారిన తమ చిన్నారుల దుస్తులనే ఊయలలూపుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు బాంబు దాడులకూ ఆకలికీ నిర్వాసితత్వానికీ మధ్య ఊగిసలాడవలసి వస్తున్నది. వాళ్ల సంపూర్ణ స్వేచ్చ కోసం జరుగుతున్న పోరాటంలో కొనసాగడమే మన నైతిక కర్తవ్యం.

నేను సిరియాలో ఒక పాలస్తీనా శరణార్థి శిబిరంలో పుట్టాను. నా కుటుంబం 1948 నక్బాలో తమ స్వస్థలం నుంచి నిర్వాసితులై సిరియా చేరారు. నా యవ్వనమంతా నా మాతృభూమికి సమీపంలోనే, కాని సుదూరంగా సాగింది. మరి పాలస్తీనీయుడిగా ఉండడమంటే సరిహద్దులను అధిగమించిన అనుభవం.

ఇవాళ నేనున్న పరిస్థితికీ ఇజ్రాయెల్ ప్రయోగించే పాలనాపరమైన నిర్బంధం అనేదానికీ దగ్గరి పోలికలున్నాయి. పాలస్తీనీయులకు హక్కులు లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ వారిని విచారణ లేకుండా, ఆరోపణ లేకుండా జైలులో నిర్బంధించిపెడుతుంది. ఈ మాట రాస్తుంటే నాకు నా మిత్రుడు ఒమర్ ఖాతిబ్ గుర్తొస్తున్నాడు. ఆయన దూర ప్రయాణం నుంచి ఇల్లు చేరగానే నిర్బంధించారు. ఏ విచారణా లేదు, ఆరోపణా లేదు. అలాగే గాజా ఆస్పత్రి డైరెక్టర్, శిశు వైద్యుడు డా. హుసామ్ అబు సఫియా గుర్తొస్తున్నాడు. ఇజ్రాయెల్ సైన్యం ఆయనను డిసెంబర్ 27న నిర్బంధించింది. ఇవాళ్టికీ ఇజ్రాయెలీ చిత్రహింసల శిబిరంలో మగ్గిపోతున్నాడు. ఎటువంటి విచారణ లేకుండా జైలు నిర్బంధంలో గడపడం పాలస్తీనియన్లకు సర్వసాధారణం.

నా బాధ్యత నన్ను నేను పీడకుడి నుంచి విముక్తి చేసుకోవడం మాత్రమే కాదనీ, పీడకులను కూడా వారి ద్వేషం నుంచీ, భయం నుంచీ విముక్తి చేయడమనీ నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. నా అక్రమ నిర్బంధం అమెరికాలో గత పదహారు నెలలుగా సాగుతున్న బైడెన్, ట్రంప్ పాలనల పాలస్తీనా వ్యతిరేక జాతి వివక్ష విధానానికి నిదర్శనం. ఆ ఇద్దరి పాలనలలోనూ పాలస్తీనీయులను చంపడానికి ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా చేశారు. అంతర్జాతీయ జోక్యాన్ని అడ్డుకున్నారు. దశాబ్దాలుగా అమెరికాలో అమలవుతున్న పాలస్తీనా వ్యతిరేక జాతి వివక్షా ధోరణి వల్ల పాలస్తీనీయులను, అరబ్ అమెరికన్లను, ఇతర సమూహాలను హింసాత్మకంగా అణచివేయడానికి అమెరికన్ చట్టాలను, పద్ధతులను విస్తరించడం జరిగింది. కచ్చితంగా ఆ కారణం వల్లనే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.

ఒకవైపు నా భార్యా బిడ్డల భవిష్యత్తు గాలిలో తేలియాడుతుండగా, నేను నా పట్ల ఎటువంటి చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటారో అని వేచి చూస్తున్నాను. మరొకవైపు నన్ను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడానికి మార్గం సుగమం చేసినవారు కొలంబియా విశ్వవిద్యాలయంలో సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారు. పాలస్తీనా అనుకూల విద్యార్థుల మీద నిరంకుశ ఆంక్షలు విధించడం ద్వారా, వారికి వ్యతిరేకంగా జాతి వివక్షా భావనలతో, అబద్ధాలతో సాగుతున్న విష విద్వేష ప్రచారాలను అడ్డుకోకుండా అనుమతించడం ద్వారా విశ్వవిద్యాలయ అధ్యక్షులు షఫిక్, ఆర్మ్ స్ట్రాంగ్, డీన్ యార్హి మీలో అమెరికన్ ప్రభుత్వం నా మీద గురి పెట్టడానికి తగిన పునాది ఏర్పాటు చేసి పెట్టారు.

