ఉద్యమాలపై రాజ్య హింసకు వ్యతిరేకంగా ఉద్యమించిన
పురుషోత్తం అమర్ హై
నవంబర్ 23 అమరుడు పురుషోత్తం వర్ధంతి
ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ అణచివేత రెండు రకాలుగా సాగుతుంది. ఒకటి ప్రత్యక్ష రాజ్యహింస, రెండు ప్రైవేటీకరించబడిన హత్యాకాండ. పీపుల్స్ వార్ ఉద్యమం (నేటి మావోయిస్టు) నుంచి సరెండర్ అయి మాజీలుగా ఉన్న వారితో సర్కార్ హంతక ముఠాను తయారు చేసిన ప్రభుత్వం మొదటి హత్యగా పురుషోత్తంను చంపేసింది. వ్యక్తులను హత్యచేసినప్పటికి వారి ఆశయాలను మాయం చేయలేకపోయింది. 12 అక్టోబర్ 2024న వ్యవస్థీకృత హత్యకు సాయిబాబా గురైతే ప్రత్యక్ష హత్యలకు గోపిరాజన్న, జాపా లక్ష్మారెడ్డి, డా॥ రామనాథం, పురుషోత్తం, ఆజాం అలీలు ఉన్నారు. వాళ్ళ ఆశయాల పిడికిలి ఇంకా ఎత్తిపట్టే ఉంది. వారి అమరత్వం బ్రతికి ఉన్నవాళ్ళ ఆచరణను ప్రశ్నిస్తున్నది. అమరత్వం అనేది. ఊరికే రాడు. అణచివేతల మధ్యనుంచి ఆశయాల పునాదిపై జరుగుతున్న దాడుల నుంచి వస్తుంది. ఆశయాలను నిలబెట్టుకోవడానికి ప్రొ. సాయిబాబాదైనా, హక్కులనేత పురుషోత్తం అమరత్వాలసన్నా మనం ఇంకా ఇంకా ప్రేమిస్తూ వారి ఆశయసాధనలో ముందుకెళ్ళగలిగినప్పుడే వారి అమరత్వాలకు ఒక అర్థం ఉంటుంది.
వ్యక్తులుగా పుడతారు, ప్రజల కోసం వీరులుగా మరణిస్తారు. త్యాగాలతో ప్రజల ఉద్యమాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పురుషోత్తం అమరత్వం మనకు సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. జీవించే హక్కులను అణచివేస్తుణ్న ఎనౌకౌంటర్ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి, దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి కూడా కాని అన్ని ప్రభుత్వాలు కూడా పౌరహక్కుల ఉద్యమకారుల్నే హత్య చేస్తున్నాయి తప్ప పాలనను ప్రజాస్వామికంగా కొనసాగించలేక పోతున్నాయి. తమ అప్రజాస్వామిక అణచివేతవిధానాలు ప్రజలకు అర్థం కాకుండా ఉండడం కోసం ప్రశ్నించే గొంతులైన పౌరహక్కుల నేతలు హత్యలకు గురి చేస్తున్నారు అందులో భాగంగానే కాశ్మీర్ కు చెందిన జలీల్ ఆండ్రాబీని సైన్యం హత్య చేసి, జీలం నదిలో వడేసింది. అస్సాం మానవ అధికార్ సంగ్రామ్ సమితికి చెందిన పరాగ కుమార్ దాస్ ఉల్ఫా ఉద్యమం నుంచి సరెండరై సల్ఫాగా కొనసాగుతున్న సాయుధ మిలిటెంట్లచే హత్యగావించబడ్డారు. ఉద్యమాల్లో ఉండే పోరాట తత్వం వీరుల్ని అమరుల్ని ఉన్నతులుగా మారుస్తాయి. ప్రశ్నించే గొంతులంటే ప్రభుత్వాలకు గిట్టదు, ఇంకా పౌర హక్కుల సంఘం ప్రశ్నలంటే మరీ మరీ సహించలేని స్థితిలో అప్రజాస్వామికంగా గోపిరాజన్న మొదలుగా ఆజం అలీ వరకు హత్యలతో హక్కులోద్యమాన్ని నిశ్శబ్ధం చేయాలని అన్ని ప్రభుత్వాలు భావించాయి. కాని హక్కులోద్యమం రాజ్యనిర్బంధానికి,ప్రాణ త్యాగానికే సిద్ధపడింది తప్ప ఉద్యమ కార్యాచరణను ఏనాడూ వదులుకోలేదు. హత్యల తరువాత ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఉద్యమకారుల హత్యలకు ప్రతీకార హత్యలుగా పౌరహక్కుల ప్రజాసంఘాల నేతల హత్యలు జరుగుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కాని అలా కూడా ప్రచారం చేయలేని హత్యే పురుషోత్తంది.
పురుషోత్తం నడిగడ్డ పోరుబిడ్డ పౌరహక్కుల ఉద్యమనేతగా చివరి వరకు ప్రజల హక్కుల కోసం పోరాడాడు. ఇతన్ని 23 నవంబర్ 2000 సంవత్సరవంలో సర్కార్ హంతకముఠా నయీం చేతుల్లో
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో హత్యగావించబడ్డాడు. పురుషోత్తం మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమైనప్పటికి అరెస్టు కాబడ్డ నయీం ముఠాను పత్రికా సమావేశం ఏర్పరచి నేరస్తులు తామేనని ప్రజల ముందు ప్రకటన చేశారు. కానీ న్యాయవ్యవస్థ విఫలత వల్ల నేరస్తులకు శిక్షలు పడలేదు, విడుదల కూడా కాబడ్డారు. చివరికి పోలీస్ అధికారి నేరంలో హంతకుడుగా ఉన్న నయీమే అనేక
హత్యలతో పాటు అనేక భూ ఆక్రమణలు చేసి ప్రజల భయపడే విధంగా ప్రభుత్వాలు నిలబెట్టాయి. చంద్రబాబు, వైఎస్ఆర్, చివరికి కెసిఆర్ కూడా అతనితో అక్రమ లావాదేవీలను హక్కులోద్యమకారుల అణచివేతను కొనసాగించి చివరికి నయీంను కూడా బూటకపు ఎన్ కౌంటర్ పేరుతో హత్యచేసింది. దీన్ని కూడా పౌరహక్కుల సంఘం ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని తన నిజనిర్ధారణలో ప్రకటించింది.
ఇదే నయీం ఇంట్లో కౌంటింగ్ మిషన్లతో ఆరు రోజులు లెక్కించిన డబ్బుల ఊసే లేకుండా పోయింది. అంతేకాకుండా వందలాది భూముల డాక్యుమెంట్ పేపర్ల విషయమే మరుగున పడేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిది.
1973లో బూటకపు ఎన్ కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పౌరహక్కుల సంఘం నేటికి తన ఆచరణను కొనసాగిస్తూ, అఖిల భారత స్థాయిలో ఉద్యమాలపై జరుగుతున్న అణచివేతలను దానిలో భాగంగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్ హత్యాకాండలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికి, గతంలో కెసిఆర్ అయితే మావోయిస్టు ఎజెండా తన ఎజెండాగా ప్రకటించినప్పటికి, నేడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మౌళిక సమస్యలను పరిష్కరించకపోతే నక్సలైట్లు వుడతారని బహిరంగంగా ప్రకటించిన స్థితిలో నేడు కూడా ఎన్ కౌంటర్ హత్యాకాండ రఘునాధపాలేంలో, టేకుల గూడెంలోనూ మనం చూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మిలాఖతై ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణకు చత్తీస్ ఘడ్ బార్డర్ మధ్యలో ఇప్పటికే నాలుగు సాయుధ పోలీసు క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇంకా ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి..
