(అంకిత డెహ్రాడూన్ లో బీజేపీ నాయకుని దగ్గర బంధువు నడిపే హోటల్ లో పని చేస్తూ హత్యకు గురైన యువతి. అంకిత మరణం మీద సీబీఐ విచారణ జరగాలని వేసిన పిటిషన్ స్వీకరణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంపై సుప్రీం కోర్టు అడ్వకేట్ కోలిన్ గోన్సాల్వెస్ రాసిన బహిరంగ లేఖ)
నన్ను క్షమించు అంకితా!
నన్ను క్షమించు అంకితా! నీ హత్య గురించి సుప్రీం కోర్టులో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ తిరస్కరణకు గురి అయినందుకు మమ్మల్ని క్షమించు. ఇప్పటికీ ప్రధాన దోషిని పట్టుకోలేనందుకు క్షమించు. అశుతోష్ మీకు కూడా క్షమాపణలు. మీరు భయంలేని జర్నలిస్టు. ఈ కేసులో పిటిషన్ వేసింది మీరే. ఈ కేసును పరిశోధించినందుకు మీరు బలిపశువు అయ్యారు. మీ మీద ఎఫ్ఫయ్యార్ లు దాఖలు అయ్యాయి. మీ సహచరిని బదిలీ చేసి మిమ్మల్ని రెండోసారి బాధితుడిని చేశారు. సోనీ దేవి! మీ ప్రియ పుత్రిక మరణానికి మమ్మల్ని మన్నించండి. ఒక వీఐపీ అంకిత నుండి ‘ప్రత్యేక సేవలను శాసించి, ఆమె మరణానికి కారకుడు అయ్యాడు. ఆమె తిరస్కరణే తన హత్యకు దారి తీసింది.
రాజకీయ నాయకుల ముందు మన పోలీసులు వెన్నెముక లేకుండా ఉండి, ఎలాంటి నేరాన్ని అయినా బయటకు రాకుండా చేస్తారు. అంకితకు, ఆమె స్నేహితుడు పుష్పదీప్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణకు ఉత్తరఖండ్ పోలీసులు ఛార్జ్ షీట్ లో చోటు ఇవ్వక పోవటం మొదటి విషయం. ఆ సంభాషణలో అంకిత ఒక విఐపీ తన హోటల్ కు వచ్చి, తనను ప్రత్యేక సేవలు అందించమని శాసిస్తున్నాడని పుష్పదీప్ కు చెప్పింది. ఆమె తన స్నేహితుడిని తక్షణమే వచ్చి, తనను తీసికెళ్లిపొమ్మని ఆ సంభాషణలో పదే పదే కోరింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర పుష్పదీప్ కూ, ఆ విఐపీ సహచరుడికి మధ్య జరిగిన పరిచయం గురించి ఛార్జ్ షీట్ లో పేర్కొనక పోవటం రెండో విషయం. పోలీసులు చూపించిన ఫోటో ద్వారా పుష్పదీప్ ఆ సహచరుడిని గుర్తు పట్టినా కూడా ఆ విషయాన్ని పేర్కొనలేదు. ఆ సహచరుడు తన బాగ్ లో డబ్బునీ, ఆయుధాలను పట్టుకొని తిరిగినా -అతన్ని నిందితుడిగా పేర్కొనటం కానీ, ప్రశ్నించటం కానీ చేయకపోవటం మూడో విషయం. అంకితను బలవంతంగా తీసుకెళ్లి, హత్య చేసే ముందర ఆమె తన రూంలో ఏడుస్తుందని హోటల్ మేనేజర్ అభినవ్ ఇచ్చిన స్టేట్మెంటును ఛార్జ్ షీట్ లో పేర్కొనక పోవటం నాలుగవ విషయం. అంకిత ఉన్న గది గురించి వచ్చిన శ్రీనగర్ లాబొరేటరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ను ఛార్జ్ షీట్ కు జతపరచక పోవటం ఐదో విషయం. ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్లే ఆదేశాలతో క్రైమ్ సీన్ అయిన ఆ గదిని వెనువెంటనే బుల్ డోజర్ చేత నేలమట్టం చేయటం ఆరో విషయం. విఐపీతో మాట్లాడుతున్న హోటల్ ఉద్యోగి ఫోన్ ను స్వాధీనమే చేసుకోకపోవటం ఏడవ సంగతి. కెమెరాలు పని చేయటం లేదనే సౌకర్యవంతమైన నెపంతో -ఆ విఐపీ గుర్తింపును, ఆయన రాకపోకలను స్పష్టంగా బహిరంగపరిచే హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ను సాక్ష్యంగా చూపించక పోవటం ఎనిమిదవ విషయం. మరణానికి ముందు అంకిత పరధ్యానంగా వుందని ఖరాఖండిగా చెప్పిన సాక్షులను అసలు విచారించక పోవటం తొమ్మిదవ విషయం. కాల్ రికార్డులను పరిశీలించామని, అందులో ఏమీ లేదని ఉత్తరాఖండ్ పోలీసులు ఇచ్చిన ప్రకటన తప్పుదారి పట్టించేదిగా వుంది. ఎందుకంటే సంభాషణలను చనిపోయిన అంకిత ఫోన్ నుండే తీసుకొన్నారు. హోటల్ ఉద్యోగులవి తీసుకోలేదు. ఇది పదో విషయం.
చివరిగా, నిందితుల్లో ఒకరి బైక్ వెనకాల కూర్చొని అంకిత వెళుతున్న వీడియోని ప్రాసిక్యూషన్ తప్పుగా పేర్కొన్నది. హత్య జరిగి, ఆమె శవాన్ని కాలవలో పడేసే ముందు ఆమెలోఎలాంటి బాధా సంకేతాలు లేవనీ సూచించటానికి ఈ వీడియోని ప్రాసిక్యూషన్ వాడుకొన్నది. కానీ, పుష్పదీప్ కోర్టులో ఇచ్చిన సాక్ష్యంలో -అంకిత తనకు ఫోన్ చేసి, తన చుట్టూ చాలమంది వుండటం వలన భయంగా వుందనీ, తను మాట్లాడలేననీ చెప్పిందని చెప్పాడు.
ఆరోపణకు గురి అయిన హోటల్ ఉద్యోగి తనపై నార్కో పరీక్ష జరపమని ట్రయిల్ కోర్టును కోరటం తాజా పరిణామం. జరిగిన సంఘటన గురించి తన ఒప్పుకోలు ప్రకటించటానికి ఆయన సిద్ధంగా వున్నాడని ఈ పరిణామం సూచిస్తుంది. అయితే ఆ పిటిషన్ ను ట్రయిల్ కోర్టు తిరస్కరించింది. ఆరోపణకు గురి అయిన వాళ్లు తమంతట తాము ఇవ్వదల్చిన ఆ సాక్ష్యం విఐపీ గుర్తింపును, అతని పాత్రను బహిరంగ పరిచి వుండేది.
విఐపీ గుర్తింపును పోలీసులు దాచి పెట్టారు. సిబిఐ విచారణను చేపట్టి, అవసరమైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ తెర తొలగుతుంది. అతను పై స్థాయి రాజకీయ కార్యకర్త అనీ, అతను ఆ హోటల్ కు తన మంది మార్బలంతో రాకపోకలు సాగిస్తాడనీ -అంకిత వాళ్ల అమ్మ అధికారుల దగ్గర ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ ఉద్యోగుల ఫోనులు తీసుకోవటం లాంటి ప్రాథమిక ప్రయత్నాలు ప్రధాన నిందితుడి గుర్తింపును బయట పెట్టేవి.
అంకితా మమ్మల్ని క్షమించు. ఇది భారత దేశం. ఇక్కడ సామాన్య మహిళల జీవితాలు లెక్కలోకి రావు. బడా బాబులు మళ్లీ మళ్లీ తప్పించుకుంటారు.
కోలిన్ గోన్సాల్వెస్
సీనియర్ అడ్వకేట్
సుప్రీం కోర్టు
(అనువాదం: రమాసుందరి)
(రమాసుందరి ఫేస్ బుక్ పోస్ట్)