కొలంబియా విశ్వవిద్యాలయం నా మీద గురి పెట్టడానికి కారణం నా సామాజిక కార్యకర్తృత్వమే. ఇజ్రాయెల్ ను విమర్శించే విద్యార్థుల నోళ్లు మూయించేందుకు క్రమబద్ధమైన విచారణా ప్రక్రియను తప్పించి, ఒక కొత్త నిరంకుశ క్రమశిక్షణా కార్యాలయాన్ని తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లొంగిన కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పూర్తి సమాచారాన్ని కాంగ్రెస్ కు తెలియజేసింది. ట్రంప్ ప్రభుత్వపు తాజా బెదిరింపులకు లొంగిపోతున్నది. నా అరెస్టు, కనీసం 22 మంది కొలంబియా విద్యార్థుల బహిష్కరణ లేదా తొలగింపు, పట్టభద్రులు కావడానికి కొన్ని వారాల ముండే కొందరి బి ఎ డిగ్రీలు తొలగించడం, కాంట్రాక్టు పునరుద్ధరణ చర్చలు జరగబోతుండగా స్టూడెంట్స్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గ్రాన్ మైనర్ బహిష్కరణ, కొలంబియా కక్ష సాధింపుకు స్పష్టమైన ఉదాహరణలు.

ఈ మొత్తం వ్యవహారంలో తేలినదేమంటే, ప్రజాభిప్రాయాన్ని పాలస్తీనా విముక్తి వైపు తిప్పడంలో విద్యార్థి ఉద్యమ శక్తికి నా నిర్బంధమే ఒక నిదర్శనం. విద్యార్థులు అన్ని సందర్భాల్లోనూ పరివర్తనకు ముందు పీటీన ఉన్నారు. అది వియత్నాం యుద్ధానికి వ్యతిరేక పోరాటం కావచ్చు, పౌరహక్కుల, నల్లజాతి హక్కుల ఉద్యమం కావచ్చు, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష రాజ్యానికి వ్యతిరేక పోరాటం కావచ్చు – ఎప్పుడూ విద్యార్థులే అగ్రభాగాన నిలిచారు. ఇవాళ కూడా సత్యం వైపు, న్యాయం వైపు పోరాటంలో మనను ముందుకు నడిపిస్తున్నది విద్యార్థులే. అశేష జన బాహుళ్యం ఇంకా దీన్ని గుర్తించకపోయినా సరే.

అసమ్మతిని అణచివేసే విశాల వ్యూహంలో భాగంగానే ట్రంప్ ప్రభుత్వం నా మీద గురిపెడుతున్నది. వీసా పొందిన వాళ్లు, గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్లు, పౌరులు – ఎవరైనా సరే, అందరినీ వాళ్ల రాజకీయ విశ్వాసాల వల్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. రానున్న వారాల్లో విద్యార్థులు, న్యాయవాదులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పాలస్తీనా కోసం నిరసనలు తెలిపే తమ హక్కు నిలబెట్టుకోవడానికి ఐక్యంగా పోరాడవలసి ఉన్నది. ఇవాళ బలి కానున్నవి, మా గొంతులు మాత్రమే కాదు, మొత్తంగా ప్రజలందరి ప్రాథమిక హక్కులు ఇవాళ బలిపీఠం మీద ఉన్నాయి.

ఇవాళ నేనున్న పరిస్థితులను ఈ క్షణం అధిగమిస్తుందనే సంపూర్ణమైన ఎరుక తోనే నేను నా మొట్టమొదటి బిడ్డ జన్మించేనాటికి స్వేచ్ఛగా ఉండాలని ఆశిస్తున్నాను.

(సిరియాలోని డమాస్కస్ లో ఒక పాలస్తీనా శరణార్థి కుటుంబంలో 1995లో జన్మించిన మహమూద్ ఖలీల్, సిరియన్ అంతర్యుద్ధ సమయంలో 2012లో కుటుంబంతో సహా లెబనాన్ కు శరణార్థులుగా వెళ్లారు. అలా రెండుసార్లు శరణార్థిగా ఉండిన మహమూద్ బీరుట్ లోని లేబనీస్ అమెరికన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి, 2022లో స్టూడెంట్ వీసా మీద అమెరికా చేరారు. ఆయన మాస్టర్స్ కోర్సు పూర్తయి 2025 మేలో పట్టా పొండనున్నారు. అమెరికన్ పౌరురాలు, దంత వైద్యురాలు నూర్ అబ్డల్లాను 2023లో పెళ్లి చేసుకుని, 2024లో అమెరికన్ పౌరసత్వపు గ్రీన్ కార్డ్ పొందారు. అయినప్పటికీ, 2024 కొలంబియా యూనివర్సిటీ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలకు నాయకత్వం వహించారనే కక్షతో, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం రాగానే ఆయనను అరెస్టు చేశారు. ఇలా వందలాది మంది విద్యార్థుల మీద వేధింపులు జరుపుతున్నారు.)

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad