Menu

ఇవ్వాళ్ళ మనం ఈ భగత్ సింగ్ లతో నిలబడగలమా?

anadmin 4 months ago 0 243

మొదటి విషయం, భగత్‌సింగ్‌ భావించినట్లు, బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశపు మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండింది. అత్యధికులకి మాత్రమే, అందరికీ అని కాదు. భారతీయుల్లో ఒక పెద్ద వర్గం బ్రిటిష్ పాలన కింద ప్రయోజనం పొందింది. వారి పక్షాన నిలిచింది. ఇందులో రాజులు, జమీందార్లు, నవాబులు, నిరంకుశ అధికారవర్గం(బ్యురోక్రసీ), న్యాయమూర్తులు, పోలీసులు, సైనికులు ఉన్నారు. బ్రిటిష్ నిరంకుశ అధికారవర్గంలో, న్యాయవ్యవస్థలో చాలా మంది భారతీయులే ఉండేవారు. సైన్యంలో కూడా ఎక్కువ మంది భారతీయులే ఉండేవారు. భారతీయులతోనే పోలీసు వ్యవస్థ ఏర్పడింది.

రెండవ విషయం, భగత్‌సింగ్, అతని సహచరులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నారు. సత్యాగ్రహం లేదా సహాయనిరాకరణ ఉద్యమం ద్వారా కాదు, ఆయుధాల ద్వారా. అవసరమైతే, కనీసం ప్రతీకగా అయినా బ్రిటిష్ అధికార ప్రతినిధులను హత్య చేయడం ద్వారా కూడా. ఇది కేవలం భగత్‌సింగ్‌మాత్రమే కాదు, అతనికి ముందు, తరువాత కూడా మరెందరో చేశారు. ఉధమ్‌సింగ్ లాంటివారు బ్రిటన్‌కు వెళ్లి క్రూరులైన అధికారులను హతమార్చారు. గాంధీ, కాంగ్రెస్‌ల మార్గం సరిపోదని వారు భావించారు.

భగత్ సింగ్, అతని సహచరులు బ్రిటిష్ పాలనకు ఆయుధాలతో సవాల్ విసిరారు. క్రూరులైన అధికారులను హత్య చేయడం లేదా హత్య చేయడానికి ప్రయత్నించడం జరిగింది. దాని ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వారికి మరణశిక్ష విధించింది; ఆ శిక్షను వారు స్వచ్ఛందంగా స్వీకరించారు. మనలో చాలామందిమి అందువల్ల కూడా భగత్‌సింగ్‌ను జ్ఞాపకం చేసుకుంటాం; అతని సాహసాన్ని, ధీరత్వాన్ని మెచ్చుకుంటాం.

భగత్‌సింగ్‌తోనే ఈ వారసత్వం ముగిసిపోలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం చేసింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951) దీనికి ఉదాహరణ. ఇందులో వందల సంఖ్యలో కాదు వేలాదిమంది రైతాంగాన్ని, రైతు కూలీలను, యువతను చంపేసారు. అత్యధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు; హత్యలకు, లైంగిక అత్యాచారాలకు, అన్ని రకాల పీడనకు గురయ్యారు.

తిరిగి 1967లో నక్సల్బరీ ఉద్యమం జరిగింది. వేలాది ఆదివాసులు, రైతాంగం, యువత భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు; అనేకమంది మరణించారు. ఈ ఉద్యమాన్ని వివరించిన మహాశ్వేతాదేవి రాసిన ‘హజార్ చౌరాస్సీకి మా’ అనే నవల జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ తర్వాత బీహార్‌లోని భోజ్‌పూర్, సహార్ ప్రాంతాల్లో 1970వ దశకంలో మరో సాయుధ విప్లవ పోరాటం జరిగింది.

ఇప్పటికీ దేశంలో భారత రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పలుచోట్ల సాయుధ పోరాటాలు, ప్రత్యేకించి ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఛత్తీస్‌ఘడ్ కూడా ఉన్నది. వీరిని భారత రాజ్యం ‘మావోయిస్టులు’ అని అంటోంది.

గతంలో, భారత ప్రభుత్వం వీరిని ‘కమ్యూనిస్టులు’ అనేది. ఈ పేరుతోనే తెలంగాణలో పెద్ద ఎత్తున చంపేసింది. అప్పుడు ఆ ‘కమ్యూనిస్టు నాయకులు’ భారత ప్రభుత్వ చట్టాలను అంగీకరించి, సాయుధ పోరాటాన్ని విరమించారు.

