మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో వైపు ఈవీఎమ్ ల మాయ వల్లనే బీజేపీ కూటమి గెలిచిందని శివసేన నేత సంజయ్ రౌత్ తో సహా పలువురు మహా వికాస్ అఘాడీ నేతలు ఆరోపణలు చేశారు.
కొంత కాలంగా మన దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వారు ఎన్నికలు జరుగుతున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్ల కన్నా పలు చోట్ల ఎక్కువ ఓట్లు మరి కొన్ని చోట్ల తక్కువ ఓట్లను లెక్కించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆరోపణలు చేసింది. ఆరోపణలు మాత్రమే కాదు పలు మీడియా సంస్థలు, ప్రజా సంస్థలు రుజువులతో సహా నిరూపించారు కూడా ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య 5 లక్షలకు పైగా తేడా ఉందని ప్రముఖ మీడియా సంస్థ ది. వైర్ బహిర్గతం చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో తుది ఓటింగ్ శాతం 66.05.
మొత్తం పోలైన ఓట్లు 64,088,195.ఇందులో 30,649,318 స్త్రీలు, 33,437,057 పురుషులు ఉన్నారు. అలాగే ఇతరులు 1820 ఉన్నారు.
కాగా, లెక్కించిన ఓట్లు మాత్రం 64,592,508. పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇది 5,04,313 ఓట్లు ఎక్కువ.
పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 5 లక్షలకు పైగా ఉన్నాయి.
మరోవైపు రాష్ట్రంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. అలాగే మిగిలిన 280 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు మించి ఓట్లు లెక్కించారు.
కొంత కాలంగా మనదేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య పెద్ద ఎత్తున తేడా ఉన్నప్పటికీ ఎన్నికల్ కమిషన్ ఎటువంటి చర్యలను చేపట్టకపోవడం అనుమానాస్పదంగా అనిపించడంలేదా ?