వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి చేసిన ఘటనను విడిగా చూస్తే మనకు పరిస్థితి అర్దంకాకపోవచ్చు. ఫార్మా కంపెనీ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించడానికి కారణాలను మనం పరిశీలించాల్సి ఉంది. ఇందుకు గతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటైన ప్రాంతాల్లో గ్రామాల పరిస్థితి ఎలా ఉంది ? అసలు ఫార్మా కంపెనీల వల్ల ప్రజలకు జరిగే నష్టమేంటో తెలుసుకోవాలి.
ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఏర్పాటైన హైదరాబాద్ శివారు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, కాజిపల్లి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో 2020డిశంబర్ 23న బీబీసీ తెలుగు వెబ్ సైట్ ఒక ఆర్టికల్ పోస్ట్ చేశింది. కాజేపల్లి , గడ్డిపోతారం గ్రామాల్లో పర్యటించిన బీబీసీ ప్రతినిధి అనేక మందితో ఇంటర్వ్యూలు చేసి, అక్కడి పరిస్థితిని పరిశీలించి రాసిన ఆర్టికల్ ఇది.
ఈ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఏర్పాటైన హైదరాబాద్ శివారు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, కాజిపల్లి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు బీబీసీ ప్రతినిధి.
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అనుమతిస్తూ 1988 లో సంతకం చేసిన అప్పటి గడ్డపోతారం గ్రామ సర్పంచ్ పులిగల్ల ప్రకాశ్ చారి బీబీసీ తో మాట్లాడుతూ, “ఫార్మా కంపెనీల కారణంగా కాలుష్యంతో మా గ్రామం ఎడారిగా మారింది. కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ 1988లో నాటి గ్రామసర్పంచ్‌గా నేనే సంతకాలు చేశా.
కంపెనీలు వస్తే మా ఊరు బాగుపడుతుందని, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఏర్పాటుకు అంగీకరించాం.
కానీ కాలుష్యం ఈ స్థాయిలో ఉంటుందని మాకు తెలియదు. అధికారులు కూడా హెచ్చరించలేదు. ఉద్యోగాలు రాకపోగా కాలుష్యం కారణంగా ఇక్కడ మనుషులు ఉండటానికి వీల్లేని పరిస్థితి ఉంది.
భూగర్బ జలాలు కలుషితం అయిపోయాయి.పొలాలు పండటం లేదు.గర్భిణుల్లో అబార్షన్లు పెరిగాయి. ఆరోగ్య సమస్యలు అయితే అనేకం” అంటూ చెప్పాడు.
ఆ ప్రాంతంలో గాలిని పీల్చికోవడం ఇబ్బందిగా ఉంది. కళ్ళల్లో మంటలు వచ్చి నీళ్ళు కారిపోయాయని బీబీసి ప్రతినిధి పేర్కొన్నారు.
ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న రసాయనాలు ఆ వూరిలోని అయ్యమ్మ చెరువులో కలుస్తున్నాయి.
వివిన్ డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీ నుంచి విడుదలవుతున్న రసాయనాలు తమ గ్రామం చెరువులోకి చేరుతున్న తీరును గ్రామస్తులు బీబీసీకి చూపించారు.భూమిలోపలి నుంచి బుడగల రూపం వస్తున్న ఎర్రటి నీళ్లు చెరువులో కలుస్తూ కనిపించాయి.దీనిపై కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయగా, అది నిజమేనని మండలి తన నివేదికలో పేర్కొంది.అయితే ఫిర్యాదులు ఇవ్వడం, కాలుష్య నియంత్రణ మండలి మందలించడం, ఆ తర్వాత పరిస్థితి యధాతథంగానే ఉంటోందని గ్రామస్తులు చెప్పారు.

గడ్డపోతారం గ్రామానికి దిగువన కాజిపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ రైతుల నల్లరంగులో ఉన్న వరి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.నలుపు రంగుకు కారణమేంటని బీబీసీ ప్రతినిధి ఆ రైతును ప్రశ్నించారు.
“ ప్రతిసారి వడ్లు ఇలాగే రంగు మారి ఉంటాయి. రసాయినాలతో కలుషితమైన నీరు నా పొలంలోకి నేరుగా వస్తుంది.
పొలంలో ఉన్న పంటంతా కలుషితమైపోతుంది. దానికి తోడు ఈసారి వర్షం పడింది. దాంతో నా పొలం మొత్తం మునిగిపోయింది” అని ఆయన అన్నారు.
“మా గ్రామంలో ఫార్మా కంపెనీలు లేవు. కానీ పైన గడ్డపోతారంలో కంపెనీలలో రసాయినాలు, అలాగే చుట్టూ ఉన్న కంపెనీల నుంచి పారుతున్న రసాయినాలు మా గ్రామం మీదుగా పారుతాయి” అంటూ రంగుమారి నురగతో ఉన్న కలుషిత నీటిని చూపించారు కాజిపల్లి సర్పంచ్ సత్యనారాయణ.

కంపెనీలలో కలుషిత రసాయినాలను ట్రీట్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే అవి బయటకు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివిన్ డ్రగ్స్ ఫార్మా కంపెనీపై స్థానికులు చేసిన ఫిర్యాదులపై కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేధిక సారాంశం కూడా అదే.
ఇది ఒకటి రెండు గ్రామాలకు సంబంధించిన సమస్య కాదు. ఈ కంపెనీలు పర్యావరణాన్ని నాశనం చేయడమే కాదు. స్థానిక ప్రజలకు అసలు జీవనమే లేకుండా చేస్తున్నాయి.
ఫార్మా క్ అంపెనీలు పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారీ ఎత్తున ఉత్పత్తి, రసాయనాల ఉపయోగం, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి కారణాల వల్ల ఫార్మా కంపెనీలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.
ముఖ్యమైన సమస్యలు
రసాయన వ్యర్థాల వల్ల నీరు, భూమి కాలుష్యం: ఫార్మా కంపెనీలు ఉత్పత్తి ప్రక్రియలో విడుదల చేసే రసాయనాలు నీటి వనరులను కలుషితం చేసి జలచరాలకు ప్రమాదం కలిగిస్తున్నాయి. అలాగే, భూమిని కూడా కలుషితం చేసి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
వాయు కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు: ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వాయు కాలుష్యం శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల: ఔషధాల ప్యాకేజింగ్‌కు విస్తృతంగా ఉపయోగించే ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి.
గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు: ఫార్మా కంపెనీల కార్యకలాపాలు గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలకు దోహదపడి గ్లోబల్ వార్మింగ్‌ను తీవ్రతరం చేస్తున్నాయి.
మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం: ఫార్మా కంపెనీల కాలుష్యం వల్ల కలిగే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వంటి సమస్యలు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో వందల చదరపు కిలోమీటర్ల మేర గాలిని పీల్చలేము. ఆ గాలిని పీలిస్తే క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు రావడం తథ్యం. గాలి పీల్చకుండా బతకలేం కదా ! ఇక నీరు కూడా మొత్తం కాలుష్యమయమవుతుంది. చుట్టుపక్కల చెరువులు, కుంటలు, నదులు కాలుష్యమవడమే కాదు. భూగర్భజలాలు కూడా కాలుష్యమయమైపోతాయి. అక్కడి నీళ్ళు తాగలేము. ఆ నీళ్ళతో వ్యవసాయం చేస్తే ఆ వచ్చిన పంటలను తినేవాళ్ళకు కూడా అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. ఆ ప్రాంతంలో భూమి కూడా కలుషితమై పోతుంది. ఆ భూమిలో పంటలు పండవు. ఒకవేళ కొంత మేర పండినా తినడానికి, వేరే రకంగా ఉపయోగించడానికి ఏ మాత్రం పనికిరావు. వాటు వల్ల క్యాన్సర్, శ్వాస కోశ వ్యాధులు, ఎముకలు పెళుసుగా అయిపోవడం లాంటి అనేక రకాల వ్యాధులు వస్తాయి.

ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణం నాశనమవుతుందని, ప్రజలకు చనిపోవడం తప్ప మరో మార్గమే ఉండదని తెలిసినా తమ లాభాల కోసం వ్యాపారులు కంపెనీలు ఏర్పాటు చేస్తాయి. వారితో ఉండే ఆర్ధిక లావాదేవీల వల్ల రాజకీయపార్టీలు సహకరిస్తాయి.

ఇప్పుడు రేవంత్ చేస్తున్నదే. అప్పుడు కేసీఆర్ చేశాడు…
ఇప్పుడు లగచర్ల వద్ద ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష బీఆరెస్ తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటి. ప్రజలను, పర్యావరణాన్ని నాశనం చేసే అనేక కంపెనీల ఏర్పాటుకు అనుమతించింది. వ్యతిరేకించిన ప్రజలపై పోలీసులతో దాడులు చేయించింది.
కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు పూనికొని అనేక ఫార్మా కంపనీలను హైదరాబాద్ కు అతి దగ్గరలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు, కడ్తల్ మండలాల మధ్య ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్ అకేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ కోసం 2015లో ఆదేశాలు జారీ చేసింది.19,333 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన స్థానికులు అనేక ఆందోళనలు చేశారు. వీరిపై బీఆరెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఫార్మా సిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల వెనక కొన్ని స్వార్ద రాజకీయ శక్తులున్నాయని అప్పటి మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడాయనే లగచర్ల ప్రజల పోరాటానికి మద్దతిస్తున్నారు.
యాచారం వద్ద ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న కొన్ని గ్రామాల ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు హైకోర్టుకు వెళ్ళగా భూసేకరణపై కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత బీఆరెస్ ఓడిపోవడంతో ఫార్మాసిటీ ప్లాన్ ఆగిపోయింది. కానీ పేరు మార్చిన రేవంత్ సర్కార్ ఫార్మా విలేజెస్ అని ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయపూనుకుంది.
ఇప్పుడు రేవంత్ స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఫార్మా కంపెనీ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించడంతో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి వెళ్ళిన జిల్లా కలెక్టర్ పై దాడి జరిగింది. చాలా కాలంగా అక్కడి ప్రజలు ఫార్మాకంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. భూసేకరణ కోసం వచ్చిన అధికారులకు సహకరించడంలేదు. ఈ నేల 11వ తేదీన ఆ గ్రామం వెళ్ళిన కలెక్టర్ పై దాడి జరగడంతో ఈ దాడి చేయించింది బీఆరెస్ నాయకులే అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ నాయకుడు పట్నం నరేంధర్ రెడ్డితో సహా 55 మందిని అరెస్టు చేశారు.
నిజానికి బీఆరెస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ, టీడీపీ, వైసీపీ…మరే పార్టీ అధికారంలో ఉన్నా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటారని మనకు చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తన రాజకీయ స్వార్దం కోసం బీఆరెస్ ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నది. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకించాడు. పోరాడే ప్రజలకు మద్దతు ప్రకటించాడు. తమ జీవితాలు నాశనం కాకుండా ప్రజలు చేస్తున్న పోరాటాలకు రాజకీయపార్టీల మద్దతులో ఏ మాత్రం నిజాయితీ ఉండదు. అందుకే తమ బతుకు కోసం ప్రజలే ఐక్యంగా నిలబడాలాల్సిన అవసరం ఉంది. ఒక్క లగచర్ల మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల, పట్టణాల ప్రజలు తమ జీవించే హక్కును కాపాడుకోవడం కోసం పోరాడాల్సి ఉన్నది. పోరాడే ప్రజలకు మనందరం మద్దతుగా నిలబడాలి.