ప్రజా యుద్ధం లేదా సాయుధపోరాటం ద్వారా ప్రభుత్వాన్ని సవాలు చేసిన వారిని ప్రభుత్వం ‘నక్సలైట్లు’ అన్నది. మళ్ళీ నక్సలైట్ల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఎంపిక చేసి మరీ హత్యలు చేశారు. ఆ నక్సలైట్లలో పెద్ద భాగం మేం ఇదంతా వదిలేస్తాం అన్నారు.

మళ్ళీ కొంతమంది ముందుకు వచ్చారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ప్రజాయుద్ధం చేస్తున్నారని, వారిని మావోయిస్టులు అని అంటున్నారు. “మహానుభావుడు, దయామయుడు” అని పిలిచే ఆనాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వారిని అంతర్గత భద్రతకు అతిపెద్ద ప్రమాదం అన్నాడు. నేటి ప్రజాస్వామిక, ప్రజాహిత గొప్ప న్యాయవాది చిదంబరం, వారిని నిర్మూలించడానికి ఒక క్రూరమైన ప్రణాళికను రూపొందించాడు.

వాస్తవానికి మావోయిస్టులా కాదా అనే సందేహం ఉన్న దాదాపు 100 మందిని 2025 మార్చి నాటికి చంపామని, 2026 మార్చి 31 నాటికి ఇలాగే మావోయిస్టులందరినీ అంతం చేస్తామని కేంద్ర గృహమంత్రి అమిత్ షా ప్రకటించాడు. నరేంద్ర మోదీ ప్రభుత్వమూ అతని గృహమంత్రీ దీనిని తమ అతిపెద్ద విజయాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఎందుకు భావించరు? వారి గురువు గోల్వల్కర్ నిర్మూలించడానికి మూడు ప్రధాన శత్రువులను గుర్తించాడు – కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు.

మావోయిస్టుల పేరిట భారత ప్రభుత్వం ఎవరిని చంపినా, జైలుకు పంపినా, వారిని భగత్‌సింగ్‌వారసులుగా నేను భావిస్తాను. భగత్‌సింగ్‌ అమరత్వంలాగే వారి మరణం నన్ను ఎంత బాధపెడుతుందో అంతగా ఆగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. ఆదివాసీలుగా తమ ప్రయోజనాల కోసం పోరాడుతున్నవారు లేదా ఆదివాసీల ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఆదివాసేతరులు, ఎవరైనప్పటికీ వారి పోరాటానికి, వారి అమరత్వానికి నేను సలాం చేస్తున్నాను.

వారి పోరాట రూపం ఏదైనా సరే అది భగత్‌సింగ్‌ పోరాట రూపం.

వీరు ఎవరు, ఏమి చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరి కోసం చేస్తారు, ఎలా చేస్తారు, ఎలాంటి వ్యక్తులు అనే విషయాలను మన కాలంలోని గొప్ప సాహసోపేత రచయిత్రి అరుంధతి రాయ్ వారి మధ్యకు వెళ్ళి, వారితో ఉండి తన పుస్తకం ‘వాకింగ్ విత్ ది కామ్రేడ్స్’ లో విపులంగా వివరించే ధైర్యం చేసారు.

అలాంటివారిని భగత్‌సింగ్‌ సంప్రదాయ వారసులుగా నేను భావిస్తాను. వారు తెల్ల బ్రిటిష్ వారి స్థానంలో నేటి భారత పాలకవర్గ నల్ల బ్రిటీష్ వారిని చూస్తారు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సిపిఐ; నక్సల్బరీ కాలంలో సిపిఐ (ఎంఎల్); భోజ్‌పూర్-సహార్ ఉద్యమ సమయంలో సిపిఐ (ఎంఎల్-లిబరేషన్) చూసినట్లుగా ఇర్విన్ స్థానంలో తేజ్ బహదూర్, పురుషోత్తమ్ లేదా ఠాకూర్ దాస్ రావడం వల్ల, ఆదివాసుల నీటిని, అడవిని, భూమిని కబ్జా చేసుకునేవారి రూపంలో ఏమీ తేడా ఉండదు అన్నారు.

