సీనియర్ మావోయిస్టు నాయకుడు బల్మూరి నారాయణరావు ఎలియాస్ ప్రభాకర్ ను ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. నారాయణ రావు స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీర్పూర్.
57 ఏళ్ళ వయసున్న నారాయణ రావు 1984లో పీపుల్స్ వార్ పార్టీలో చేరి 40 ఏళ్ళుగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నార్త్ సబ్-జోనల్ బ్యూరోలో లాజిస్టిక్ సప్లై మరియు మొబైల్ పొలిటికల్ స్కూల్ (MOPOS) టీమ్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
“ఛత్తీస్‌గఢ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ప్రభాకర్ పై డజన్ల కొద్దీ కేసులున్నాయని, ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలకు ఆయన సన్నిహితుడని, సెంట్రల్ కమిటీ మెంబర్ (సిసిఎం) గణపతికి దగ్గరి బంధువని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
ప్రభాకర్ రావు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా, ఉత్తర బస్తర్, కోయిలీబెడ, ఛత్తీస్‌గఢ్‌లోని మన్పూర్-మొహ్లా ప్రాంతాల్లో చురుకుగా పనిచేశారని, అతను 2005 నుండి 2007 వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సప్లై టీమ్, అర్బన్ నెట్‌వర్క్‌లో పనిచేశాడని పోలీసులు చెప్పారు.
“గత కొన్ని రోజులుగా, మావోయిస్టు సంస్థకు చెందిన నార్త్ బస్తర్ సబ్ జోనల్ బ్యూరో సీనియర్ కేడర్ ప్రభాకర్ రావు కార్యకలాపాల గురించి కంకేర్ జిల్లా పోలీసులకు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆదివారం అంతగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభాకర్ రావును చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఆయనను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు’’ అని ఓ ఐపీఎస్ అధికారి తెలిపారు.