ఒకవైపు ప్రజాఉద్యమాలపై కగార్ సాయుధ నిర్మంధాన్ని తీవ్ర స్థాయిలో కొనసాగిస్తూనే పదుల సంఖ్యలో జరిగిన ఎన్ కౌంటర్లలో వందలాది మంది ఆదివాసులను చాలా కిరాతకంగా హత్య చేశాయి ప్రభుత్వాలు. కానీ ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గాని అదే విధంగా మన పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఆదివాసుల హననానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి కానీ గొంతు విప్పకుండా దానికి మద్దతుగా సాయుధ మిలట్రీ క్యాంపులకు బూటకపు ఎన్ కౌంటర్లకు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాడు తప్ప ఒక ప్రజాస్వామ్యవాదిగా నిలబడలేకపోతున్నాడు. అది సాయుధ ప్రజా ఉద్యమాలపైననే కాదు చివరికి 2021లో చత్తీస్ ఘడ్ లో ప్రజాస్వామిక ఆందోళనతో శాంతియుత ఉద్యమాలను నిర్మించి సమస్యలను పరిష్కరించుకుందామని ఏర్పాటు కాబడ్డ మూలవాసి బచావో మంచ్ ను కూడా నేడు చత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిషేదించింది. అంటే ప్రభుత్వాలకు గాంధేయ ప్రజాస్వామిక శాంతియుత ఉద్యమాలు ఉండకూడదు. కేవలం సాయుధ ఉద్యమాలే ఉండాలి. ఆ సాయుధ ఉద్యమాల అణచివేత పేరుతో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతో సైతం అన్ని హక్కులను అణచివేయడానికి అవకాశం ఉంటుందనే కుట్ర విధానంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.
ఈ స్థితిలో నవంబర్ 23,2000న హత్య కావించబడిన పురుషోత్తం అమరత్వం, హక్కులోద్యమం కూడా ప్రభుత్వాలను రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వాలే ఉద్యమాలను సాయుధం వైపు నెడుతున్నాయనే వాస్తవాన్ని ప్రజాస్వామిక వాదులు ప్రజలందరు గుర్తించాల్సిందిగా ప్రజాస్వామిక వాదుల అమరత్వాల సాక్షిగా మీ ముందుకు తీసుకువస్తున్నాం. మనం మౌనంగా ఉన్నప్పటికి కూడా జరగాల్సిందంతా జరిగిపోతుంది. మనం ఆందోళన చేస్తేనే అన్యాయం కనీసంగానైనా నిలవరించడానికి అవకాశం కలుగుతుంది. ఆ వైపుగా మనందరం పయనించాల్సిన అవసరం ఉందని పౌరహక్కుల సంఘం భావిస్తున్నది.
నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొడంగల్ ఫార్మా అభివృద్ధి పేరిట 20 వేల ఎకరాలను సేకరించాలనే ఒక కుట్ర పద్ధతి కొనసాగుతున్నది. ఫార్మా అభివృద్ధి చిహ్నమైనప్పటికి అంతే స్థాయిలో పర్యావరణ విధ్వంసం అనేది మనందరికి తెలుసు. ఇప్పటికే పటాన్ చెరువు, జీడిమెట్ల ప్రాంతాలు ప్రపంచంలోనే మొదటి కలుషిత ప్రాంతాలుగా చరిత్రలోకి ఎక్కాయి. అక్కడ ఎంతటి విధ్వంసం అంటే గర్భిణీ స్త్రీలు గర్భాలు నిలవకుండా పోతున్నాయి. ప్రజలు నిత్యం అంటీబయాటిక్స్ ను తాగుతున్న నీళ్ళ రూపంలో తీసుకుంటూనే ఉన్నారు. అంతటి విధ్వంసంపై మనం నిర్దిష్ట చర్యలు చేపట్టకుండానే మరొకసారి మూడు పంటలు పండే భూములపై ఫార్మా విధ్వంసాన్ని ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. కొడంగల్ ప్రాంతంలో 6 నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి స్పందించనే లేదు. దుద్యాల మండలం, లగచర్ల, హకీంపేట పోలేపల్లి గ్రామాలలో భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రకటించిన విధానంతో ప్రజలు 6 నెలలుగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ హింసాత్మకంగా మారిందనే విషయం మనందరికి తెలిసిందే, కానీ ఎందుకు హింసాత్మకంగా మారిందనే విషయాన్ని పక్కకు పెట్టిన ప్రభుత్వం ఉ ద్యోగులకు గిరిజనులకు మధ్య వైరుధ్యం వైశమ్యాలను పెంచడం కోసం ఉద్యోగ సంఘాలను రంగంలోకి దింపిన విషయం మనందరికి తెలిసిందే. కానీ అక్కడ స్థానిక గిరిజన ప్రజలు తమ జీవనోపాధి కోల్పోతున్న ఆక్రోశంలో నుంచి వచ్చిన ఆవేశంగా గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇంకా ఇక్కడ ప్రధాన మైన విషయమేమిటంటే భూమి తీసుకోవడానికి కనీసం 2013 భూసేకరణ చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు. అంతే కాక అక్కడ భూమి రేటు ఎకరానికి 60 లక్షలు ఉంటే, తాను మాత్రం 10 లక్షలే ఇస్తాననడంతో ప్రజలు మనోవేధనకు గురయ్యారు. 6 నెలలుగా వస్తున్నటువంటి అసంతృప్తి ప్రజాభిప్రాయ సేకరణ రోజు బద్దలైందనే విషయాన్ని గుర్తించాలి, అంతే గాని ప్రజలు ప్రభుత్వానికి శతృవు కారు, అదే విధంగా ప్రభుత్వం కూడా ప్రజలకు శతృవు కాదు. జరిగినపొరపాటును దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంకా తీవ్రరూపంలో కొనసాగనీయకుండా ఇప్పటికే మేధావులతో ఒక శాంతి చర్చలు కొనసాగించి సమస్యను పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయాణించకుండా అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఆ గిరిజన గ్రామాలపై దాడి చేస్తూ గిరిజన మహిళలపై దుర్మార్గంగా ప్రవర్తించిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజల దృష్టికి బాధిత మహిళలు తీసుకువస్తున్నారు. ఈ విషయంపై నిజ నిర్ధారణ చేయడానికి మహిళా సంఘాలతో పాటు పౌరహక్కుల సంఘం, అదే విధంగా గిరిజన విద్యార్థి సంఘం, లంబాడీ హక్కుల పోరాట సమితి, సేవాలాల్ కమిటీ, రైతు సంఘం లాంటి ప్రజాసంఘాలు ప్రయత్నించాయి. కానీ అందరిని కూడా పోలీసులచే అరెస్టు చేపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
దీంతో మనకు అవగాహనకు రావాల్సిన అంశమేమిటంటే ఎలాగైతే కేసిఆర్ నేరెళ్ళ గ్రామ యువకులపై థర్డ్ డిగ్రీ అప్లై చేయించి తన పతనానికి పునాది వేసుకున్నాడో. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొడంగల్ ఫార్మా అభివృద్ధి పేరుతో లగచెర్ల లో గిరిజన మహిళలపై దుర్మార్గమైన దాడి జరిపి తన పతనానికి కూడా పునాది రాయి వేసుకున్నాడు. ఇప్పటికైనా అక్కడ 144 సెక్షన్ ను తొలగించి అన్ని ప్రజాసంఘాలకు నిజనిర్ధారణ చేసుకునే అవకాశం కల్పించి ప్రజల మౌళిక హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉంది. అంతే కాక తాను సేకరించాలనుకున్న 20 వేల ఎకరాల భూమికి ఏమి ప్రాతిపదిక ఉందో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ముచ్చర్లలో గత ప్రభుత్వం సేకరించిన 14 వేల ఎకరాలకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సి ఉంది. లేనట్లయితే గతంలో ఎట్లయితే ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాలు కోల్పోయి ప్రజలను పోరాట పథంలోకి నెట్టాయో అదే స్థితి రాబోతుందనే విషయాన్ని ప్రజలకు ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం తెలియజేస్తున్నది. పౌరహక్కుల ఉద్యమం అమరుల త్యాగాలు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు పోరాటాలే ఏకైక మార్గమనే ఇప్పటికే తెలియజెప్పుతున్నాయి. అదే విధంగా అమరులు పురుషోత్తం అమరత్వం కూడా మనకు ఆచరణలో నిరూపించింది. అందుకే మనందరం కూడా ప్రజాస్వామిక ఉద్యమాలలో భాగమై ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉద్యమాలు నిర్వహించడమే అమరుడు పురుషోత్తంకు ఇచ్చే నిజమైన నివాళిగా నవంబర్ 23ను గుర్తుచేసుకుందామని తెలియజేస్తున్నాను.
ఎన్.నారాయణరావు,
ప్రధానకార్యదర్శి,
పౌరహక్కుల సంఘం,
తెలంగాణ రాష్ట్రం