మనలో చాలా మందికి మనకు తెలియకుండానే ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి; వాటి సారాంశం ఏమిటంటే, నేను భగత్‌సింగ్‌ ఆలోచనలు, పద్ధతులతో ఉన్నాను; భగత్‌సింగ్‌ రష్యాలో విప్లవం జరిగినట్లుగా భారతదేశంలో విప్లవం గురించి కలలు కన్నాడు; నా కల కూడా అదే. కానీ నేను తెలంగాణకు చెందిన వేలాదిమంది భగత్ సింగ్‌లతో లేను. నేను తెలంగాణకు చెందిన భగత్ సింగ్‌లతో ఉన్నాను కానీ నక్సల్బరికి చెందిన వేలాదిమంది భగత్ సింగ్‌లతో లేను; నేను నక్సల్బరీ చెందిన భగత్ సింగ్‌లతో ఉన్నాను కానీ భోజ్‌పూర్, సహార్‌కు చెందిన వందలాదిమంది భగత్ సింగ్‌లతో లేను;

నేను భోజ్‌పూర్, సహార్‌కు చెందిన భగత్ సింగ్‌లతో ఉన్నాను, వారిని అంగీకరిస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వేలాది మంది భగత్ సింగ్‌లతో లేను.

భగత్‌సింగ్‌కాలంలో భగత్‌సింగ్‌తో నిలబడటం చాలా మందికి కష్టమే కాదు, అసాధ్యం కూడా. అదేవిధంగా నాటి తెలంగాణ, నక్సల్బరి, భోజ్‌పూర్ – నేటి భగత్ సింగ్‌లతో నిలబడటం చాలా మందికి కష్టమే కాదు, అసాధ్యం కూడా. వారిలో నేనూ ఒకడిని.

ఆ కాలంలో మీరు భగత్‌సింగ్‌తో ఎందుకు నిలబడలేదని, భగత్‌సింగ్‌ తరఫున ఎందుకు వాదించలేదని, ఎందుకు మాట్లాడలేదని, ఎందుకు రాయలేదు అని ప్రశ్నించడంలో అర్ధం లేదు. మన లాగానే వారూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

నిజమే, భగత్‌సింగ్‌ కాలంలో భగత్‌సింగ్‌తో నిలబడటానికి ఉన్న ఇబ్బందులు, కొన్ని విషయాలలో అంతకన్నా ఎక్కువ, మన కాలపు లేదా నేటి భగత్‌సింగ్‌లాంటి వారితో నిలబడటానికి ఉన్నాయి. మనం ఈ ఇబ్బందులను ఎదుర్కోలేము. అయినా మన కాలపు భగత్‌సింగ్‌లాంటి వారిని ‘ఉగ్రవాదులు’ ‘తీవ్రవాదులు’ లేదా ‘వామపక్ష కమ్యూనిజం’ ‘బాల్యారిష్ట’ బాధితులు అని అనేస్తాం.

గతకాలపు విప్లవకారులకు లేదా నవలలలోని పావెల్ (గోర్కీ అమ్మలో హీరో), భగత్‌సింగ్‌ లేదా చెగువేరా వంటి వ్యక్తులకు జైజైకారాలు కొట్టడం, లేదా విప్లవం వర్ధిల్లాలి అని అనడం లేదా అమరత్వానికి సలాం చేయడం చాలా సులభం; ఎందుకంటే అలా చేస్తుంటే మనమే విప్లవకారులం అనే భావన; మహాత్ములం అనే భావన; సజీవంగా ఉన్నామనే భావన కలుగుతుంది. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు మనలో చాలా మందిమి మన కాలం నాటి భగత్‌సింగ్‌ లేదా వారి వారసుల వైపు నుంచి మొహం తిప్పేసుకుంటాం. ఎందుకంటే వారితోబాటు నిలబడడం ఎంతో ప్రమాదకరం. అందుకని ఒకసారి పంథా, మరొకసారి ఎత్తుగడలు, ఇంకొకసారి నేటి అవసరం లాంటి పదాల పరదాలను మన ముందు వేళ్ళాడదీసుకుంటాం. ఈ పరదాలు సత్యాన్ని ఎదుర్కోవడం నుంచి మనని కాపాడతాయి.

-డాక్టర్ సిద్ధార్థ్ రచయిత, జర్నలిస్టు

(janchowk.com కోసం డాక్టర్ సిద్దార్థ్ రాసిన ఈ వ్యాసాన్ని తెలుగు నౌవాదం చేసింది పద్మకొండిపర్తి)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad